శ్రీ దేవీ భాగవతం

శ్రీ మద్దేవిభాగవతం🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

_*శ్రీ దేవి భాగవతం - 1 వ అధ్యాయం*_

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీ గణాధిపతయే నమః*

*శ్రీ మాత్రే నమః*

*స్వామియే శరణం అయ్యప్ప*

*శ్రీ దేవీ భాగవతమ్‌*

*ప్రథమస్కంధము - మొదటి అధ్యాయము*

మా బుద్ధుల నాత్మచింతనమునకై ప్రేరించు దేవియు సర్వ చైతన్యరూపయు ఆద్యయు మహావిద్యయు నగు శ్రీ భగవతిని ధ్యానింతుము.

శ్రీ దేవీ రూప పరిణామమే సకల చిదచిదాత్మక చరాచరాత్మక జగత్తులగుటచే నామె సర్వరూప. ఆమె చిద్రూపయగుటం జేసి చైతన్య రూప. చైతన్యాత్మికయగు నామెయొక్క పరిణామమగు నీ జగములు నందలి సకలభూతములును చిద్రూపములే కావలయును. కావున నామె సర్వభూతములయందలి చైతన్యమును నై యున్నది. ఆ దేవి సర్వమునకును ఆద్యయును పరతత్త్వ సాక్షాత్కారమునకు సాధనమగు విద్యయును. అట్టి విద్య యొక్క రూపములలో సర్వ శ్రేష్ఠ మగుటచే నాద్య యగునది ప్రణవము. అది ఆద్య. అ+ఆద్య. అకార ఉకార మకారములు ఓమ్‌. అకారము ఆది వర్ణముగా గలది. ఆ ప్రణవ విద్య యొక్క విస్తృత రూపమే గాయత్రీ మంత్రము. ఆ రూపమున శ్రీదేవీ తత్త్వమును ప్రతిపాదించుటయే శ్రీదేవీభాగవతమునందలి ప్రధాన తత్త్వము. శ్రీ గాయత్రీ మంత్రముయొక్క రూపాంతరమే శ్రీ పంచదశీ మహావిద్య. ఆ విద్యయొక్క 'కాదివిద్యా' రూపమునకు ఆది విద్య యని శాస్త్ర సంకేతము. విద్యకును విద్యా ప్రతిపాద్య తత్త్వమునకును అభేదమే కావున ఆ దేవి ''ఆది విద్యా'' యగును. శ్రీపంచదశీ మహావిద్యయొక్క సునిష్కృష్ట రూపమగు శ్రీ షోడశాక్షరీ విద్యయు నంతే. శ్రీదేవి శబ్ద బ్రహ్మాత్మిక. అట్టి పరాది వాగాత్మక శక్తి మాతృకారూప. అవి అకారాదికములు గదా! అందుచేత నామె ''ఆద్యా విద్యా'' అ-ఆద్యా=అకారము ఆదిగా గలది. ఆ దేవి మనయందర బుద్ధి తత్త్వములను ప్రేరించును. ఆ ప్రేరణకు మూలము సంకల్పము - అనగా - ఇచ్ఛ. బుద్ధి అనగా ఆయా కృత్యముల గూర్చిన జ్ఞానము. జ్ఞానము ననుసరించి సృష్ట్యాది కృత్యములు జరుగును. ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తులు మూడును ఆ దేవి రూపములే. ఇట్లు ఆమె శక్తిత్రయరూప త్రిగుణాత్మక మాయారూప , మాయా పరిణామ జగద్రూప. మాయా పాశమోచన సాధన విద్యారూప అని యీ గాయత్రీ ఛందోరూపమగు శ్రీదేవీ ప్రార్థనము సూచించుచున్నది.

ఇట్లు సర్వజ్ఞత్వ సర్వశక్తిమత్త్వాది లక్షితమైన శ్రీదేవీ రూప మాయా శబలిత బ్రహ్మ మీ మంగళ శ్లోకమున ప్రార్థింపబడుచు న్నది. మాయా శబల బ్రహ్మను ఇచట ధ్యాన విషయమగుటచే నట్టి తత్త్వము నిష్క్రియము కాదు కావున మా బుద్ధి వృత్తులను ప్రేరించుగాక ! అని శ్రీదేవిని ప్రార్థించుట సముచితము.

*శౌనకముని సూతుని పురాణములగూర్చి ప్రశ్నించుట*

*శౌనకముని యిట్లనెను :* ఓ పురుషర్షభా మహాభాగా సూతమహామునీ! మేలు చేకూర్చు పురాణ సంహితలన్నియును నీచే చక్కగ నధ్యయనము చేయబడినవి. నీవు కడు ధన్యుడవు. ఓ సుకృతీ! వేద వ్యాసమహర్షి దివ్యములగు పదునెనిమిది పురాణములను ప్రపంచించగా వానిని నీవు చక్కగ చదివితివి. ఆ పురాణములు సర్గము ప్రతిసర్గము వంశము మన్వంతరము వంశానుచరితము నను నైదు లక్షణములతో నొప్పారుచు రహస్య విషయములతో గూడియున్నవి. అట్టివాని నెల్ల నీవు సత్యవతీ పుత్రుడగు వ్యాసుని వలన నెఱింగితివి. అట్టి నీవు మా పుణ్యవశమున నీ యుత్తమ పుణ్యక్షేత్రమున కరుదెంచితివి. ఈ క్షేత్రము ఉత్తమమును దివ్యమును మునులకు విశ్రామ ప్రదేశమును పుణ్యకరమును కలిదోష శూన్యమునునై యున్నది. ఈ మా మునిగణము పుణ్యప్రదమగు పురాణ సంహితను వినగోరుచున్నది. కనుక మాకు దానిని సమాహితచిత్తుడవై వివరింపుము. నీవు సర్వజ్ఞుడవును మహానుభావుడవును. నీవు ఆధిభౌతిక ఆధ్యాత్మిక ఆధిదైవికములను తాపత్రయములు లేనివాడవు. మాకిపుడు వేద తుల్యమగు పురాణ సంహితను వివరించి చిరకాలము చల్లగ వర్ధిల్లుము. రసాస్వాదన సమర్థులై చెవి మున్నగు నింద్రియములు కలవారైనను పురాణములు వినని మనుజులు దైవ వంచితులే కదా! ఈ నాలుక షడ్రసములచే నాహ్లాద మొందినట్లు మహాత్ముల వచనములు వినుటవలన చెవి ఆహ్లాదము చెందును. చెవులులేని పాములును ఆకాశగుణ మగు శబ్దములచే మోహితములగును. చెవులుండియు సత్కథలు వినని నరులు చెవులు లేనివారేల కారు? ఈ కారణమువలన మా ద్విజులెల్లరము కలిభయ పీడితులమై పవిత్రమైన ఈ నైమిశారణ్య క్షేత్రమును జేరి సావధానముగ సత్కథలు వినగోరుచున్నారము.

*ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ అష్టాదశ సాహస్య్రాం సంహితాయాం*

ఈ కాలచక్ర మేదోవిధముగ గడచి పోవుచునే యుండును. కాని యది మూర్ఖులకు వ్యసనములతోను పండితులకు శాస్త్ర చింతనములతోను గడచుచుండును. ఈ శాస్త్రములును విచిత్రములైనవి. అవి నానార్థవాదములతో తర్కముతో జల్పముతో వితండ వాదముతో యుక్తిప్రయుక్తులతో రోషగర్వములను కలిగించును.

లఘుటీక : అర్థవాదము=స్తావకము, జల్పము=పరపక్షమును నిరాకరించుచు స్వపక్షమును స్థాపించుచు జయేచ్ఛతో చేయు ప్రసంగము, వాదము=యథార్థము తెలిసికొనుటకై చేయు చర్చ, వితండ=స్వపక్షమును స్థాపించక పర పక్షమును ఖండించుచు చెప్పు వాక్యము, ఛలము=విపరీతార్థకల్పనచే పరవచనవిఘాతము. (పరిష్కర్త)

ఆ శాస్త్రములలో వేదాంతము సాత్త్వికము మీమాంస రాజసము న్యాయశాస్త్రము హేతువాద యుక్తము అగుటచే తామసము నై యొప్పుచుండును. పురాణములు త్రిగుణములతో త్రివిధములై కథలతో కూడియుండును. పంచలక్షణములతో వెలయు ఆ పురాణములు నీవు చెప్పితివి. వానిలో శ్రీ దేవీభాగవత మైదవది. పుణ్యప్రదమైనది. వేదసదృశము. సర్వ లక్షణ సంయుతము. అన్నిటి కంటె శ్రీ భాగవతము ముముక్షువులకు ముక్తిని ధర్మాత్ములకు ధర్మఫలమును సకాములకు కామఫలమును నొసంగగల దగుటచే పరమాద్భుతమైనది. అట్టి దానిని నీవు నామగ్రహణ మాత్రమున చెప్పితివి. ఇపుడా దివ్యమై శుభకరమైన శ్రీ దేవీ భాగవత పురాణోత్తమమును ఆదరముతో మాకు విశదముగ నభివర్ణింపుము. దాని నిచటి ద్విజులెల్లరము విన వేడుకపడుచున్నారము. ధర్మజ్ఞుడవగు సూతా! గురుభక్తి సత్త్వగుణము గలిగిన వాడవగుటచే నీవే వ్యాసముని ప్రోక్తమైన పురాణ వాఙ్మయమును బాగుగ నెఱింగియున్నావు అనునది నీయందలి విశేషము. పురాణతత్త్వ సర్వస్వము నెఱిగిన వాడవు. నీ నోట నెన్నియో పురాణములను వింటిమి. కాని మా కిపుడు అమృత పానముచే నమరులకు వలె మాకు అంత మాత్రమున తృప్తి గలుగుటలేదు. ఎన్నటికిని ముక్తి నీయజాలని యమృతము గ్రోలుట వ్యర్థమే గదా! ఎందువలన ననగా, భాగవతామృతమును త్రాగినచో నరుడు బంధమునుండి వెంటనే విముక్తు డగును. మే మమృతపానము గోరి యెన్నెన్నో జన్నము లొనరించితిమి. కాని యీనాటికిని మాకు పూర్తిగ శాంతి చేకూరలేదు. యాగములకు ఫలితముగ సర్వ ప్రాప్తిగలుగును. కాని యా స్వర్గమునుండి తిరిగి పతనము గలుగును. ఈ విధముగ నీ సంసార చక్రమునందు నిరంతరముగ భ్రమణము గలుగుచునేయుండును. సత్త్వ రజస్తమోరూపమగు నీ కాల చక్రమునబడి తిరుగుచున్న నరులకు తత్త్వజ్ఞానము లేకుండ నెన్నటికిని ముక్తి కలుగదు. కనుక ముముక్షువులకు ప్రియమై రహస్యమై ముక్తిప్రదమై పవిత్రమై సర్వరస భరితమై యొప్పారు శ్రీ దేవీభాగవత మహాపురాణమును మాకు తేటతెల్ల మొనరించుము.

*ఇది పదునెనిమిదివేల శ్లోకములుగల శ్రీ దేవీభాగవత మహాపురాణమందలి*

*ప్రథమ స్కంధమందు శౌనక కృత ప్రశ్నమను ప్రథమాధ్యాయము.*
[సేకరణ:-యాద బాలరాజేశం]_*శ్రీ దేవి భాగవతం - 4 అధ్యాయము*_

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీ వ్యాసమహర్షి పుత్త్ర సంతతికై పరితపించుట*

☘☘☘☘☘☘☘☘☘

*ఋషు లిట్లనిరి:*   ఓ సౌమ్యా ! ఈ పురాణసంహితను వ్యాసునివలన పఠించిన శుకుడెట్టివాడు? వ్యాసుని యే భార్యయందీతడు జన్మించెను. నీవు శుకు డయోనిజుడని యరణి సంజాతుడని వచించితివి. ఈ విషయమై మాకు సందియము గల్గుచున్నది. కనుక శుకుని జన్మవృత్తాంతము వివరించి మా సందేహము బాపుము. మహాతపస్వియగు శుకుడు గర్భయోగియని మేము వింటిమి. అత డీ విస్తృతమగు పురాణమెట్లు వినగలిగెను? సూతు డిట్లనియె: ఒకానొకప్పుడు సత్యవతి సుతుడగు వ్యాసుడు సరస్వతీ నదీ తీర మందొక యాశ్రమమున నివసించుచుండెను. అచ్చటనున్న రెండు గోరువంకలను చూచి వ్యాసుడు విస్మయమొందెను. ఆ పక్షులు గ్రుడ్డునుండి యప్పుడే వెడలిన తమ ఱక్కలురాని పిల్లను గూటిలోనే వదలినవి. దాని ముక్కెఱ్ఱగ నున్నది. దానికింకను తోక యీకలు రానేలేదు. అది యెంతయో చూడ ముచ్చట గొల్పుచున్నది. ఆ పిట్టల జంట తమ సంతానమునకు భక్ష్య మందించుట కాసక్తితో పూనుకొనెను. అవి తమ ముక్కుపుటములతో మెతుకులు దెచ్చి దెచ్చి తమ పిల్లనోటిలో మాటిమాటికి పెట్టుచుండెను. అవి తమ యంగములతో దాని యంగములు తాకుచు దాని యెఱ్ఱని ముద్దులు గారు మోమును పలుమారు ప్రేముడితో ముద్దిడుకొనుచు సంబరము పడుచుండెను. ఇట్లా పక్షులు రెండును తమబిడ్డపై చూపు ప్రేమను గని వ్యాసుడు చింతాతురుడై నెమ్మది నిట్లు తలపోయసాగెను: ఆహా! తిర్యగ్జంతువులు సైతము తమ పుత్త్రులపై గుండెనిండిన ప్రేమను గురియునుగదా! ఇంక సేవాఫలమాశించి తమ పుత్రులను ప్రేమించు మానవులలో నిదియుండు ననుటలో వింత యేమున్నది? ఈ పక్షులు తమ పుత్త్రునకు సుఖసాధనమగు పెండ్లి జరిపి తమ కోడలి యందాల మోముగాంచి సంతసించునా?

ఈ పక్షి శాబకము ధర్మమతితో పున్నెము బడయగోరి తన ముదుసలి తల్లిదండ్రులను పూలలోబెట్టి పూజించి వారిని ప్రసన్నులను చేయజాలునా? డబ్బు గడించిన తన తల్లిదండ్రులను తృప్తిపఱచునా? అవి చనిపోవగా వానికిది యుత్తర క్రియలు నెరవేర్చునా? గయకేగి గయాశ్రాద్ధ మాచరించునా? తన పితరుల నుద్దేశించి సక్రమమున నీల వృషోత్సర్జనము జరుపునా? పుత్త్రునంగములు నిమిరి ముద్దిడి లాలించి బుజ్జగించి పుత్త్రగాత్ర పరిష్వంగ సుఖంబు సేకొనుటయే తల్లిదండ్రుల కీ ప్రపంచమం దుత్తమోత్తమ సుఖము సేకొనుటని పెద్దలు నొక్కి వక్కాణింతురు. పుత్త్రులు లేనివారికి సద్గతులు గలుగ నేరవు. స్వరము లభించదు. కనుక పరలోకము జేరుటకు పుత్త్రుల బడయుట కంటె వేరొండు సాధనము గనిపించదు. పుత్త్రవంతుడే స్వర్గసీమ నలంకరించగలడు. పుత్త్రహీనుడు దానిని జేరజాలడని ఎల్ల ధర్మశాస్త్రములయు మన్వాదిమునులయు వచనము. పుత్త్రవంతుడే సకల దురిత బంధములనుండి విముక్తుడగు ననుటకు శాశ్వతమైన యాప్తవచనమగు వేదమును సాక్ష్యముగ నున్నది. ఈ విషయము సందేహించుట కెంతమాత్రము వీలులేదు. చావు మొగముతో నున్నవాడు భూశయనము సేయబడియు తానపుత్త్రకుడగుటను గూర్చి చింతాకులుడై లోలోన వగచి వగచి కుమిలి కుమిలి యిట్లు పొగులు చుండును. ''నేడు నా యీ గృహము ధనధాన్య రాసులతో పెక్కు విధములగు పాత్ర పుంజములతో కలకల లాడుచున్నది. దీని కికముందు ఎవడు స్వామి కాగలడో గదా!'' అని యిట్టు లా పుత్త్రహీనుని మనస్సు దుఃఖమున పరిపరి విధముల పరిభ్రమించు చుండును. అత్తఱి నట్టి వ్యాకుల చిత్తునకు దుర్గతులు గా కింకేమి గల్గును!

ఇటుల సత్యవతీ సుతు డనేక విధముల చింతించి వేడినిట్టూర్పులు నిగుడించెను. విమనస్కుడయ్యెను. వ్యాసుడట్లు కొంతతడవాలోచించి తుదకు మేరుగిరిపై నుగ్రతప మాచరించుటకు నెమ్మదిలో గట్టిగ నిశ్చయించుకొనెను. నే నిపు డేదేవత నుపాసించవలయును? వరములు గురియుటలో నే దేవత సమర్థురాలు? ఏ దేవి త్వరితగతిని వాంఛితార్థము లీడేర్చగలదు? అని వ్యాసుడు విత్కరించుకొనుచుండెను. శ్రీ గణపతి బ్రహ్మ విష్ణువు మహేశుడు రవి వరుణుడు సురేంద్రుడు సుబ్రహ్మణ్యుడు అగ్ని-వీరలలో నే నెవ్వరి నారాధించవలయును? అని వ్యాసుడు తలంచుచుండు నంతలోనే నిర్మలాత్ముడు మునిసత్తముడునగు నారదుడు చేత మహతిబూని యాదృచ్ఛికముగ నట కరుగుదెంచెను. అంత వ్యాస మహర్షి దేవర్షిని సందర్శించి ప్రసన్నుడై యతనిని గూర్చుండ నియోగించి అర్ఘ్యపాద్యాది విధుల సత్కరించి కుశల మడిగెను. కుశల ప్రశ్నములైన పిమ్మట నారదుడు వ్యాసున కిట్లనియెను: ఓ ద్వైపాయనా! నీవేల చింతాకులుడవై కనిపించుచున్నావు? నాకంతయు వేగమే తెలుపుము.

వ్యాసుడిట్లనెను: సంతానము లేనివానికి సద్గతులు గలుగవు. వాని యాత్మకు శాంతియును గలుగదు. అందులకే నేనును చింతించుచు పలుమారు విలపించుచున్నాను. సంతతి బడయుటకు నే నేదేవతను ప్రసన్ననుగా చేసికొనవలయును? సకలార్థము లొసగు దేవి యెవ్వరనునది తెలియక విచారించుచున్నాను. ఆ విషయము తెలుపుమని నిన్నే శరణు వేడుచున్నాను. మహర్షీ! నీవు దయగలవాడవు. సర్వజ్ఞుడవు. నే నేదేవతను శరణువేడిన ఆమె సుప్రసన్నయై త్వరగ నాకు పుత్రుని ప్రసాదించగలదో తెలుపుము. సూతుడిట్లనియె: అటుల వ్యాసుడడుగగా వేదవిదుడు నారదుడు పరమప్రీతితో నతని కీ ప్రకారముగ సమాధానము నొసగెను. నారదు డనియె: ఓ మహాభాగా! పారాశర్యా! నీవు నన్నడిగిన ప్రశ్ననే నా తండ్రి బ్రహ్మ తొల్లి మధుసూదను నడిగెను. నా తండ్రియగు బ్రహ్మ ధ్యానమున మునింగి శ్రీనాథుడు జగత్పతి దేవేశుడునగు శ్రీహరిని సందర్శించి విస్మయమంది యతని నుతించుచు నిట్లనియెను. ఆ హరి చతుర్భుజుడు. శంఖ చక్ర గదా పద్మధరుడు. పీతాంబరుడు. కౌస్తుభ మణి ప్రభలు దీపిల్లువాడు. దివ్య శ్రీవత్సాంకితమైన వెడదఱొమ్మువాడు. సకలలోక శరణ్యుడు దేవదేవుడు జగన్నాథుడు విశ్వగురుడు మహాతపుడునగు శ్రీహరియు తపమొనర్చుచుండగా జూచి యతనిని నా తండ్రి శరణు వేడెను. బ్రహ్మ యిట్లనెను: ఓ జగన్నాథా! నీవు దేవేశుడవు. భూత భావి వర్తమానములపై నధికారముగల ప్రభువవు. నీవేరిని గూర్చి తపించుచున్నావు? ఏ పరతత్త్వమును ధ్యానించుచున్నావు ? అఖిల జగత్ప్రభుడవగు నీవే ధ్యానము చేయుచున్నావే. దీనిని మించిన యాశ్చర్యకర మేమున్నది? నాకిదంతయు వింతగ దోచుచున్నది. నీ బొడ్డుతమ్మినుండి పుట్టిన నేనే యీ విశ్వమునకు సృష్టికర్తను. ఇంక నీకంటె నధికుడెవడైన నున్నచో వానిని గూర్చి నాకు తెలుపుము. నీవే యీ లోకముల కన్నిటికిని కర్తవు భర్తవు హర్తవు. సర్వకారణములకు నీవు మూలకందము. సర్వ కార్యదక్షుడవు నీవే యని నేను బాగుగ నెఱుగుదును. నీ సంకల్ప బలముననే నే నీ జగములు రచింప శక్తుడనైతిని. ఆ హరుడును లయకాలమున నీ కోరికమేరకే లోకములనెల్ల సమయింపజాలును. నీ యాజ్ఞ చేతనే నింగిపై వేవెలుగు భ్రమించుచున్నాడు. వాయువు చల్లగా వెచ్చగా వీచును. అగ్ని ప్రజ్వలించును. మేఘము వర్షించును. నిన్ను మించిన పరదైవతమును నేనీ ముల్లోకములందింతకు ముందు చూచి యెఱుగను. అట్టి నీవును ధ్యానమున నుండుట జూడగ నాకు గొప్ప సందియము గలుగుచున్నది. నేను నీకు పరమ భక్తుడను. నాపై దయదలచి నాకంతయును తేటతెల్లముగ దెలుపుము. మహాత్ములకు తఱచుగ తెలుపరాని రహస్యములుండవని స్మృతి పలుకును.

అను బ్రహ్మ వినయవాక్కులు విని హరి యతనికిట్లు పలికెను: వత్సా! ఏకాగ్ర చిత్తమున నాలకింపుము. నా మనోగతమును వెల్లడించుచున్నాను. నీవీ యెల్లలోకములను పుట్టించువాడవని నేను పోషకుడనని రుద్రుడు సంహారకుడని నీవు దలంచుచున్నావు. సకల సురాసురులు మనుజులు నట్లే తలంతురు. నీవీ యెల్ల భువనములు పుట్టించుటకును నేను పెంచుటకును హరుడు ద్రుంచుటకును కారకులము. ఐనను వేదపారగులగు మహాశయులీ సర్వ మొకేమూలప్రకృతి - పరాశక్తి - మూలమున జరుగుచున్నదని భావింతురు. ఈ లోకములెల్ల పుట్టించుటకు నీయందు రాజసశక్తియు పెంచుటకు నాలోన సత్త్వశక్తియు త్రుంచుటకు హరునియందు తామస శక్తియు గలదని శాస్త్రమున చెప్పబడియున్నది.

ఆ మహత్తరశక్తియే లోపించినచో నీవు సృష్టి కృత్యమును జేయజాలవు. నేను పరిరక్షింపనోపను. హరుడు దెగటార్ప నశక్తుడు. మనమెల్లరమా దివ్యపరశక్తికి పరతంత్రులమై వర్తింతుము. దీనినిగూర్చి ప్రత్యక్ష పరోక్ష ప్రమాణములును గలవు, వినుము. నేను ప్రళయకాలమునందు పరతంత్రుడనై శేషశయ్యపై యోగనిద్రంజెందుదును. మరల కాలవశుండనై తగిన సమయము వచ్చినపుడు మేల్కాంతును. ఆ దేవికి వశుడనై నే నెల్లకాలమును తపమాచరించుచుందును. ఒక్కొక్కప్పుడు శ్రీ లక్ష్మితోడ యథా సుఖముగ విహార మొనర్చుచుందును. ఒక్కొక్కతఱి క్రూరదానవులతో దారుణము సర్వలోకభీకరమునై దేహములను నింద్రియములను బాధించు సమరము జరుపుదును. మున్ను నేను మహాజలరాశిపై నైదు వేలేండ్లు ఘోర బాహుయుద్ధము సలిపితిని. అది నీకు ప్రత్యక్ష విదితమేగద! నా చెవులమలమునుండి పుట్టి మదమున విఱ్ఱవీగిన మధుకైటభులను దుష్టదానవులా దేవదేవి దయవలననే నాచే దనుమబడిరి. ఆనాటి నా విజయశ్రీకి కారణము నీ వెఱుంగవా? ఓ మహాభాగా! ఆ పరాత్పర శక్తియే దానికి మూలకారణము. అట్టి శక్తిగూర్చి పదేపదే ఏల యడుగుదువు? ఆమె ఇచ్ఛ చేతనే నేను మొదట మణి ద్వీపమున స్త్రీరూపమునుండి అనంతరము సముద్రమున పుం రూపమున విష్ణుడనై విహరించుచున్నాను. ఆ తల్లి దయవలననే గదా యుగయుగమున కూర్మ వరాహ నరసింహాద్యవతారములు దాల్చుచుందును. ఈ తిర్యగ్యోనులందు పుట్టుట కెవ్వడిచ్చగించును? నాకే స్వేచ్ఛయున్నచో వరాహాది యోనులందు నేనేల జన్మింతును? లక్ష్మితోడి వినోదవిహారములు వదలి చేప మున్నగు నీచయోనులందు బుట్టుట కెవ్వనికి మనసొప్పును? పాపఱని సెజ్జవదలి గరుటామంతుని మూపుపైనెక్కి స్వతంత్రేచ్ఛతో ఏవాడు బవరమొనర్ప నుత్సహించును? మునుపొకప్పుడు నీవు చూచుచుండగనే వింటి యల్లెత్రాటిచేత నా తల తెగిపడినదిగదా! శిల్పనిపుణుడగు త్వష్ట వెనువెంటనే గుఱ్ఱముతలదెచ్చి నా మొండెమున కతికించెను. ఆనాటి నుండి నన్ను హయగ్రీవుడనుచున్నారు. ఇదంతయును లోకవిడంబనమేసుమా! నా కాత్మ స్వాతంత్య్రమే యున్నచో నిట్లెట్లు జరుగును? కాన నేను స్వతంత్రుడనుగాను. సర్వవిధముల శక్తి పరతంత్రుడను. అందుచేత నేనా శక్తినే రేయింబవళ్లెడతెగక ధ్యానించుచుందును. ఇంతకుమించి నాకేమియు తెలియదు. నారదుడిట్లనియె: ఈ ప్రకారముగ విష్ణువు బ్రహ్మతో బలికెను. ఓ వ్యాసమునీ! నేనా బ్రహ్మవలన సర్వము వింటిని. కనుక నీవును నిత్యకల్యాణ ప్రదమగు పురుషార్థ ప్రాప్తికి బూనుకొని ఆ దేవీ పదకమలములను నీ హృదయారవిందమున నిరంతరము భజింపుము. నీవు కోరినదెల్ల ఆ తల్లియే ప్రసాదించుచుండును. ఇందు సందియ మావంతయును లేదు. సూతు డిట్లనియె: నారదుడీవిధముగ దెలుపగా వ్యాసుడా దేవి దివ్యచరణారవిందములను లోనిడెందమున దలంచుచు తపము చేయుటకు పర్వతము జేరెను.

*ఇది శ్రీ దేవీభాగవత మహాపురాణమందలి ప్రథమస్కంధమందలి చతుర్థాధ్యాయము.*_*శ్రీ దేవి భాగవతం - 5 వ అధ్యాయము*_

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీ హయగ్రీవావతారవర్ణనము*

☘☘☘☘☘☘☘☘☘

*ఋషులనిరి:* ఓ సూత మహర్షీ! లోకములకు వింత - యచ్చెరువు గొలుపు కత మాకు వినిపించితివి. అది విని మా మనంబులు సంశయ సాగరమున కొట్టుమిట్టాడుచున్నవి. ఆ భగవానుడు మాధవుని తల శరీరమునుండి తెగిపడినదనియు ఆ విశ్వకర్తయగు జనార్దనుడు హయగ్రీవ రూపము దాల్చెననియు అంటివి. దేవతలెల్ల రేదేవ దేవుని ప్రస్తుతింతురో విబుధులెల్లరు సర్వము తానయైన యే విష్ణువు నాశ్రయింతురో అతడే జగన్నాథుడు - ఆదిదేవుడు - సర్వకారణ కారణుడును. అట్టివాని తలయును ఎట్టి విధియోగమున దెగిపడినది? ఆ కథయంతయును మాకు విశదముగ తెలుపుము. సూతుడిట్లనియె: ఓ మునులారా! దేవదేవుడును పరమతేజస్వియగు శ్రీ మహావిష్ణుని పావన చరిత సావధానముగ చెవులార వినుడు. సనాతనుడును భగవానుడు నగు జనార్దనుడు తొల్లి పదివేలేండ్లు భీకరమైన పోరాటము సలిపి మిక్కిలి యలసట జెందెను. అపుడతడు సమప్రదేశమున పద్మాసనముపై కూర్చుండి ఎక్కు పెట్టిన విల్లు తన కంఠ పురోభాగమునకు నానించుకొని అలసట చెందియుండుటచే వింటికొనపై తన మేనిబరువంతయు నుంచి నిదురించెను. కొంతకాలము గడిచిన పిమ్మట నింద్రుడు మున్నగు దేవతలెల్లరును బ్రహ్మతోగూడి యొక యాగము సేయదలంచిరి. మహాయజ్వయగు విష్ణువే దేవకార్యము నెరవేర్చుటకును యాగాధిపత్యము వహించుటకును సమర్థుడని తలచి బ్రహ్మాదులు జనార్దనుని దర్శింప వైకుంఠమేగిరి.

అచట వారికి హరి కనబడలేదు. వారు జ్ఞానదృష్టితో విష్ణుడున్న జాడ నెఱిగి యచ్చోటి కరిగిరి. నిశ్చలముగ యోగనిద్రలో మునిగిన జగత్పతిని విభుని ఈశానుని గనుంగొనిరి. బ్రహ్మ రుద్రుడు మొదలగు దేవతలు పరమచింతాక్రాంతులైరి. అంత నింద్రుడు వారి కిట్లనియె : ఓ సురలారా! ఇపుడు మన కర్తవ్యమేమి? ఆ హరికి నిద్రాభంగము చేయుట తగదు. అది మహాదోషము. కనుక మీరలెట్లేని యజ్ఞకార్యము కొనసాగింపుడు. బ్రహ్మ యిట్లనియె : ''నేను చెదపురుగును పుట్టించి యీ నేలనున్న వింటికొనను తినుటకు దాని నాదేశింతును. చెద పురుగు వింటికొనను తినగా నారి తెగును. అపుడు గాని యీ దేవదేవుడు నిదురనుండి మేలుకొనడు! దానివలన దేవకార్యము నెరవేరును. ఇందు సంశయము లేదు.'' అని దేవదేవుడగు బ్రహ్మ చెద పురుగు నాదేశించెను. చెద పురు గిట్లనెను : రమాపతియు జగద్గురుడునగు దేవదేవునకు నేను నిద్రాభంగమెట్లు గల్గింతును? ఎవ్వరికైనను నిద్ర చెడగొట్టుట సత్కథలు వినకుండ చేయుట భార్యాభర్తల నడుమ కలతలు పుట్టించుట తల్లినుండి శిశువును వేరు చేయుట - ఇవి బ్రహ్మహత్యాసమములని స్మృతులు వక్కాణించును. ఆ దేవదేవుని నిద్రాసుఖమున కెట్లు నేను భంగము కల్గింతును? దానిని తినుట వలన నాకు వచ్చెడి ఫలితమేమి? నేను పాపినగుటయే కదా? లోకములన్నియు తఱచుగ స్వార్థపీడితములై ఘోరదురితములు చేయుచుండును. అట్టి స్వార్థ మాశించియే నేనును తినవలయునా?

బ్రహ్మయిట్లనియె : యాగములో నీకు కొంత భాగమేర్పరతుము. కనుక నీవు వెంటనే విష్ణుడు మేల్కొనునట్లు చేయుము. మా కార్యము నెరవేర్చుము. యజ్ఞములందు వేల్చునపుడు హవిస్సునుండి కొంత ప్రక్కలకు బడును. అది నీ భాగమని తెలిసికొనుము. ఇక త్వరగ నీ పని కొనసాగింపుము. సూతుడిట్లనియె : ఆ విధముగ బ్రహ్మ పలుకగా చెదపురుగు వెనువెంటనే వింటి నారిని కొరికెను. వెంటనే వింటి నుండి నారి తెగిపడెను. తత్ఫలితముగ విల్లు నేలపై బడినది. పడుటయే తడవుగ ఘోర శబ్ద ముప్పతిల్లెను. అది విని దేవతలందఱును భయపడిరి. బ్రహ్మాండము దద్దరిల్లెను. భూమి కంపించెను. సంద్రము లల్లకల్లోలమందెను. జలజంతువు లదరిపడెను. పెనుగాలులు వీచెను. గిరులు గ్రక్కదలెను. దుఃఖసూచకములును మహోత్పాతములునగు ధూమకేతువులు రాలిపడెను. ఎల్లదెసలు ఘోర రూపము దాల్చెను. సూర్యు డస్తమించెను. ఇట్టి దుర్దినమున నేమి మూడునో కదా! యని వేల్పులెల్లరు పెల్లుగ జింతిల్లిరి.

అమరులిట్లు చింతించుచుండగనే దేవదేవుడగు విష్ణునియొక్క కిరీటకుండలములతో శోభిల్లు తల అదృశ్యమయ్యెను. కొంతవడికి వెఱపుగొలుపు పెంజీకట్లు విరిసెను. బ్రహ్మరుద్రాదిదేవతలపుడు తలలేని హరి మొండెమును గని విస్మితులై శోకసాగరమున మునిగి యిట్లు వాపోయిరి : జగన్నాథా, ప్రభూ! ఇది నీ యమానుషలీలా రూపమా యేమి? సనాతనా! దీనివలన వేల్పులకందఱకును వంత మిక్కుటమైనది. నీవు అచ్ఛేద్యుడవు - ఆదాహ్యుడవు - అక్లేద్యుడవు - అశోష్యుడవు - నిత్యుడవు. ఇంతటి నీ తల తెగుట కేదేవతమాయ హేతువో కదా! నీ విటుల తలలేకున్నచో దేవత లెల్లరు వసువులు గోల్పోవుదురు. మాకు నీయందిం కెటుల ప్రీతి గల్గును? కావున మేము మా స్వార్థము గోరి శోకించుచున్నాము. రమావల్లభా! ఇంతటి ఘోరమే దైత్యులచేగాని యక్షులచేతగాని రాక్షసులచేగాని సాధ్యము కాదు. ఇది దేవతల వలననే జరిగి యుండును. కావున నెవరిని నిందించగలము? ఎవరిని దూషించగలము! దేవేశా! మేమెల్ల దేవతలము పరతంత్రులము. మేమిపుడేమి చేయవలయునో యెచటి కేగవలయునో - మూఢమతులమగు మాకింక శరణ్యమెవ్వరో ఏమియును దోచుట లేదు. విష్ణువు మాయాపతి యగుట వలన సత్వరజస్తమ శ్శక్తులు గల మాయ యీ జగద్గురుని తల ఛేదింపనోపదు. శివుడు మున్నగు దేవతలీతీరున వాపోవుచుండిరి. అదంతయు విని వేదవిదుడగు దేవగురుడు వారి బిట్టేడ్పు చల్లార్పదలచి వారి కిట్లు పలికెను : ఓ మహాభాగులారా! ఇట్లు రోదించుటవలన నేమి ప్రయోజనము? ఇపుడెల్ల విధముల చక్కని బుద్ధితో నుపాయ మాలోచించుటయే మన కర్తవ్యము. ఇంద్రా! అదృష్టము పురుషకారమును రెండును సమానములే. కనుక మతిమంతుడు తొలుత నుపాయ మాలోచించవలయును. పిదప తప్పక దైవ మనుకూలించును.

ఇంద్రు డిట్లనెను : దైవమే బలవత్తరమైనది. పురుషార్థ మనర్థమునకు దారితీయును. అది వ్యర్థము. మనకండ్ల యెదుటనే విష్ణువంతటి వాని తల తెగిపడెనుగదా! బ్రహ్మ యిట్లనియె: కాలానుగుణముగ మంచిగాని చెడుగాని యేది ప్రాప్తించిన దానిని తప్పక యనుభవించి తీరవలయును. ఎట్టివాడును దైవమును మీరలేడుగదా! దేహధారియగు జీవుడు సుఖ దుఃఖములనుభవించి తీరవలయును. ఇందు సందియమే లేదు. నేనును కాలబద్ధుట నగుట చేతనే నా తల శివునిచేత ద్రుంప బడినది. శాపకారణమున హరుని లింగము పతనమందినది. నేడును హరితల తెగి లవణ సాగరమున బడినది. దేవేంద్రునంతటి వానికిని సహస్రభగుడగు దుఃఖము తప్పలేదు. అతడును పదభ్రుష్టుడై మానస సరస్సులో తల దాచుకొనెను. ఇంతటి వారే దుఃఖములు గఱచు చుండగ నిక దుఃఖించని మనుజు డెవ్వడు? ఈ ఘోర దుఃఖ సంసార సాగర మేరికిని దాటశక్యము గాదు. కాన తెలివి గల మానవుడు ఆపదలో దుఃఖింపరాదు. అందుచే మన మిపుడా మహామాయ శ్రీ విద్యామయి సనాతన పరా ప్రకృతియగు నిర్గుణదేవిని సంస్మరింతముగాక. ఆ దేవ దేవియే మనయెల్ల కార్యకములు చక్కగ సమకూర్చ గలదు. ఆమెయే బ్రహ్మ విద్య - జగద్ధాత్రి - విశ్వజనయిత్రి - చరా చరాత్మకమైన ముల్లోకములకు తల్లి. ఆ లోకములన్నియు నామెచేతనే నిలిచి వ్యాప్తమై వెలుగొందుచున్నవి.

సూతు డిట్లనియె : అని యీ ప్రకారముగ బ్రహ్మ దేవతలతో పలికెను : పిదప బ్రహ్మ వేదముల నాదేశింపగ నవియు దేవకార్యము సాధించుటకు శరీరములు దాల్చి యతని యెట్టయెదుట నిలుచుండెను. మీరు సర్వ కార్యములు సఫల మొనరించి పరాభట్టారికయు పురాతన బ్రహ్మ విద్యయు గూఢాంగియు మహామాయయు నగు మహాదేవిని సంస్తుతింపుడు అని వేదములను బ్రహ్మ యాదేశించెను. బ్రహ్మ వచనానుసారము సర్వాంగ సుందరములైన వేదములు విశ్వస్థితి కారణియు జ్ఞానగమ్యయునగు మహామాయ నీ విధముగ సంస్తుతింప దొడగినవి : సకల భూతేశ్వరీ! శివకామినీ! విశ్వజననీ! శివాత్మికా! మహామాయాదేవీ! నీకు మా నమస్కారములు! నీవే సర్వభూతములకు మూలాధారమవు. నీవే ప్రాణుల ప్రాణమవు. శ్రీ -క్షమ - బుద్ధి - కాంతి - శాంతి - శ్రద్ధ - మేధ - ధృతి - స్మృతి - ఇవన్నియు నీవే. ప్రణవమందలి బింద్వర్ధ చంద్రస్వరూపమగు నర్థమాత్రవు నీవే. శ్రీగాయత్త్రీ దేవతవు సప్త వ్యాహృతులు జయ - విజయ - ధాత్రి - లజ్జ - కీర్తి - దయ - స్పృహ - ఇవన్నియు నీవే. దయామృత తరంగిణీ! విశ్వమాతా! ముల్లోకముల సృష్టించు భవభవ భంజనీ! వరేణ్యా! మహావిద్యా స్వరూపిణీ! వాగ్బీజ నివాసినీ! ఓ అమ్మా! నిన్ను రేయైన పగలైన సంస్తుతింతుమమ్మా హరిహర బ్రహ్మలు - ఇంద్రాగ్నులు! రవి - సరస్వతి - లోకాధిపతులును నీచేతనే సృజింపబడిరి. ఇంతేకాదు. ఈ స్థావర జంగమముల కన్నింటికి నీవే జనయిత్రివి! నీవీ జగములనెల్ల నిర్మించనెంచి త్రిమూర్తులను సృజించి వారిచే సృష్టి స్థితి లయము లొనరింప జేయుచున్నావు. ఐనను నీవేకాత్మవై తేజరిల్లుటచేత నీలో నీ సంసారవికారవాసనలు లేశమాత్రమున పొడసూపవు.

నీ యనంత నామములును నీ దివ్య స్వరూపమును నీ వస్తుతత్త్వమును నెఱుంగ జాలినవాడు భువనంబు లన్నింటిలో నెవడును లేడు. ఒక చిన్న నీటి పడియను దాటజాలనివాడు సత్యప్రతిజ్ఞుడై మున్నీటి నెట్లు దాటగలడు? ఈ యెల్ల వేల్పులం దొక్కండును నీ యనంత దివ్యవిభూతు లెఱుంగ గలవాడు లేనేలేడు. నీ శ్రీమాతృదేవినామ మెంతయో మధురాతిమధురము, ఈ మిథ్యా జగముల నెల్ల రచించుటకు నీవొక్కతెవే చాలు ననుటకు వేదవాక్కులు ప్రమాణభూతములు. నీవే కోర్కెలును లేనిదానవు. ఎల్ల భువనములకు కారణభూతురాలవు. కాన నో భగవతీ! నీ విచిత్ర చరిత్ర మా మది కద్భుతముగ దోచుచున్నది. వేదములన్నియు నొక్కటైనను మనోవాక్కుల కతీతమైన నీ మహోజ్జ్వల ప్రతిబ నెఱుగలేవు. ఇక మేమేమి గ్రహింపగలము? ఈ విష్ణు శిరము అదృశ్యమగుట నీకు తెలియదా? కాక నీవెఱింగియు తిరిగి తెలిసికొన దలంతువా? కాదేని మధువైరి బలమెంతయో తెలిసికొన జూతువా? హరియం దేదేని బలవత్తరమైన దోషమున్నదందుమా? అదియును సరికాదు, ఏలన - నీ పావన చరణ కమలములు గొల్చువారిని పాతకము తాకనైన తాకలేదు. ఓ విశ్వమాతా! ఈ హరి యెల్ల వేల్పులలో చాల దొడ్డవాడు. ఇతని విషయ ముపేక్షింప దగదు. ఇతని తల తెగిపడుట చూడగ నబ్బురముగ నున్నది. మదిలో వంత గల్గించుచున్నది. ఓ అమ్మా! ఈ చావు పుట్టుకల వలని వంతలనెడి తీగలను త్రుంచుట కీవే సమర్థురాలవు. మరియు మధుసూదనుని తల మరల నతికించుటకు జాగేల యెనరింతువో తెలియుటలేదు. దేవతలును దోష యుతులే యని యెంచి వారి దోషమునకు ఫలముగ హరిశిరమును ద్రుంచితివో! లేక నరుల పాపము రాజునకు సంక్రమించునుగాన నరుల - దేవతల పాతకముల వలన నితని తల తెగిపడినదో! కాక మధుకైటభులను చంపుటచే నితనికి గర్వము బలిసెనని తలచి యతని తలను ఛేదించితివో! దీని కారణమేమో మేమూహింపజాలకున్నాము. భవానీ! రణమున నోటుపడిన రక్కసులు విమల తీర్థములందు తపములు సేయగ వారికి వరములొసంగితివో! కాదయేని తలలేని వాసుదేవునిగని వినోదింపదలచితివో! నీవిందేమనుకొనుచున్నావో కాని మాకు మాత్రము హరి తల కనబడుట లేదు. సనాతనీ! కానిచో లక్ష్మిపై కోపించి యిట్లొనర్చితివో! ఐనచో పతిలేని యామె మొగమెట్లు చూడగలవు? నీ యంశమున బుట్టిన కడలి రాపట్టి చేసిన నేరమును క్షమింపవలయును గదా! కావున నిపుడీ హరిని లేపి మాకానందము జేకూర్చుము తల్లీ!

మేము కార్యకుశలురము. ప్రభావ సంపన్నులము. దేవతలము. రేయైన పగలైన నీ చరణములే నమ్ముదుము. ఓ దేవదేవీ! ఈ లోకాధినాథుని బ్రతికించి మమ్మీ శోకవారిధి నుండి దాటించుము. శ్రీహరి శిరమేమయ్యెనో మాకు దోచుట లేదు. మేమిక మనుట యెట్లో తెలియుట లేదు. అమరులకు జీవనదాన మొసగు దివ్యామృత మూర్తిని నీవే కదా! ఈ జగములకు బ్రతుకు వెలుగు చూపింపగదవే! సూతుడిట్లనియె ; ఈ ప్రకారముగ సాంగములగు వేదములతో సామగులు సామగానము సలిపి తన్ను సన్నుతింపగా గుణాతీత - మహేశ్వరి - పరమమాయ పరమానంద భరితురాలయ్యెను. అంతలో నంతరంగముల కభిరామమైన యశరీరవాణి సుస్వరమున వేల్పుల నుద్దేశించి యిట్లు పలికెను. అమరులారా! నేను ప్రాజదవుల చేత ప్రస్తుతింపబడి ప్రసన్నమైతిని. మీరలు చింత - వంత వదలుడు. స్వస్థులుగండు, నా మాట నమ్ముడు. ఎవ్వడీ భూమిపై నన్నీ దివ్యస్తోత్రమున సంస్తుతించునో, భక్తి యుక్తుడై దీనిని చదువునో, వానియెల్ల కోర్కులు తప్పక ఫలించును. వేదస్తోత్రము వేద తుల్యము. కనుక నెవడేని మూడు కాలములందును పరమభక్తి నిండార నీ వేదస్తోత్రము పారాయణమొనరించునో వాడు దుఃఖరహితుడై సుఖించగలడు.

లోకమందు కారణము లేక కార్యము లేదు. కనుక నీ హరి శిరము తెగుటకు గల కారణమాలింపుడు. మున్నొకప్పుడు కడలిరాచూలి హరిప్రియురాలు హరి చెంతనే యుండెను. అత్తఱి మనోరమమగు నామె పద్మవదనముగని హరి నవ్వెను. నన్ను జూచి యూరకే మాధవుడేల నవ్వును? తప్పక యేదేని వికారము నా మొగమందా ప్రభునకు బొడగట్టి యుండనోపును. అకారణముగ నవ్వేల వచ్చును? ఇతని నెమ్మదిలో నన్య వనిత నాకు సవతిగ నిల్చి యుండనోపునని లచ్చి తలంచెను. ఆమె మేనియందప్పుడు తామస శక్తి యావేశించి యుండెను. అందుచే నా మహాలక్ష్మి తమోగుణముచే కోపవంతురాలయ్యెను. ఆ సమయమున దైవయాగమునను దేవకార్యమునకు నామె శరీరమందు దారుణమైన తామసశక్తి నిండి మెండుకొని యుండినందున తదావేశముచే ''నీ తలతెగి పడిపోవుగాక!'' యని లక్ష్మి మెల్లగ హరితో ననెను.

మునుపు మహావీరుడగు హయగ్రీవుడను దైత్యుడుండెను. అతడు సరస్వతీనదీ తీరమున ఘోరముగ తపమొనర్చెను. అతడన్నపానములు సుఖభోగములు విడనాడి విజితాత్ముడై మాయాబీజమగు నేకాక్షర మంత్రరాజమును జపించుచు లలిత భూషణ భూషితమగు నా తామసిక శక్తి ననుధ్యానించుచు వేయేండ్లతి దారుణమైన తపస్సు చేసెను. అతడెట్టి తామసరూపమును ధ్యానించెనో నేనదే తామసరూపమున నతని యెదుట ప్రత్యక్షమైతిని. సువ్రతా! నీకు వరమొసంగుదును. ఏదేని గోరుకొమ్మని సింహాసనాసీననై నేనతనితో దయదలచి పలికితిని. అతడు నా మాటలు విని బత్తితో నాకు ప్రదక్షిణించి సాగిలపడి మ్రొక్కెను. అతడు నా దివ్యస్వరూపముగాంచి కనులనిండ నానంద బాష్పములునిండ నన్నుకీర్తించెను. హయగ్రీవుడిట్లనె : కామమోక్షములొసగు మహామాయాదేవీ! భక్తాసు గ్రహస్వరూపిణీ! సృష్టిస్థిత్యంతకారిణీ! నీకు నమః సహస్రములు. నింగి గాలి నిప్పు నీరు నేలలకును శబ్దస్పర్శరూపరస గంధములకును నీవే మూలమైనదానవు. త్వక్చక్షుః శ్రోత్ర జిహ్వాఘ్రాణములలో వాక్పాణి పాద పాయూపస్థలును శక్తి చేత తమతమ పనులు జేయుచున్నవి.

శ్రీదేవి యిట్లనియెను : ఓ దానవా! నీ యద్భుత తపమునకు నీ పరభక్తికిని మెచ్చితిని. నీ కెట్టి కోర్కియున్నను తీర్చెద. వరమడుగుము. హయగ్రీవుడనియె : అమ్మా! సురాసురుల కజేయుడనై యోగినై యమరుడనై చావకుండునట్లు వరము నా కిమ్ము. శ్రీదేవి యిట్లనియె : పుట్టిన ప్రాణి తప్పక గిట్టును. గిట్టినదెల్ల తిరిగి పుట్టును. ఇది లోకమర్యాద. దీనికి విరుద్ధముగ నెట్లు జరుగగలదు? కావున చావు తప్పదని నిశ్చయించుకొని మరేదేని వరమడుగుము. హయగ్రీవుడనె : తల్లీ! నా చావు కేవలమొక్క హయగ్రీవుని వలననే జరుగవలయును. ఇతరుని చేత కూడదు. ఇదే నా కోర్కి. నాయీ కోర్కి తీర్చుము. శ్రీదేవి యిట్లనియె : ఓ మహాభాగా! నీవిక నీయింటికేగి సుఖముండుము. హయగ్రీవుడుగాక యితరునివలన నీవు చావవు అని పరాంబిక మహామాయ వరమొసగి అదృశ్యయయ్యెను. ఆ రక్కసుడును ప్రమోదించి తన యింటికేగెను. నాటినుండి యతడు వేదవిప్రులను మునినరులను బాధింపదొడగెను. ముల్లోకములలో నతని నెదుర్కొని తెగటార్చువాడెవ్వడును లేకుండెను. కావున దేవతలారా! మీరిపుడొక గుఱ్ఱము తలతెచ్చిఇండు. దానినీ మొండెమున కతికించి హరిని త్వష్ట మరల బ్రతికించును. అపుడా శ్రీ హయగ్రీవ భగవానుడా పాపిష్ఠుడును క్రూరుడునగు హయగ్రీవ దానవుని దప్పక దునుమాడగలడు. సూతుడిట్లనియె : ఈ విధముగ శ్రీభువనేశాని పలికి మౌనమూనెను. దేవతలును మోదమలర దేవశిల్పియగు త్వష్టతో శ్రీహరి మొండెమునకు గుఱ్ఱము తల నతికింపుము. ఆ శ్రీ హయగ్రీవుడు హయగ్రీవుని దెగటార్చును. ఇట్లు దేవతల కార్యము సాధింపుము అని వేడిరి. సూతుడిట్లనియె : ఆ దేవతల వచనములు విని త్వష్ట సంతసించి వెంటనే వారి సమక్షముననే యొక్క హయము తల ద్రుంచి దానిని హరిమొండెమున కతికించెను. అంత మహామాయ దయవలన హరి హయగ్రీవుడయ్యెను. కొన్ని దినముల పిదప నా శ్రీ హయగ్రీవుడు యుద్ధమున మదగర్వితుడు దేవవైరియగు హయగ్రీవుని నేలగూల్చెను. ఈ సుందరమైన కథను వినిన మానవుడు సర్వదుఃఖములు బాసి సుఖించగలడు. సందేహము లేదు. ఈ శ్రీ మహామాయాదేవి చరిత్ర పవిత్రము, పరమ పావనము, పాపనాశనము. దీనిని చదివిన వారికిని వినిన వారికిని మేలి కలుములు చేకూరును. ఇది ముమ్మాటికి నిజము.

*ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ ప్రథమస్కంధే హయగ్రీవావతారకథనం నామ పంచమోధ్యాయః*

*ఇది శ్రీ దేవీ భాగవత మహాపురాణ మందలి ప్రథమ స్కంధమున*
*శ్రీ హయగ్రీవావతార కథనమను పంచమాధ్యాయము.**_శ్రీ దేవి భాగవతం - 6 వ అధ్యాయము_*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*మధుకైటభుల యుద్ధ ప్రయత్నములు*

☘☘☘☘☘☘☘☘☘

ఋషులిట్లనిరి : సూతమునివర్యా! శ్రీహరికి మధుకైటభులతో మహావారాశిలో నైదువేలేండ్లు ఘోరముగ పోరాటము జరిగెనంటివి. దేవతల కజేయులై దుర్ధరులగు నాదానవవీరులు సంద్రమున నెట్లు పుట్టిరి. భగవానుడు వారినెట్లు హతమార్చగల్గెను? మా కా పరమాద్భుత చరిత్ర వెల్లడించుము. మేము సత్కథా శ్రవణ కుతూహలులము. మీరు బహుశ్రుతులు. మహా ప్రవక్తలు. మీ బోటి మహా మునులతో మాకు దైవయోగమున నానందకర సంగమము గల్గినది. మొఱటు వానితో కలియుట విషముకన్న దుర్భరము. సహృదయుడగు రసజ్ఞుతోడి సాంగత్యమమృతరససమము. పశువులన్నియును తమకు స్వభావవిహితమగు ఆహారము దినుచు నొండొంటితో గలియుచు బ్రతుకుచుండును. రతి సుఖమును ననుభవించును. కాని వానికి నిత్యానిత్య వస్తువివేకముగాని మోక్షదాయకమగు జ్ఞానము గాని యుండదు. శ్రీ హరి సత్కథలు విననేరని వానినా పశువుకన్న నీచునిగ నెంచవలయును. జింకలు మున్నగు జంతువులు చెవుల కింపు చేకూర్చు మధురనాదము వినగోరును. ఆ చెవులు లేని పాములు మధుర నాదస్వర మాలించినంతన తన్మయత నందును. జ్ఞానేంద్రియములలో కన్నులు చెవులు ఈ రెండే మంచి మేలొన గూర్చునవి. చెవుల వలన వస్తువునెఱుగు తెలివిగల్గును. చూపుల వలన నుల్లము రంజిల్లును. శ్రవణము సాత్త్వికము. సాహిత్య శ్రవణము రాజసము. యుద్ధవార్తలు నిందలు వినుట తామస శ్రవణము. పండితోత్తములు మరల సాత్త్విక శ్రవణమును ముత్తెఱంగుల విభజించిరి. అవి యుత్తమము మధ్యమము నధమమున నబడును. ఉత్తమము ముక్తి నొసంగును. మధ్యమము స్వర్గసీమ జేర్చును. అధమము భోగదాయకము. నవరస భరితమై రాజసమగు సాహిత్య శ్రవణమును మువ్విధములు స్వీయతోడి రతి విషయమును ప్రతిపాదించునది యుత్తమము. వారాంగనా సంగమ విషయకము మధ్యమము. పరస్త్రీగమన విషయక మధమము.

తామస శ్రవణమును మూడు విధములు. చంపదగిన వారితో బోరుట సాత్త్వికము. పాండవేయుల పగిది విద్వేష కారణముగా పోరుట మధ్యమము. కారణము లేక వివాదములకు కాలుద్రవ్వుట యధమము. ఇన్నిటిలోన నీ పురాణశ్రవణమే ముఖ్యమైనది. అది బుద్ధి వికాసము గల్గించును. పుణ్యప్రదము. పాప ప్రణాశకము. నీవు మున్ను వ్యాసుని వలన సకలార్థ సాధకము శుభకరమునగు పురాణ కథలను వింటివి. వానినే మాకిపుడు వినిపింపుము. సూతుడిట్లనెను : ఓ మహాభాగులారా! మీరు సత్కథలు వినగోరుచున్నారు. నేనును మీకు వానిని ప్రవచింప దలంచితిని. కనుక నీ భూతలమున మీరు ధన్యులరు. నేనును ధన్యుడను. పూర్వము ప్రళయకాలమున ముజ్జగములు లయమంది లోకమేకార్ణవమయ్యెను. అప్పుడు శేషశయ్యపై దేవదేవుడగు విష్ణువు యోగనిద్రలో నుండెను. ఆ విష్ణుని చెవి మలము నుండి మహాబలులగు మధుకైటభులను దానవులు పుట్టిరి. వా రా మున్నీటి నీటిలో పెంపొందిరి. అందాస్థూల కాయు లిటునటు తిరుగాడుచు క్రీడాసక్తులై యుండిరి. ఆ దానవ సోదరులు తమ మనములందిట్లు దలపోసిరి: కారణము లేక కార్యము సంభవించదు అను నానుడి లోకమున సహజము. ఆధారములేనిచో నాధేయమును లేదు. కనుక నాధారాధేయములం గూర్చిన భావము మా మనములందు గల్గుచ్న్నుది. ఈ యనంత జలరాశి సుఖము గొల్పుచు నపారమై యున్నది. దీనికి మూలమేది? దీనినెవ్వరెట్లు సృజించిరి? మేమీ మున్నీటిలోన నేల మునిగి యున్నాము? మేమెట్లు పుట్టితిమి? మమ్ము పుట్టించిన తల్లి తండ్రులెవరు? వారెక్కడ? అను విషయములు మాకు దెలియుట లేదు.

సూతు డిట్లనియె : ఇట్లెంతగ నాలోచించినను వారొక నిర్ణయమునకు రాలేకపోయిరి. తుదకు కైటభుడు తన చెంత నున్న మధువును గని యిట్లనియెను : అన్నా ! మన మీ జలమందుండుట కొకానొక మహాశక్తి కారణముగావచ్చును. ఆ శక్తి యచలమైనది. మహాబలముగలదియని నా యభిప్రాయము. మన యునికి కామెయే హేతువుగావచ్చును. ఈ కన్నుచూపు మేరలో నిండి కనిపించు నీ మహాజల మంతటి కామెయే మూలాధారము. ఆమె యాధారముననే జలమంతట నిండియున్నది. ఆ పరమశక్తియే మనకును మూలాధారముగావచ్చును. ఇట్లు చైతన్యవంతులై వారిరువురు తలచుచున్న సమయమున గగన సీమనుండి వాగ్బీజరూపమగు నొక ధ్వని వారి చెవుల బడెను. వారానాదము విని పట్టుదలతో దానినభ్యసింప నారంభించిరి. అంతలో నాకసమున తళుక్కుమను నొక్క మెఱుపు మెఱసి కనబడెను. మనము విన్నది మహామంత్రము. మన ధ్యానమే సగుణమై వెలుగు రూపుదాల్చి పొలిచినది. ఇందు సందియము లేదని వారు తలంచిరి. వారపు డన్నపానీయములు ముట్టక జితేంద్రియులై తన్మయులై వేయేండ్లతిఘోరముగ జపధ్యానములు చేసి తపము సాగించిరి. అంత వారిపై పరమ శక్తికి దయగలిగెను. ఆ క్రూర దానవులింకను పట్టుదలతో తపము సేయ నిశ్చయించుకొనిరి. ఆ రక్కసులు దీనులై యుండుటగని కనికరింపదలచి దేవి యశరీర వాక్కులతో వారితో నిట్లు పలికెను: ఓ దానవులారా! మీ తపమునకు సంతసించితిని. మీ వాంఛితము తెలుపుడు. తప్పక ఈడేర్తును.

సూతు డిట్లనియె : ఆ దేవి వాక్కులు విని దానవు లిట్లనిరి : ఓ దేవీ! మాకు స్వచ్ఛంద మరణము వరముగ నిమ్ము. వాణి యిట్లు పలికెను. ఓ దానవులారా! నా దయచే మీకు స్వచ్ఛంద మరణమే గల్గును. దేవదానవులకు మీ రజేయుల గుదురు. సందియము లేదు. సూతు డిట్లనియె : అట్లు దేవి వలన వరములు బడసి యా క్రూరులు మదగర్వితులై నీటిలోని జలచరములతో స్వేచ్ఛగ క్రీడించుచుండిరి. కొంతకాలమునకు తరువాత కమలాసనము నందున్న ప్రజాపతియగు బ్రహ్మ వారి కంటబడెను. ఆ యిరువురు బలశాలురు బ్రహ్మనుగాంచి సంతసించి యుద్ధకాముకులై బ్రహ్మ కిట్లనిరి : మాకు యుద్ధమను గ్రహింపుము. కానిచో నీ వీ కమలము వదలి వేరొక చోటి కేగుము. నీవు కడు దుర్బలుడవు. నీకీ శుభాసనము తగదు. ఇచ్చోటు వీర భోగ్యము. నీవు పిరికివాడవైనచో మమ్ము వదలి యేగుము. దానవుల మాటలు విని బ్రహ్మ చింతాక్రాంతుడయ్యెను. మహాబలవంతులగు వారినిగని నేనిపుడేమి చేయవలయును? అని తాపసుడగు బ్రహ్మ మదిలో చింతింప సాగెను.

*ఇది శ్రీదేవీభాగవత మహాపురాణమందలి ప్రథమస్కంధమందు షష్ఠాధ్యాయము.*

రాసి నేను తరిస్తున్నాను చదివి మీరు మోక్షం పొందుతారు
చదవండి చదివించండి_*శ్రీ దేవి భాగవతం - 15 వ అధ్యాయము*_

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీశుకుని వైరాగ్య ప్రభావము*

☘☘☘☘☘☘☘☘☘☘

శ్రీకుడి డిట్లు పలికెను: తండ్రీ! ఎల్లభంగుల దుఃఖమూలమైన గృహస్థాశ్రమమును నేను స్వీకరింపజాలను. వలత్రాళ్లవలె నిది దేహుల కురివంటిది. ధనాశాపీడితు లాత్మసుఖమునకు నోచుకొనరు. లేనివాడు పేరాసగలవాడు తన కుటుంబము వారిచేతనే బాధింపబడును. ఏ కోర్కెలునులేని బిచ్చగాడు పొందు సహజ సుఖము నింద్రుడు సైతమందజాలడు. త్రైలోక్యభోగ్యములు బొందినప్పటికి ప్రాణులు సుఖింపజాలరు. దేవేంద్రుడంతటివాడే తపించు తాపసులనుగాంచి దుఃఖితుడై యీసున వారికి బహుభంగుల భంగములు గల్గించుచుండును బ్రహ్మయు నిత్యానందరహితుడే. శ్రీహరియును తన మనోహారిణి యగు శ్రీ మహాలక్ష్మిని చేపట్టినప్పటికిని రక్కసుల యక్కడగించుచు మాటిమాటికి ఖేదపడుచుండను. ఆ శ్రీమంతుడగు విష్ణువెన్నియో యిక్కట్టులకు గురియై కఠిన తపమాచరించెను. శ్రీపతియే యిట్లుండ నిక సామాన్యుల గతి యెట్లుండును? రుద్రుడు సతతము తపము చేయుచు రాక్షసులను చెండాడుచునుండును. అతడును పాపమెన్నియో వెతలకు గురి యగు చుండును. కలవానికి భయమున కంటినిండుగ కూర్కురాదు. ఇక లేనివాడులేనవాడే గద! వాడు సుఖమునకు మొదలే నోచుకొనలేదు. నీ కౌరసపుత్త్రుడనగు నన్నే నీవీ ఘోరనరకతుల్య సంసారమందే మునుగుమని యేల నియోగింతువు? ఎల్ల ప్రాణులకు మాటిమాటికి జన్మదుఃఖము జరాదుఃఖము మరణదుఃఖము మలమూత్రమయమగు గర్భవాసమున దుఃఖము గల్గుచుండును.

మహాలోభిత్వమును దురాశయు దుఃఖము చేటు. యాచన మరణదుఃఖముకంటెను చేటును బాధాకరమునైనది. విప్రులు ప్రతి గ్రహమువలననే తమ జీవితములు వెళ్లబుత్తురు. వారు బుద్ధిబలముగల జీవులుగారు. పరాశ పరమదుఃఖము. అది దిన మొక గండమువంటిది. ఎల్ల వేదశాస్త్రార్థములను చక్కగ తుదిముట్ట చదివిన పండితప్రకాండులే ధనమదాంధుల పజ్జచేరి వారిని పెక్కు రీతుల పై కెత్తుచు పొట్టపోసికొందురు. ఈ జానెడు చిఱుతపొట్టకింత చింత యెందులకు? దీనిని ఫలాదులతో ఆకులములతో నేదేనుపాయముతో నింపి తనపవచ్చును. తండ్రీ ! భార్యవలన కొడుకులును వారివలన మనుమండ్రును పుట్టుదురు. కుటుంబపు భారము పెద్దదగును. వారి పోషణభారము దుఃఖభారమగును. ఇక నాత్మసౌఖ్య మెక్కడిది? ఓ తండ్రీ! కావుననే భేదాలు మాయామోహాలు పుణ్యపాపాలు లేని పరిపూర్ణము సత్యవస్తునిష్ఠము నగు బ్రహ్మకాండను యోగ శాస్త్రమును గుఱించి నాకు దెలుపుము. విభేదాలు పుట్టించునట్టి కర్మ బాహుళ్యమందు నా మదియెన్నడును చొరకున్నది. కర్మలు ప్రారబ్ధము సంచితము వర్తమానమునని మువ్విధములు గద! అది సమూలముగ క్షయించు తెఱంగెఱింగింపుము. జవరాలు జలగమాదిరి నరజాతి వీర్యమంతయును పీల్చిపిప్పి చేయును. ఆ వలపులాడి వన్నె చిన్నెలకు మత్తచిత్తుడైన నరుడీ విషయము నెఱుగనేలేడు. స్త్రీలు భోగములతో ధన వీర్యములను కుటిలవచనములతో మనస్సును మరింతురు. అట్టి స్త్రీ నెవడుకోరును? మూర్ఖుడే భార్యను చేపట్టును. సౌఖ్యము బోగొట్టుకొనును. ఫలితముగ మిగులునది దుఃఖమేకాని సుఖముగాదు. ఇట్లు మూర్ఖుడు విధిలీలకు మోసపోవును.

సూతుడిట్లనియె : అని శుకుడు విరాగియై పలుకు ఈ పలుకులు విని వ్యాసుడు చింతాగ్రస్తుడై యిపుడేమి చేతునని తలపోయసాగెను. వ్యాసుని కన్గొలకులు దుఃఖముచే చెమర్చెను. నెమ్మేను గడగడలాడెను. మనస్సు గ్లానమయ్యెను. ఇట్లతి దీనముగ శోకాతురుడై వెతలబొగులు వ్యాసునకు వింతగదుర విప్పాదిన నేత్రములతో శుకుడిట్లు పలుక దొడగెను: ఆహా! ఈ మాయ యెంత బలవత్తరమైనది! ఇది వేదాంతకారుడు వేదసమ్మతుడు వేదవిదుడునైన పండితోత్తమునిగూడ మోహింపజేయుచున్నదే! ఆ మాయ సత్యవతీసుతుడు విద్వాంసుడునైన వ్యాసునకుగూడ మోహము గల్గించుచున్నది. కనుక మాయ దుస్త్యజ. ఆ మాయ రూపెట్టిదో యెతవారికిని దెలియరాదు. వేదవిభాగకర్త విపులపురాణవక్త భారత గ్రంథ నిర్మాతయగు వ్యాసుని సైతము మోహభ్రాంతి యావరించెనే! కావున నే యద్భుతశక్తి యీ ముజ్జగములను పెనుభ్రమలో ముంచెత్తునో యే యత్కృష్టశక్తి బ్రహ్మవిష్ణుహరులను సైతము మోహపెట్టునో నేనా పరాశక్తినిపుడు శరణు వేడుచున్నాను. ఆ శక్తిచే అంతటివారే మోహితులుగా నితరు లెంతటివారలు? ఆ మహాద్భుతమాయాశక్తి బ్రహ్మవిష్ణుమహేశ్వరులనే మోహింపజేసినది. ఆ మహాశక్తికి వారే తలలు వంచిరి. ఇక నాశక్తి భ్రమలో పడనివాడే లేడు. ఆహా! ఆ సర్వశక్తి వీర్యపటిమ యెంతన వలయును! ఆ శక్తి తేజోబలమెంతని చెప్పగలము!! ఆ శక్తులు మహాద్భుతశక్తులు. ఇంత యేల? సర్వజ్ఞుడగు శంకరుడే శక్తియుక్తుడు గానిచో నేమియు చేయజాలడు గద! వ్యాసుడు విష్ణ్వంశసంజాతుడని పౌరాణికులు నుడువుదురు. మరి యంతటివాడే భగ్ననౌకలోని వ్యాపారివలె మోహసాగరమందు మునిగిపోయెనే! ఈ సమయమందే వ్యాసుడే ప్రాకృతమనుజుని పగిది వివశుడై కన్నీరొలుక బోయుచున్నాడు. పండితులు సైతము మాయాబలమునుండి విముక్తులు కాజాలరు. నేనెవరను? ఇతడెవరు? ఈ వీడనిభ్రమ యెక్కడిది? ఈ తండ్రికొడుకుల వాసనల సంబంధ మీ పాంచ భౌతిక దేహమునకు మాత్రమే యుండును. ఈ మాయశక్తి యెంతయో బలవత్తరమైనది. ఇది మాయికులను సైతము తన మాయలో ముంచివేయును. వ్యాసుడంతటి వాడే నేడు మాయామోహునకు వశుడై పలవరించుచున్నాడు.

సూతు డిట్లనియెను : అంతట శుకుడు సకల దేవతలకే మాతృ దేవతయు బ్రహ్మాదుల కీశ్వరియు సకల కారణ కారణయునగు దేవిని నెమ్మదిలో భావించి నమస్కరించెను. పిదప నరణి సంజాతుడగు శుకుడు మోహసాగరమున మునింగిన తన తండ్రి వ్యాసునకు సహేతుకములుగ బ్రహ్మవాక్కులు ఇటులు పలికెను : ఓ మహామనీషీ ! ఎల్లరకు నీవే తెలియజెప్పువాడివే! నీవే యిప్పుడొక సామాన్యుని పగిది విషాదమునంద నేల! ఇపుడు మాత్రమే నేను నీ కుమారుడను. వెనుకటి జన్మలో నీవెవరవో నేనెవరనో యెఱుగము. సర్వాత్మదృష్టితో చూడగా దండ్రికొడుకుల సంబంధము భ్రమ మాత్రమే యగును. ఆత్మధైర్యము బొందుము. సావధానుడవు గమ్ము. డెందమందు దౌర్బల్యమందకుము. ఇదంతయును మోహజాలమని గుర్తెఱుంగుము. వైక్లబ్యమందకుము. తినుటవలన నాకలి చల్లారును. త్రాగుటవలన దప్పిక తీరును. కాని పుత్త్రదర్శనమున నాకలి దప్పికలు తీరవు. నెత్తావి వలన ఘ్రాణతర్పణము గల్గును. మంచి వినికిడిచే చెవికింపగును. స్త్రీ వలన కామసుఖము లభించును. నేను నీ కొమరుడనే. ఐన నా వలన నీకేమి సుఖము గలదు? పూర్వ మజీగర్తుడు తన కొమరుని హరిశ్చంద్రునకు యాగపశువుగ వెలకమ్మెను. ద్రవ్య మెల్లసుఖములకు సాధనము. ఈ ధనమువలన సుఖములు గల్గును. నీకు స్వార్థబుద్ధిగలదేని డబ్బు సంపాదించుము. నేను నీ కొమరుడనే. ఐన నా వలన నీకేమి సుఖము గలదు! నీవు దైవజ్ఞుడవు. కావున నన్ను స్థిత ప్రజ్ఞుని చేయుము. నన్నీ గర్భవాసనరకమునుండి విముక్తుని జేయుము. ఇది కర్మభూమి. ఇట మనుజ జన్మ కడుంగడు దుర్లభము. అందు నుత్తమకులమున బ్రహ్మతత్త్వ మెఱింగిన బ్రాహ్మణుడై జన్మించుట యెంతెంతో దుర్లభము. నేను వేరు - బ్రహ్మము వేరు అను భేదభావమున బద్ధుడనైతిని. నన్నీ భేదబుద్ధి వీడుట లేదు. ఇట్టి సంసారవాసన ముసలితనమందును వదలక అంటిపెట్టుకొనియే యుండును.

సూతు డిట్లనియె : ఈవిధముగ సర్వకర్మ సంన్యాసమునే చిత్తమందిచ్చగించు శాంతుడగు శుకుని వ్యాసుడిట్లు ప్రబోధించెను: మహాభాగ! నీవు నా వ్రాసిన శ్రీ మహాభాగవతము చదువుము. ఆ పురాణము బ్రహ్మసమ్మితము. అనతి విస్తృతము. అది పండ్రెండు స్కంధములతో పంచలక్షణములతో సకల పురాణముల కలంకార ప్రాయమై అలరారుచున్నది. అది నా మదికెంతయో ప్రియమైనది. ఆ భాగవతమొక్కసారి విన్న మాత్రమున సదసద్వివేకము ప్రత్యక్ష జ్ఞానము విజ్ఞానము గల్గును. కావున నీవు దానిని శ్రద్ధగ చదువుము. పూర్వము పాలసంద్రముపై పటప్రతముమీద పరుండియున్న బాలరూపుడగు శ్రీవిష్ణువు తనలో నేనే సచ్చిదానందరూపముచేత నీ బాలరూపమందితిని. నేనే నిత్యవస్తువువలన నీ రీతిగ జన్మించితిని. ఈ సర్వవిశ్వము నేనెట్లు దెలిసికొనగలను? అని తలంచెను. అంతలోనే దయామయియగు భగవతి సకలార్థసాధకమైన వాక్యమును శ్లోకార్థమున నిట్లు పలికెను : 'ఈ కనంబడు జగమంతయు నేనే; పూర్ణఘనానందమున నిండియున్నాను. నాకన్న మిన్నయగు సనాతన వస్తువు మరేదియును లేదు.' విష్ణువు నెమ్మదిలో ఈ ధ్వని యెవరిదో ! ఈ పలికినది నరుడా? నారియా? పేడియా? నేనెట్లు గుర్తించగలనని విచారించెను. ఆ శ్లోకార్థరూపమగు భాగవతమునే అతడు తన యెడదలో మననము చేయదొడగెను. ఆ బాలుడా వటపత్రమందే పరుండి మాటిమాటికి నా దేవి పలికిన వాక్యార్థము విషయమును తన హృదిలో నాలోచించు చుండెను.

అంతట నా భగవతీ దేవి విష్ణునకు ప్రత్యక్షమయ్యెను. ఆ దేవి శంఖము చక్రము గద పద్మము వరాయుధములు దాల్చి తేజరిల్లు సత్యస్వరూపిణి. చతుర్భుజ. దివ్యాంబరధారణి-దివ్యభూషణ భూషిత-తన దివ్యవిభూతులను బోలిన నెచ్చెలులతో గూడి అచ్చెరువుగ నుండెను. ఆ దేవి తన ప్రసన్న వదనమున చిరునగవుసిరులు చిందులాడగ శ్రీమహలక్ష్మీరూపముతో తేజోనిధియగు విష్ణుని సన్నిధిని ప్రత్యక్షమైనది. సూతు డిట్లనియె : ఆ మున్నీటియందు నిరాధారయై కలుములీను కమలను మనోరమను శ్రీవిష్ణువు తన హృదయకమలము నిండుగ దర్శించి విప్పారిన నయనకమలములతో నొప్పారెను. అపుడు రతి భూతి బుద్ధి మతి కీర్తి స్మృతి ధృతి శ్రద్ధ మేధ స్వధ స్వాహా క్షుధ నిద్ర దయ గతి పుష్టి తుష్టి జృంభ తంద్ర క్షమ లజ్జ మున్నగు దివ్యశక్తులా శ్రీమహారాజ్ఞికి నల్గడలం జేరి ప్రేమ నివాళు లర్పించుచుండిరి. వారిలో ప్రతి యొక్కరును దివ్యవరాయుధములు నానా దివ్యభూషలు మందారమాలికలు జాతిముత్యాలహారాలు దాల్చి దివ్యశోభలు వెలార్చుచుండిరి. మహాసాగర మధ్యమం దా దివ్యాంగనలను కలయ వీక్షించిన జనార్దనుని డెందమాశ్చర్యపులకితమయ్యెను. ఆ విశ్వభూతాత్మకూడా మహామాయకచ్చెరువంది యిట్లు తలంపసాగెను: ''ఈ యందచందాలు విరజిమ్ము కాంతలెక్కడి వారలొకో! ఈ మఱ్ఱియాకు సెజ్జపై నున్న నేనెక్కడి వాడనో! ఇది అంతుపంతులేని మహాజలరాశియే. ఇందీ మహావటవృక్షమునకు కారణమేది? నేనెవరి మూలమున నిటుల ముద్దులుగారు బాలుడనై యుంటిని? ఈ దేవి నాకు జననియా! లేక దురంతమైన మాయయా!! ఏ కారణమున పుణ్యవిశేషమున నా కీమె దర్శనభాగ్యము చేకురినదో! నేనిపుడేమి పలుకవలయును? ఎట కేగవలయును? బాలభావముననే యప్రమత్తుడనై మౌనభాషతో నుండవలయునా?''

*ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణ మందలి ప్రథమస్కంధమందలి పంచదశధ్యాయము*_*శ్రీ దేవి భాగవతం - 2 వ అధ్యాయం*_

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీ దేవీభాగవత మందలి స్కంధముల వివరణము*

శ్రీ సూతుడిట్లనియెను : ఇచ్చట నున్న మహాత్ములు వేదమువలె ప్రసిద్ధమును మహా పుణ్యప్రదమునైన శ్రీ దేవీభాగవత పురాణము విషయమన నన్ను ప్రశ్నించిరి. అందుచే నేనెంతయు ధన్యుడను సదృష్టవంతుడను పవిత్రుడను నైతిని. కావున నేనిపుడు సర్వ వేదార్థ సమ్మితమును సకల శాస్త్రములందు నాగమములందు నుత్తమమైనదియు రహస్యమైనదియు నగు దేవీ పురాణమును చెప్పుదును, ఓ ద్విజోత్తములారా! పరమ యోగులకు ముక్తి నొసంగునదియు బ్రహ్మాదులచేత సేవింపబడునదియు స్తుతిపరులగు ముని ప్రవరులచే నెల్లపుడు ధ్యానింపబడ దగినదియు సుకుమారమునగు శ్రీ మదఖిలాండేశ్వరియగు శ్రీ లలితాదేవి పద పద్మముల కభివందనం బాచరించి నవరసభరితము పురాణ శ్రేష్ఠమును శ్రీదేవి పేరుతో ప్రసిద్ధమునగు శ్రీ మద్దేవీ భాగవత మహాపురాణమును పరమభక్తితో నిపుడు రసోదంచితముగ మీకు చక్కగ వివరింతును. ఎల్ల వేదమార్గములందు ఆదిశక్తిగా ఆత్మవిద్యగా పరాశక్తిగా సంసారపాశ విచ్ఛేదినిగా సకలహృదయనివాసినిగా దుష్టుల కలవిగానిదై శిష్టమునుల నిశ్చల ధ్యానమున దెలియబడునది కామదాయిని యై తనరారు శ్రీ రాజరాజేశ్వరి మాకు ప్రత్యక్షమై సిద్ధులను చేకూర్చుగాత! తన త్రిగుణాత్మకమైన మాయాశక్తిచేత నీ సకల చరాచర ప్రపంచములను సృజించి పెంచి ప్రళయ కాలమున సంహరించుచు లీలావినోదము సలుపుచున్న సర్వవిశ్వమాతను మనసార నెదలో సంస్మరింతును. ఈ కనంబడు జగంబునెల్ల బ్రహ్మయే సృజించెనను నుడి లోకమున వ్యాప్తిలో నున్నది. వేదవిదులు పురాణవేత్తలు నీ విషయము నిట్లే చెప్పుచున్నారు. కాని యా బ్రహ్మయు విష్ణుని నాభికమలమునుండియే జన్మించెను. అతడా విష్ణుని ప్రేరణ చేతనే విశ్వసృష్టికి గడంగెను. కనుక బ్రహ్మయును స్వష్టికార్యమున పరాధీనుడే. ప్రళయకాలమున విష్ణువు శేషశయ్యపై పవ్వళించగా నతని బొడ్డుతమ్మినుండి నలువ యుద్భవించెను. ఆ విష్ణువున కాధారము వేయిపడగల శేషఫణియని మన మెఱుగుదుము. కనుక విష్ణువే విశ్వసృష్టి కాధారమని యెట్లు చెప్పగలము? ఆ మహాసాగర మందలి జలము రసమయమైనది. ఆ రస మేయాధారమును లేక నిలువజాలదు. మాయాశక్తి స్వరూపిణియగు విశ్వజననియే యా జలముల కాధారభూతురాలు. నేనా విశ్వకారణయగు తల్లినే శరణు వేడుకొనుచున్నాను. యోగనిద్రలోనున్న విష్ణునిగాంచి నలువ యే దయామయిని ప్రస్తుతించి యామెను ప్రసన్నురాలినిగ జేసికొనెనో యా దయామృత తరంగిణిని నేను శరణు పొందుచున్నాను. ఆ సగుణ నిర్గుణ స్వరూపిణి మాయామయి ముక్తిప్రదాయిని యగు తల్లినే ధ్యానించి సంపూర్ణ దేవీభాగవత మహాపురాణమును మీకు వచింతును. మునులారా! మీర లది కడుశ్రద్ధగ వినుడుః

ఈ శ్రీదేవీభాగవత మహాపురాణము పుణ్యకరమైనది. ఉత్తమోత్తమమైనది. ఇందు పదునెనిమిదివేల శ్లోకములు గలవు. పండ్రెండు స్కంధములు మూడువందల పదునెనిమిది యధ్యాయములు గలవు. దీనిని శ్రీ వ్యాసభగవానుడు ప్రవచించి ప్రకాశింపచేసెను. ఈ శ్రీదేవీభాగవత పురాణము నందు ప్రథమ స్కంధమున ఇరువది రెండవస్కంధమున పండ్రెండు మూడవస్కంధమున ముప్పది నాల్గవస్కంధమున నిరువదియైదు ఐదవస్కంధమున ముప్పదియైదు ఆఱవస్కంధమున ముప్పదియొకటి ఏడవస్కంధమున నలువది ఎనిమిదవస్కంధమున నిరువదినాలుగు తొమ్మిదవస్కంధమున నేబది పదియవస్కంధమున పదుమూడు పదునొకండవస్కంధమున నిరువదినాలుగు ద్వాదశస్కంధమందు పదునాలుగు అధ్యాయములు గలవు. ఈ మహాపురాణము పదునెనిమిదివేల శ్లోకములు గలదిగా శ్రీవ్యాసమహామునిచే రచింపబడెను. ఇది సర్గము ప్రతిసర్గము వంశము మన్వంతరము వంశానుచరితమునను నైదు లక్షణములతో తనరారుచున్నది. ఆ పరాభట్టారికయే నిత్య నిర్గుణ నిర్వికల్ప శివస్వరూపిణి విశ్వాధార యోగగమ్య తురీయ. అనగా సాత్త్విక రాజస తామస శక్తిత్రయము కంటె విశిష్టమగు పరబ్రహ్మరూపిణి. ఆ విశ్వవ్యాపిని యొక్క సాత్త్వికరాజస తామస శక్తులే శ్రీమహాలక్ష్మి శ్రీమహా సరస్వతి శ్రీమహాకాళి యను స్త్రీ త్రితయ స్వరూపమున చెన్నొందు చున్నవి. ఆ మూడు శక్తులే యీ సృష్టికి నిమిత్తమై దివ్యదేహములు దాల్చును. అట్టి రూపములు దాల్చు లక్షణమునే శాస్త్రకోవిదులు సర్గమని పేర్కొందురు. ఆ ముత్తెఱంగులగు శక్తుల కారణముననే విష్ణు బ్రహ్మ మహేశు లుద్భవించిరి. వీరివలననే సృష్టి పాలన లయములు నిరంతరముగ జరుగు చుండును. ఈ మూర్తి త్రయోద్భవ వృత్తాంతమునే ప్రతిసర్గ మందురు. సూర్య చంద్రవంశజులైన రాజుల వంశచరితమును హిరణ్యకశ్యపాదుల చరిత్రమును దెలుపు లక్షణమునకు వంశమనిపేరు. స్వాయంభువుడు మొదలగు మనువుల వంశములను వారి జీవితకాల పరిమాణములను అభివర్ణించుట మన్వంతరమనంబడును. ఆ మనువేల వంశకథల గూర్చి తెలుపుట వంశానుచరిత మనంబరగును. ఇవియే పురాణములయందుండవలసిన పంచలక్షణములు. తొల్లి శ్రీ వ్యాస మహాముని శ్రీ మహాభారతేతిహాసమును విరచించెను. అది వేదసారము పంచమ వేదము నని ప్రసిద్ధిగాంచినది. అందు నూటయిరువది యైదువేల శ్లోకము లొప్పుచుండును.

శౌనకు లిట్లనిరిః  ఓ సూత మహామునీ! నీవు సర్వజ్ఞుడవు. ఆ పురాణములన్నియునెన్ని? వాని పేరులేమి? వాని నన్నిటిని వినగోరుచున్నారము. మాకు వానిని వివరించి తెల్పుము. కలికాలమువలని భయమున మేమీ నైమిశారణ్యమందు నివసించుచున్నాము. ఇది పావనక్షేత్రము. మునుపు బ్రహ్మ తన మనోమయ చక్రమును మా కొసంగి యిట్లనియెను: మీరీ చక్రము వెంట నరుగుడు. ఈ చక్రపునేమి - బండి కంటికమ్మి - యెచ్చోట జారిపడునో యచ్చోటు పవిత్రమైనదని యెఱుంగుడు. ఆ చోట కలిప్రవేశము జరుగనేరదని తెలిసికొనుడు. సత్యయుగము మరల వచ్చువఱకు మీరలా పవిత్ర క్షేత్రమందే యుండుడు. మేమా బ్రహ్మవాక్కులు విని సకల లోకములు చూడ ఆ చక్రము త్రిప్పుచు దాని వెంటనే యరిగితిమి. అది తిరిగి తిరిగి యిచ్చోటికి వచ్చెను. వెంటనే ఆ బండి కంటికమ్మి చూచుచుండగనే యిచ్చోట పడెను. చక్రనేమి శీర్ణమై పడిన స్థలమగుటచే నీ క్షేత్రము నైమిశమని ప్రసిద్ధి కాంచినది. ఇది పరమపావనమైన పుణ్యక్షేత్రము. ఈ పావన స్థలమున కలిప్రవేశము జరుగజాలదు. ఈ కారణముననే మహాత్ములు సిద్ధులు మునులు మేమును కలిభయపీడితులమై యిచ్చోటనే నివాసమేర్పరచుకొంటిమి. సత్యయుగము సమీపించు వరకు మేమిచ్చోటనే పశుహింస లేని పురోడాశాది యాగము లొనరించుచు మా జీవితకాలము గడపుకొందుము. సూతముని సత్తమా ! మా పూర్వ పుణ్యవిశేషమున నీవిచ్చటి కరుగుదెంచితివి. మాకు బ్రహ్మ సమ్మితము పరమపావనము నగు పురాణము నీవు వినిపింపుము. నీవు ధీశాలివి. మహావక్తవు. మేము ఇతర విషయ చింతమాని యేకాగ్ర చిత్తమున పురాణము విన నుత్సహించుచున్నవారము. పవిత్రము నిత్య కళ్యాణప్రదము వేదసమ్మతమునగు ఆ దేవీ భాగవత పురాణము మాకు వినిపించి నీవు తాపత్రయములు లేక దీర్ఘాయుష్కుడవై జీవింపుము. ఆ వ్యాసమహర్షి ధర్మార్థకామ మోక్షములగూర్చియును మహావిద్యను గుఱించియు నా పురాణమందు పరి వర్ణించెను. అట్టిదానిని మాకు వినిపింపుము. ఆ మునీంద్రుడు చెప్పిన సుమనోహరము పరమ పావనము రసభరితమునగు కథలెంతవిన్నను మాకు తనవితీరుటలేదు. సకల సద్గుణములకు పాత్రమైనదియు పవిత్రమైనదియు శ్రీ జగన్మాతయొక్క లీలానాట్యములతో విచిత్రమైనదియు సమస్త పాపరాసులను పటాపంచలు చేయునదియు నెల్లకోర్కులీడేర్చునదియునైన శ్రీభగవతి యను దేవి పేరబరగు శ్రీ దేవీమహాభాగవతమును మాకు దయతో వివరింపుము.

*ఇది శ్రీ దేవీభాగవతమునందలి ప్రథమ స్కంధములోని ద్వితీయాధ్యాయము.*_*శ్రీ దేవి భాగవతం - 7 వ అధ్యాయము*_

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*విష్ణుప్రబోధము*

☘☘☘☘☘☘☘☘☘

*సూతు డిట్లనియె:*  ఆ బలశాలురగు మధుకైటభ రాక్షసులను జూచి బ్రహ్మ సర్వతంత్రజ్ఞుడగుటవలన సామదానభేదదండో పాయములను గూర్చి యాలోచింపదొడంగెను: ''వీరికి బలమెంతగలదో నిశ్చయముగ నాకు తెలియదు. కనుక నెదుటివాని బలాబలము లెఱుగక పోరుసలుపుట మేలుగాదు. దుర్మార్గులు మదమత్తులునగు వీరిని నేనిపుడు పొగడినచో నా చేతకానితనము నా చేతనే ప్రకాశింప చేయబడినట్లగును. నా దౌర్బల్యము బట్టబయలైనంతనే వీరిలో నొక్కడే నన్ను దునుమాడగలడు. వీరు దానముచేతను వశముగారు. ఇక వీరిపై భేదోపాయమునెట్లు ప్రయోగింపగలను? కాన నేనిపుడు శేషశయనుడగు భగవంతుని మేలుకొలుపుదును. ఆతడు మహాసత్త్వుడు - జనార్దనుడు - చతుర్భుజుడు - ఆతడే నా వెతలు బాపగలవాడు.'' ఈ విధముగ నెమ్మది దలంచి కమలాసనుడగు బ్రహ్మ వేగమే శోకనాశకుడు సర్వము తానయైనవాడు నగు వాసుదేవుని శరణు జొచ్చెను. ఆ జగత్పతి యోగనిద్రలో మునిగి కదలకుండెను. అట్టి నారాయణుని మేలుకొలుపుటకు బ్రహ్మ పలు మేలైన సంబోధనలతో హరి నిట్లు సంస్తుతించెను: ''ఓ దీననాథా! శ్రీహరీ! మాధవా! వామనా! భక్తత్రాణపరాయణా! జగత్పతీ! మేలుకోగదవయ్యా! సర్వాంతర్యామీ! అమేయాత్మా! వాసుదేవా! విపక్షశిక్షా దక్షా! చక్రగదాధరా! విశ్వాధారా! హృషీకేశా! మేలుకోగదవయ్యా. సర్వజ్ఞా! లోకేశా! సర్వశక్తి సమన్వితా! శోకనాశనా! దీనపరిపాలకా! లేలెమ్ము-మేలుకోగదవయ్యా. ఓ విశ్వంభరా! విశాలాకారా! పుణ్యశ్రవణకీర్తనా! నిరాకారా! లోక సృష్టి స్థిత్యంతకారకా! మేలుకోగదవయ్యా! నీవఖిలాధారుడవే! నీకిదంతయును దెలియుటలేదా! శ్రీ మహావిష్ణో! శరణార్థిని దీనుని దుఃఖితుని నన్నే యుపేక్షించినచో నింకమీదట నీ పాలకత్వమునకు భంగము వాటిల్లదా?' అని పెక్కుభంగుల సన్నుతించినను హరి యోగనిద్రావశుడై మేల్కొనలేదు. అపుడు బ్రహ్మ మరల తన యెదలో నిట్లు తలంచెను:

''ఈ హరియొక మహాశక్తికి లోబడి యుండుటచేత యోగనిద్రకు వశుడయ్యెను. కనుకనే యీ ధర్మాత్ముడెంతకును మేల్కొనుట లేదు. నేను దిక్కు మొక్కు లేని దీనుడను. ఇపుడేమి చేయగలను? ఈ మదమత్తులు దానవులు నన్ను వెన్నాడి చక్కాడ దలచుచున్నారు. ఇపుడేమి చేతును? ఎక్కడికేగుదును? నాకభయమొసంగునాథుడే యింక లేడా?'' ఇట్లు బ్రహ్మ తన మదిలో దలపోసిపోసి తుదకేకాగ్ర చిత్తముతో యోగమాయను సంతోషపఱచవలయునని నిశ్చయించుకొనెను. ఏ విశ్వశక్తి మూలమున హరి యచేతనుడై కదలకుండెనో, యా శక్తియే నను బ్రోవ సమర్థురాలగునని నిశ్చయించుకొనెను. ప్రాణము లేనివాడు శబ్దాది విషయము లెఱుగలేనట్లు యోగనిద్రలో నరమోడ్పు గన్నులవాడగు హరియు నేమియు నెఱుగలేకున్నాడు. ఇట్లెన్నెన్ని రీతుల కీర్తించినను హరి తనకూర్కును వదలుటలేదు. అందువలన కునుకితని వశమందులేదు. ఇతడే కున్కునకు వశీభూతుడయ్యెనని తోచుచున్నది. ఎవడెవని వశమున వర్తించుచుండునో వాడు వానికెల్లప్పుడు కింకరుడగును. ఈ కారణమున మాపతియగు హరికి యోగనిద్ర స్వామిని యగును. ఆ జలనిధి కన్యక సైతము హరిని తనవశమందుంచు కొనెను. కనుక నీ బ్రహ్మాండగోళములన్నియును సర్వశక్తుల కాదిశక్తియగు భగవతిచేతి కీలుబొమ్మలే. శ్రీహరి హరుడు రమ పార్వతి భారతి మేమెల్లరము నా శ్రీభగవతికి దాసానుదాసులమే. ఇందేమియు సందియము లేదు. ఆ హరియే సామాన్య మానవుని పగిది నిద్రా దేవతకు వశుడయ్యెను. ఇతర మహాత్ముల గుఱించి వేరుగ జెప్పెడి దేమి గలదు? కనుక నేనిపుడా యోగమాయనే ప్రస్తుతింతును. అపుడుగాని దేవి దయవలన హరి మేల్కాంచి వైరులతో సమరమొనరింపడు.''

అని యిట్లు పద్మాసనుడగు బ్రహ్మతలచి విష్ణునంగములందున్న యోగనిద్ర నిట్లు ప్రస్తుతింపదొడంగెను: ఓ దేవీ ! నీవే యీ యెల్లజగముల కన్నతల్లివని వేదములు పలుకగా చక్కగా నిక్కువ మెఱింగితిని. ఎల్లలోకములను పరమ వివేకమున బాలించు పురుషోత్తముడే నీ ప్రభావమువలన నిపుడు నిద్రావశుడయ్యెను. నీ మోహన విలాసలీల లెవడెరుంగగలడు? హరియును వివశుడై నిదురించుచున్నాడు. నేను మూర్ఖుడను. సకల భూతహృదయములలో నిండియుండు చైతన్యజ్యోతి నీవే. నిర్గుణాత్మికవగు నీ ప్రతిభా ప్రభావములు విబుధకోటులలో నెంత కోవిదుడైన నెఱుగ జాలడు. సాంఖ్యులు నిన్ను పురుష ప్రకృత్యాత్మికగ చైతన్య భావరహితనుగ లోకజనయిత్రిగ భావింతురు. నీవు నిక్కముగ నట్టిదానవా? కావు. నీవు ముమ్మాటికి చైతన్యజ్యోతిఃస్రవింతివే. కనుకనే నేడు విష్ణువు నీ మూలముననే చైతన్యము లేక పడియున్నాడు. నీవు సగుణరూపములతో బహుభంగుల మాయా జగన్నాటక సూత్రధారివై తనర్తువు. నీ కార్యప్రణాళిక నెట్టివాడును గ్రహింపజాలడు. నిన్ను మునులు సంధ్యాదేవతవని పిలుతురు. వారు నీ దివ్యసుగుణములను రేయనక పగలనక నీమముతో ధ్యానించుచు జపించుచుందురు. కనుక నీ విజ్ఞాన వినోదలీల లనంతములు. ఓ జననీ! నీవే యెల్లజగములకు తెలివి వెలుగు జూపు జ్ఞానరూపవు. దేవతలకు నిత్యసుఖకారిణియగు శ్రీవి. సకల ప్రాణులందలి శ్రద్ధ-బుద్ధి-మతి-ధృతి-కీర్తి-కాంతి-రతి- యివన్నియు నీవే. ఇంతకు మిక్కిలిగ తర్కవితర్కములతో బనియేమి? లోకముల కన్నిటికి నీవే మూలకారణ శక్తివి. నాకు దుఃఖము గలుగుటకును హరి నిద్రాళుడై యుండుటకును నీవే కారణమని నాకు ప్రత్యక్ష ప్రమాణము గోచరించుచున్నది. వేదమాతా! నీవు వేదవిదులకే తెలియరావు. ఆ వేదములు సకలార్థములను వెల్లడించగలవు. ఐన నవి నిన్నెఱుగజాలవు. ఏలయన, నన్నియును వేదమాతవగు నీ నుండియే యావిర్భవించినవిగదా! ఇట్లు సర్వకార్యములు నాకు ప్రత్యక్షముగ దోచుచున్నవి. నీ చరితమును తుదముట్ట తెలిసినవా డెవ్వడు? ఆ వైకుంఠుడు కైలాసవాసి సురలు నా కొమరులగు మునులు నేను నీ మహోజ్జ్వలమహిమ నర్థము చేసికొననేరము. ఎల్ల లోకములకే నీ మహిమ యందరానిది. ఓ పరాదేవీ! యజ్ఞములందు 'స్వాహా' యని నీ నామధేయమే పలుకబడును. అట్లు పలుకనిచో నమరులకు వారి భాగధేయము వారికి లభించదు. కనుక నెల్లదేవతల బ్రతుకుదెరువులు నీ చేతిలోనే కలవు.

ఓ వరదాయినీ ! తల్లీ ! తొల్లిటి కల్పమందు నీవు నన్ను గాపాడితివి. ఇపుడీ ఘోర క్రూర దానవులను గన్నంతనే నా గుండె జలదరించుచున్నది. వారి భయమున నిన్నే శరణనుచున్నాను. నన్ను బ్రోవుము. ఈ సమయమున హరి నా మొఱ వినునట్టులేడు. అతని తనువు నీ వశమందే కలదు. కనుక నీవు హరి నిద్రా ప్రమత్తతను వదలింపుము. కాదేని యీ దానవులనైన హతమార్చుము. నే జెప్పనేల? నీ కెట్లు ఇష్టమైన అట్లు చేయుము. నీ యపార పరమప్రబావ మెఱుంగని మందమతులు హరిహరులనే కొలిచెదరు. ఆ విష్ణువే యిట వివశుడై నిద్రించుటచే నీ మహిమ నా కిపుడు ప్రత్యక్షముగ బోధపడినది. ఆ లక్ష్మియును నీ కధీనయే. కనుక నామెయును హరిని మేలుకొలుపజాలదు. ఆ లక్ష్మిని సైతము నీవే నీ శక్తితో నీ వశమందుంచుకొంటివని తలంతును. నీవే విశ్వజననివని కోర్కెలుకురియు కామధేనువవని భక్తిపరులు నిష్కామముగ నీ పదకమలములచే నమ్మి నీయందు లీనమై నిన్నే నిచ్చలు సేవింతురు. అట్టివారితరదేవతలను గొలువరు. అట్టివారే ధన్యులు. బుద్ధి కాంతి కీర్తి శుభవృత్తి మున్నగు దివ్యకల్యాణ గుణములు నీ యందే చోటుచేసికొని యున్నవి. ఆ విష్ణువు నందలి సద్గుణములు నే డేమయ్యెనో తోచుటలేదు. నీవు మానవతులలో వన్కెకెక్కినదానవు. అట్టి నీ నిద్రాశక్తికి హరి నేడు పరతంత్రు డయ్యెను. ఈ యెల్ల జగములందు నఖిల ప్రభావముగల పరాశక్తివి నీవే. నీ సంకల్పమాత్రముననే లోకము లన్నియును నిర్మింపబడినవి. నటుడు నాటకమందు స్వేచ్ఛగ విహరించును. నీవు నట్లే నీచే నిర్మితమగు మోహజాలమందు క్రీడించు చుందువు. మున్ను యుగాదియందు నీవే యీ విష్ణువును సృజించి యతినికి లోక రక్షణకై నీ విమల సత్త్వశక్తి నొసంగితివి. ఆతడే యిపుడిట వివశుడై యున్నాడు. నీవు సర్వపరిపాలన దక్షవు. నీ కేది మేలని తోచిన నదియే చేయును. నన్ను నీవే పుట్టించితివి. నన్ను నలుగురిలో నగుబాటుపాలు చేయుటకా? నీ యభిమతమిదియేనా? భవానీ! నీ యచ్చెరువుగొలుపు కార్యములను నేను కొంతకొంత యెఱిగితిని. ఈ యెల్ల భువనములను నీవే స్వతంత్రించి సృజించి యానందింతువు. తుదకు నీ యందే లయ మొనర్చుకొందువు. అట్లే యిపుడు నీవే నా చావు కోరుచున్నచో మంచిదే. ఇందు వింతలేదు. జగదంబికా! నన్ను నీవే వధించిన నాకు మేలే. నా కిక మరణదుఃఖమే యుండదు. మున్ను నీ చేతనే నేను సృష్టికర్తనుగ ప్రకటింపబడితిని. అట్టి నాకే యొక దానవుని చేతిలో చావుగలిగెననిన యపకీర్తి నీకే కల్గును. నీ కది గలుగకుండుగాక! నీవు వెనువెంటనే లెమ్ము. భీకరమూర్తివి గమ్ము. నీ కిష్టమైనచో రక్కసులనే చక్కాడుము. లేదా నన్ను నుగ్గాడుము. కాక హరిని నిద్దుర నుండి మేలుకొల్పుము. ఈ దనుజులను హరియే దునుమాడగలడు. ఇంతకీ సర్వకార్యములును నీ చేతనే సులభసాధ్యము లగును.  *సూతు డిట్లనియె :*
 అని బ్రహ్మ యిట్లు తామసీదేవిని సంస్తుతించెను. దేవి వెంటనే నారాయణుని దేహమునుండి వెడలి యతనిచెంత నిలుచుండెను. ఇట్లు పరమదేవియగు యోగనిద్ర దనుజుల నాశనమునకై అతుల తేజోనిధియగు విష్ణుని దేహావయవములనుండి తొలగినది. అపుడు జనార్దనునకు స్ఫూర్తిగలిగి మేను మెల్లగ గదలెను. అది గనుంగొని బ్రహ్మ పరమానందభరితుడయ్యెను.

*ఇది శ్రీ దేవీభాగవత మహాపురాణమందలి ప్రథమస్కంధమందు విష్ణుప్రబోధమను సప్తమాధ్యాయము.*_*శ్రీ దేవి భాగవతం - 8 వ అధ్యాయము*_

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*సర్వశక్తి స్వరూపిణి యారాధ్య దేవతయనుట*

☘☘☘☘☘☘☘☘☘

*ఋషులిట్లనిరి :* మహానుభావా! వేదశాస్త్ర పురాణములను పండితుల వచనములను వినుటవలన మా హృదయము లందొక నిశ్చయమై యున్నది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మువ్వురే సనాతనదేవతలు. ఈ బ్రహ్మాండములందు వీరిని మించిన దెద్దియును లేదని మా నిశ్చయము. కాల పాకవశమున తమ్మిచూలి లోకములు నిర్మించును. తమ్మికంటి బ్రోచును. ముక్కంటి లయింపజేయును. వీరే యన్నిటికి కారణభూతులు. పూర్వమొకటే సద్రూపముండెను. అదే మువ్వురు దేవతలుగ మారెను. ఆ ముగ్గురును సత్త్వము రజస్సు తమస్సను గుణములుగలవారు. వారే బ్రహ్మ హరి హరులు. సకల కార్యకరణ దక్షులు. ఆ మువ్వురిలోన శ్రీ విష్ణుభగవానుడు శ్రేష్ఠతముడు. ఆతడే యాదిదేవుడు - పురుషోత్తముడు - మాధవుడు - జగన్నాథుడు - కార్యదక్షుడు అని పేరొందెను. ఆ మహాతేజస్వియగు హరి యెదుట నిలువబడి యతనిని కాదని యెవ్వడు నేదియు జేయనోపడు. అంతటి లోకైకనాథుని సైతము వివశునిగజేసి యోగమాయ నిద్రపుచ్చినది. ఆ విష్ణుని యద్భుతమైన లీలలును విజ్ఞానమును కార్యాచరణసమర్థతయు నేడేమైనవి? మాకీ విషయమై సందియము గలుగుచున్నది. కనుక మా మనస్సులకు నచ్చునట్టు ఈ సందియమును తీర్చుము. భగవంతుడగు హరిని గూడ జయించిన మా మహాశక్తి యెవరు? ఆమె యెవరి మూలమున నంతగొప్పది యైనది? ఆమెకు అంత సామర్థ్యమెక్కడిది? ఆమెను మహాశక్తియని యేల పిలుతురు? సర్వేశ్వరుడు సచ్చిదానంద విగ్రహుడు పరమాత్మ పరానందుడు వాసుదేవుడు జగద్గురువు శ్రీ విష్ణువు. సకల కర్త - సర్వవ్యాప్తి - పరాత్పరుడు - విరజుడు - పావనుడునగు శ్రీ హరి నిద్రకెట్లు లొంగిపోయెను? మాకిదంతయును మిగుల నాశ్చర్యమును సందేహమును గొల్పుచున్నది. నీ తెలివియను కత్తితో మా యీ సందియమును ఛేదించుము.

సూతు డిట్లనియె : ఈ చరా చర ప్రపంచములందీ సందియమును దీర్పగలవాడొక్కడునులేడు. బ్రహ్మతనయులగు సనాతనమునులే దీనికి ముగ్ధులైరి. నారదుడు కపిలుడు మున్నగువారలే యీ ప్రశ్నను సమాధానించలేక పోయిరి. ఇక దీనిని విమర్శించుటకు నే నెవడను? ఆ విష్ణువే సర్వగుడు సర్వపాలకుడునని వేదములందు గలదు. ఆతని వలననే యీ చరా చర విరాడ్రూపము పుట్టినదని యందు వర్ణింప బడెను. వేలుపు లెల్లరును శ్రీ మన్నారాయణుడు విశ్వాకారుడు హృషీకేశుడు జనార్దనుడు మేఘవర్ణుడునగు విష్ణునకు దోసిలియొగ్గి యుపాసింతురు. కొందఱు చంద్రమౌళి ముక్కంటి పంచవక్త్రుడు వృషవాహనుడు మహాదేవుడు వామదేవుడు సకల నిగమసన్నుతుడు కపర్ది గౌరీదేహార్ధధారి సర్వశక్తి యుక్తుడు దక్షయాగ విధ్వంసకుడునగు శ్రీ సాంబసదా శివుని నిచ్చలు నభిషేకాదులతో సేవించుచుందురు. మఱి కొందఱు వేదవేత్తలు మూడు సంధ్యలందును పెక్కు స్తోత్రములతో పరమసత్య స్వరూపుడగు సవితృదేవుని ధ్యానించి జపింతురు. వేదములన్నియును సూర్యోపాసనమే యుత్తమమనియు సూర్యనారాయణుడే పరమాత్మయనియు నొక్కి వక్కాణించినవి. ఇంకను కొందఱు బ్రహ్మ విదులు నిగమములు పలికిన విధముగ నగ్నిని లోకపాలకుడగు నింద్రుని వరుణుని సంస్తుతింతురు. ఎల్ల ప్రవాహములతో గలిసి ప్రవహించు పావనగంగ నదులలో నుత్తమోత్తమమై యలరును. అఖిల దేవగణములందు పద్మనాభుడు పురుషోత్తముడై తనరును అని మహర్షులు వచింతురు. ఇక ప్రమాణములు ముత్తెఱంగులని పండితులు వాక్రుత్తురు. అవి ప్రత్యక్షము-అనుమానము-శబ్దముననబడును. కొందఱు వానిలో నుపమానమును జేర్చి నాలుగందురు. మఱి కొందఱు వానిలో నర్థాపత్తిని గలిపి ప్రమాణము లైదని పలుకుదురు. మనీషులు వానితో నితిహాసమును పురాణమును గలిపి సప్త ప్రమాణములు గలవందురు. ఇన్ని ప్రమాణములచే గూడ నా పరబ్రహ్మము పరాశక్తి వారికెంతమాత్రమును తెలియబడదు.

స్థితప్రజ్ఞుడు తన నిశ్చయాత్మక బుద్ధిచే వేదాంతార్థములచే నాత్మతత్త్వమును గూర్చి తనయందే స్వాత్మతత్త్వం విచారణ చేయుచుండవలయును. ప్రత్యక్షవస్తు విజ్ఞానముచే బుద్ధిమంతుడు మాటి మాటికిని విత్కరించుచు ఆత్మ చింతన చేయవలయును. తాను దృష్టాంతములతో తన నిజ స్వరూపమును విమర్శించుకొన వలయును. ఆప్తులుదెలుపు సత్య మార్గమున నడువవలయును. ఈ విధముగ స్వాత్మదర్శనము విషయమున పండితులు నుడుపుదురు ఎల్లపురాణములందు నిట్లే కలదు. బ్రహ్మయందు సృజనశక్తి శ్రీ విష్ణువునందు పరిపాలన శక్తి గలదు. రుద్రునియందు సంహారక శక్తి సూర్యునిలోన ప్రకాశన శక్తి శేషునందు కూర్మమునందు భూభరణ శక్తి అగ్నియందు దహనశక్తి వాయువునందు ప్రేరణశక్తి మున్నగు నీ శక్తులన్నియు నా మహాశక్తి పరిణామ స్వరూపములే. కుండలినీ శక్తికి దూరమైనచో శివుడును శవత్వమందును. శక్తి రహితుని పండితులు వీడు చేతకాని వాడని దెప్పుదురు. కాన నీ స్థావర జంగమాత్మకమైన బ్రహ్మాండ మందు గడ్డి మొదలు బ్రహ్మ వఱకుగల భూతములన్నిటి యందు నిటులే శక్తి నిండి యిమిడి వెలుగొందును. అట్టి శక్తిలేని చరాచర వస్తువులు పనికిమాలినవే. శక్తిహీనుడు నడచుటకును తినుటకును పరుల గెలుచుటకును పనికిరాడు. అట్టి సర్వగత మగు శక్తినే పరబ్రహ్మమందురు. ఆ విశ్వశక్తి నాత్మరతితో తెలివివెలుగుతో విచారించి పెక్కుగతుల నిత్యము నుపాసింప వలయును. విష్ణునందు సాత్విక శక్తి గలదు. దానినతడు గోల్పోయినచో నతని యాట కట్టినట్లే. బ్రహ్మయందు రాజస శక్తి గలదు. అది లోపించినచో నతని రచన యాగినట్టే. శివునియందు తామస శక్తి గలదు. దానిచే నతడు సంహారమొనర్పగల్గును అని యిట్లు చక్కగ నెఱింగి వ్యక్తి తన శక్తిని దాను తెలిసి కొనవలయును.

ఆ మూలాధార శక్తియే యీ చరాచర బ్రహ్మాండములను నిర్మించును - పోషించును - సంహరించును. ఆ శక్తి బలమే లేనిచో బ్రహ్మ హరి శివుడు రవి వహ్ని వరుణుడు మున్నగు దేవతలు శక్తిహినులగుదురు. దాన వారి పనులు కుంటుపడినట్లే. దేవత లెల్లరును శక్తియుక్తులైననే తమ తమ పనులు చక్కగ నెరవేర్చుకొందురు. ఆ శక్తియే యన్ని కార్య కారణములందును ప్రత్యక్షముగ వెల్లడి యగుచుండును. ఆ శక్తినే మనీషులు సగుణయనియు నిర్గుణయనియు రెండుగ దెల్పిరి. రాగవంతులు సగుణశక్తిని విరాగులు నిర్గుణశక్తిని గొలుతురు. ఆ శక్తియే ధర్మార్థ కామ మోక్షము లీజాలు స్వామిని. ఆ దేవిని విధి విధానమున నారాధించినచో నామె మనయెల్ల కామితార్థము లీడేర్చగలదు. జడమతులు మాయకు లొంగుటచే నా శక్తి మహిమ నెఱుగ జాలరు. కొందఱాశక్తినే కొలదిగ తెలిసికొందురు. కాని, వారితరులకు దానిని తెలుపనేరక వారిని భ్రమలో ముంతురు. మందమతులగు పండితులు కొందఱు కలిప్రేరితులై పొట్టకూటికై చేయరాని పనులుచేసి పాషండులగుదురు. ఈ కలికాలమున ననేక విపరీతములు తలలెత్తును. కాని యితర యగములం దధర్మములు లేనేలేవు. విష్ణువు దేవి దయకై పెక్కేండ్లు తీవ్ర తపమాచరించు చుండును. స్వయంభువు శంభువు నాధ్రువ శక్తి దయ సంపాదింప నిరంతరముగ ధ్యానింతురు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లోననేమేమో కోరికల పుట్టలు పెంచుకొని యనేక యజ్ఞములు సలుపుదురు. వారా పరశక్తిని పరబ్రహ్మమునుగా సనాతనగా పరాత్మికగ నిత్యగా నిత్యము తమ చేతములందు ధ్యానింతురు. కనుక నన్నియు తెలిసిన విద్వాంసులా పరమశక్తినే నిత్యము సంసేవింప వలయును. ఇదే సకల శాస్త్రముల సారమని తెలియవలయును. నిజముగ సకలశాస్త్రము లందును దెలిసికొనదగిన దాశక్తియే. ఇదంతయును నేను శ్రీ వ్యాసుని వలన వ్యాసుడు నారదుని వలన దేవర్షి తన తండ్రి బ్రహ్మ వలన విష్ణుని వలన నెఱింగితిమి. పండితు లితరుల మాటలు వినరాదు - తలంపరాదు. కృతనిశ్చయులగు ధీరులా సత్యశక్తినే సంసేవింప వలయును. అశక్తుని యందలి సత్తువ యెంతటిదో కన్నులార చూచిన గాని తెలియదు. కావుననే సకల భూతము లాపరశక్తినే యెఱగి నిత్యము సమారాధించవలయును.

*ఇది శ్రీ దేవీ భాగవత మహాపురాణమందలి ప్రథమ స్కంధమందలి అష్టమాధ్యాయము.*_*శ్రీ దేవి భాగవతం - 9 వ  అధ్యాయము*_

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీదేవి దయచే విష్ణువు మధుకైటభుల పరిమార్చుట*

☘☘☘☘☘☘☘☘☘

*సూతు డిట్లనియెను :* జగద్గురుడగు విష్ణుని దేహమందలి కన్నులు ముక్కు నోరు గుండె ఱొమ్ములనుండి నిద్ర తొలగిపోయెను. అపుడా తామసశక్తి హరి మేను విడనాడి గగనసీమపై నొప్పుచుండెను. ఆ హరియు మాటి మాటి కావులించుచు మేలుకాంచెను. మహాతేజుడు శ్రీహరి భయపీడితుడైన బ్రహ్మను గనుంగొని మేఘగంభీర భాషలతో నతని కిట్లు పలికెను: ఓ భగవానుడా! కమలజా! నీ తపము వదలి యిటకేల యరుగుదెంచితివి? మఱియు చింతా తరుడవై భయభీతుడవై వైక్లబ్యమున నేలయుంటివి? బ్రహ్మ యిట్లనియెను: ఓ దేవా! నీ చెవుల మలమునుండి భీకరాకారులు బలవంతులు మధుకైటభులను దనుజులను పుట్టిరి. జగత్పతీ! దేవా! వారివలన భయమున నేను నీ సన్నిధి చేరితిని. నేను భయగ్రస్తుడను-విచేతనుడను. నన్ను త్వరగా కాపాడుము. విష్ణు విట్లనియెను: నీ విచటనే యుండుము. నేనేగి వారి యంతు తేల్చుకొందును. ఆ మూఢుల కాయువు మూడినది. లేనిచో నాతోడ నేల బోరవత్తురు? సూతు డిట్లనియెను: ఆ దేవేశుడట్లు పలికినంతనే యా మదమత్తులు విక్రమవంతులు నగు రక్కసులు వేల్పు పెద్దను వెదకుచు నచటి కేతెంచిరి. ఓ మునులారా! ఆ సంద్రమునందు నిరాధారులై విగతజ్వరులై మదగర్వమున విఱ్ఱవీగు దైతేయులు బ్రహ్మతో నిట్లనిరి: మానుండి పరుగెత్తి నీ వితని చెంత కెల వచ్చితివి? మాతో రణము సల్పుము. ఈ పురుషుడు చూచుచుండగనే యిపుడే నిన్ను బరిమార్తుము. ఆ పిదప పాపసెజ్జపై పరున్న యితనిని హతమార్తుము కాన నీవు మాతో బోరుము. లేక మీకు దాసుడనైతి ననుము.

సూతు డిట్లనియెను : వారి పలుకులు విని జనార్దనుడు వారి కిట్లనియెను: ఓ దైత్యులారా! మీరు నాతో సంగర మొనరింపుడు. మహాబలులారా! మదయుతులగు మీ కండకావరమంతయు నిపుడే యంతమొందింతును. మీ కిష్టమైనచో నాతో సంగర మొనరింపుడు. సూతు డిట్లనియెను : హరి మాటలు విని వారు క్రోధమున నెఱ్ఱబారిన గుండెలతో నిరాధారమైన నీటిలోనే యుండి యుద్ధము సేయ దలపెట్టిరి. అంత మధువు శ్రీహరితో రణ మొనర్ప నాయత్తమయ్యెను. కైటభుడూరుకుండెను. వారు మత్తమల్లవీరులవలె పోరదొడగిరి. మధు వలసట జెందగనే కైటభుడు హరితో నాలము సల్పుచుండెను. ఆ మధుకైటభు లొకరి తరువాత నొకరు రాగాంధులై ప్రభవిష్ణువగు విష్ణునితో బాహుయుద్ధమునకు దలపడిరి. ఆకసమునుండి శ్రీదేవియు బ్రహ్మయు నిరువురును వారి పోరితము తిలకించుచుండిరి. దురము సలుపు దానవు లెంతకు నలయుటలేదు. కాని హరి డస్సిపోయెను. ఈ రీతిగ నాలము జరుగుచుండగ నైదు వేలేండ్లు గడచినవి. భగవంతు డంతట వారి వధోపాయమునుగూర్చి తన మదిలో నీ రీతి విచారించదొడగెను: నేను వీరితో నైదు వేలేండ్లుగ బోరితిని. ఐనను వీరికి శ్రమ గలుగుటలేదు. కాని నేనలసితిని. ఇదంతయు జూడగ నాకచ్చెరువు గలుగుచున్నది. నా బలవీర్యములు నేడేమైనవి? వీరింకను కుశలముగనే యున్నారు. ఇందులకేమి కారణమో? ఇట్లు హరిని గని మదోన్మత్తులగు దనుజులు సంతసమున మేఘగంభీర నిస్వనమున హరితో నిట్లనిరి: విష్ణూ! నీలో బలముడిగినచో రణములో నలసట చెందినచో నేను మీ దాసుడనైతినని తలపై దోయిలించుము. కాక నీకు లావే యున్నచో తిరిగి మాతో గయ్యము సేయుము. మొదట నిన్ను జంపి పిదప నలుమోములుగల యీ మహాపురుషుని నంతమొందింతుము.

సూతు డిట్లనియెను : వారి మాటలు విని భగవంతుడు సామపూర్వకముగ నింపుసొంపు దనరు పలుకులతో సాగర మందున్న దానవులకిట్లనియెను : మహావీరులు జంకిన - యలసిన - శస్త్రము వదలినవానిపైగాని బాలునిపైగాని దెబ్బకొట్టరు. ఇది సనాతన ధర్మము. మీతో నే నైదు వేలేండ్లు బోరితిని. మీరిరువురును సమబలులు, సోదరులు. ఎడతెరపి లేక బోరువారు. నేను మాత్ర మొక్కడనే! మీరు నట్ట నడుమ సేద దీర్చుకొని కయ్య మొనర్చుచున్నారు. ఇక మీదట నేను సైత మలసట దీర్చుకొని పిమ్మట మీతో తప్పక పోరు సల్పుదును. కనుక నేను విశ్రమించి వచ్చి న్యాయమార్గమున రణము సలుపు దనుక బలశాలురు మదోత్కటులు నగు మీరు తాలిమి బూనుడు. సూతు డిట్లనియెను : ఆ హరి వాక్కులు విని రాక్షసులు అతనిపై విశ్వాసముంచి విష్ణుడు విశ్రాంతినొందిన పిమ్మట మరల సమరము కొనసాగించదలచి దూరముగ తొలగియుండిరి. చతుర్భుజుడగు వాసుదేవుడు రక్కసులను దూరమందే కాంచి వారి చావు కారణమును తన మనస్సులో నిట్లు విచారించుచుండెను. అంతలో హరి కీ విధముగ జ్ఞానోదయమయ్యెను. శ్రీదేవీ వరము నుసరించి వీరు స్వచ్ఛందమరణులు. వీరు నశింపరు. నేను వీరితో వ్యర్థముగ రణమొనర్చితిని. నా పడిన శ్రమయంతయు వమ్మైనది. ఇక ముందెట్లు వీరిని గెలువగలనో తెలియుట లేదు. నేనెదిరించినచో వరమదగర్వితులగు వీరిచ్చోటు వీడి కదలరు. చావకున్నచో వీరు మరింత దుఃఖకారకులగుదురు. భగవతి వీరి కొసగిన వరమతి దుర్భరమైనది. ఎంత దుఃఖితుడైనను తాను స్వయముగ చావగోరుకొనడు గదా! రోగియై యుండియు దీనుడైయున్నను నెవ్వడును చావగోరడు. ఇంక నీ బలమదోన్మత్తులు తమ చావు తామే యేల కోరి తెచ్చుకొందురు? కనుక నిత్తఱి కామప్రదాయినియగు శ్రీ విద్యాశక్తిని నేను శరణు వేడుదును. ఆమె సుప్రసన్న కానిదే కోరికలు సిద్ధింపవు.

ఇట్లు తలంచి హరి నింగిపై నున్న మనోహర శివ స్వరూపిణియగు యోగనిద్రను దర్శించెను. అమేయాత్ముడు యోగవిదుడునగు హరి ఆ రాక్షసులను చంపుటకై వరదాయినియు త్రిభువనేశ్వరియు నగు యోగనిద్రను దోయిలించి ఇట్లు సంస్తుతించెను : దేవీ! మహామాయా! సృష్టి సంహారకారిణీ! అనాదినిధనా! చండీ! భుక్తి ముక్తి ప్రదాయినీ! నీకు నా వందనములు. దేవీ! నీ సగుణ నిర్గుణ స్వరూపములు నే నెఱుంగజాలను. నీ విచిత్ర చరిత్రము లనంతములు. వాని నన్నిటి నెవ్వడు పేర్కొనగలడు? నీ దుర్ఘటమైన ప్రభావ విశేషము లెఱింగితిని. నేను నిద్రయందుండగ చేష్టలు దక్కియుంటిని. అపుడు బ్రహ్మ నన్ను మేలుకొలుపుటకు పలుమారు యత్నములు జరిపెను. కాని నా యింద్రియములు చేతలుడిగియుండుటచే మేల్కొనజాలకుంటిని. నీ ప్రభావముననే నిద్రించితిని. మరల నీ మూలముననే మేలుకొంటిని. ఈ ఘోర సంగర మొనర్చితిని. ఇందు నేనే యలసితిని గాని నీ వర మహిమ గల యీ దానవుల లయలేదు. ఇంతేకాక వారు బ్రహ్మను చంపుటకు బూనుకొనిరి. నేను వారిని ద్వంద్వ యుద్ధమునకు బురికొల్పితిని. వారితో మహాసాగరమునం దతి ఘోరముగ బోరు సల్పితిని. కాని వారి చావునకు నీ వరమడ్డుగ గలదని తెలిసికొంటిని. ఇపుడు సర్వశరణ్యవగు నిన్నే నే శరణుగోరుచున్నాను. ఓ దేవార్తి వినాశినీ! ఈ దానవులు వరదాన దర్పితులు. నేను యుద్ధముచే ఖిన్నుడనైతిని. కాన నాకిపుడు సాయపడుము. ఆ పాపులు నన్ను జంపన సమకట్టి యున్నారు. నేనేమి చేతును? ఎక్కడి కేగుదును? ఇట్లు హరి వాక్కులు విని అతి దీనముగ ప్రణమిల్లుతున్న దేవదేవుడు వాసుదేవుడు సనాతనుడునగు హరిని గని దేవి నగి యిట్లనియెను : దేవదేవా! నీవు మరల స్వయముగ యుద్ధ మొనరించుము. వీరిని మోసముతో జంపుము. నేను నా మాయాశక్తిచే వీరి బుద్ధులను మోహింపజేయుదును. అపుడా శూరులు మాయా మోహితులగుదురు. నీవు వెంటనే వారిని చంపుము.

ప్రీతి పూర్వకములగు శ్రీదేవి పలుకులు హరి వినెను. అంతలో ఆ మహావీరులగు దానవులు యుద్ధకాములై మహాసాగరమందలి సమరస్థలము జేరిరి. వారట విష్ణుని గని సంతసిల్లి ఓ మహాకామా!చతుర్భుజా! నిలునిలుము. మాతో యుద్ధ మొనరింపుము. నిజముగ జయాపజయములు దైవాధీనములు. బలవంతుడే సాజముగ గెలుపొందును. కాని యొకొక్కప్పుడు దుర్బలుడును దైవబలమున జయమందును. కనుక మహాత్ము డెప్పుట్టునను హర్షశోకములందరాదు. తొలుత పెక్కురు రక్కసులు దేవతల చేతులలో మడిసిరి గదా! ఇప్పడు నీవు మాత్రము మాతో బోరుచు పరాజయమొందితివి అనిరి. ఇట్లు పలికి మహాబలులగు దైత్యులు సమరమునకు తలపడిరి. అద్భుతకర్ముడగు హరి వారిని గాంచి తన బలముకొలది పిడికిట వారిని పోటు పొడిచెను. అపుడా పోటు మొనగాండ్రు హరిని మరల పిడికిళుతో పొడిచిరి. ఇట్లు వారికి పరస్పరము దారుణ రణము సంఘటిల్లెను. నారాయణుడా వీర్యవంతుల యుద్ధ నైపుణ్యము గాంచి దీనదృక్కులతో తన సమక్షమునందున్న భగవతిని దర్శించుచుండెను. సూతుడిట్లనియె : అపుడు దేవి కరుణ భావమున కందుచున్న హరిని పరికించి వెంటనే మరులు రేకెత్తించు వాడితూపులవంటి చూపులతో దానవులను జూచెను. ఒకేసారి పెద్దగ నవ్వెను. చిరునగవు నెయ్యము చిందులాడు దేవి నెమ్మొగముగాంచి యాపాపాత్ములు మోహమాదాంధులైరి. వారు నిర్మలకాంతులీను దేవీ రూపమునే మాటి మాటికి మనసుందు దలంచుచు మదనబాణహతులై యామెనే చూడ దొడగిరి. ఆ మహాదేవి మహిమవలన వారు మోహితులైరని కార్యకుశలుడగు భగవాను డూహించెను. అతడు నవ్వుచు మేఘగంభీర ఘోషముతో వారికిట్లనియెను; మీరలు మహావీరులు. పరమడుగుడు. మీ యుద్ధమునకు సంతుష్టుడనైతిని. మీకు వరమీయదలచితిని. నాతో తొలి పెక్కురు రక్కసులు బోరిరి. కాని మిమ్ముబోలు వీరాధివీరులను నేను గనలేదు, వినలేదు. అందుచే మీ మేటిబలమునకు సంతసించితిని. మీరు సమబలులు, సోదరులు, మీకోరిన వరమిత్తును. విష్ణువు వచనములు వినగనే వారికభిమానము మెండయ్యెను. వారు మదనపరవశులునైరి.

ఆ జగదానంద కారిణియగు మహామాయను కామపరవశులై చూచుచు వారు విష్ణువుతో నిట్లనిరి: ''ఓ హరీ! మేము యాచకులము గాము. నీకే మేము వరమీయగలము, మేమే దాతలము. కోరుకొమ్ము. నీకే మేము వరమిత్తుము. హృషీకేశా! వాసుదేవా! నీ మనస్సులోని కోరిక దెలుపుము. నీ విచిత్ర యుద్ధమునకు మేమెంతయు సంతసించితిమి.'' అను దానవుల మాటలు విని హరి వారికిట్లు మారు పలికెను: 'మీరు నా యెడల ప్రసన్నులైనచో మీరు నా వధ్యులుగండు.'' సూతుడిట్లనియె: ఆ హరి వచనములు విని వారు విస్మితులై మనము వంచింపబడితిమని శోకమున వ్యాకులచిత్తులైరి. అది అంతయును నీటిమయమే. నేలయెచ్చోటను లేదు. అది యెఱింగి దనుజులు హరికిట్లనిరి: దేవా! జనార్దనా! మొదట నీవే మాకు వరమిత్తునంటివి. కనుక సత్యపరాక్రముడనేని నీవే మాకు ముందుగ వరమొసంగుము. నీరు లేనిచోట నీవు మమ్ము వధించుము. అపుడు మేము వధ్యులమగుదుము, ఆ రీతిగ చేసి నీ సత్య ప్రతిజ్ఞను నిలువబెట్టుకొనుము.

అంత చక్రియగు హరి తన చక్రమును మది దలంచి వారితో నవ్వుచు నిట్లు పలికెను : మహాభాగులారా! నీరులేని చోటుననే మిమ్ము హతమార్చగలను. దేవదేవేశుడట్లు పలికి తన పెందొడలను మరింత వెడల్పు చేసి యిదే నీరు లేనిచోటని చూపి వారికిట్లనియెను: ఓ దనుజులారా! నా తొడలపై మీ తలలు విడిచెదరుగాక! అపుడు మీరును నేనును సత్య ప్రతిజ్ఞల మగుదుము. అదివిని మది విచారించి దనుజులు తమ మేనులు వేయి యోజనములంత పెంచిరి. దాని కచ్చెరుమంది భగవంతుడును తన పెందొడలు దానికి రెండింతలు పెంచెను. అపుడు వా రా పరమాద్భుతమైన పెందొడలపై తమ తలలుంచిరి. ప్రభ విష్ణువు తన చక్రముచే వారి తలలు ద్రుంచెను. ఇట్లు మధుకైటభులు ప్రాణములు గోల్పోయిరి. వారి మేదస్సుచే సాగరమంతయు నిండినది. ఆనాటి నుండి భూమికి మేదినియను మరొక పేరు గలిగెను. మునులారా! ఆ కారణముననే మన్ను తినదగనిదైనది. ఈ ప్రకారముగ మీరడగినదంతయును వివరించితిని. కనుక బుధులు నిరంతరము శ్రీ మహామాయా రూపయగు శ్రీ విద్యను సముపాసించ వలయును. ఎల్లసురాసురులు నాపరమ కళ్యాణ శక్తిని సమారాధించవలయును. ఇంతకు మించిన భాగ్యమీముల్లోకములందును మరేదియును లేదు. కనుక సగుణనిర్గుణాత్మిక యగు పరాశక్తి సతతము పూజనీయ అని యెల్ల వేదశాస్త్రార్థములందును వచింప బడినది. ఇది ముమ్మాటికి నిజము నిజము.

*ఇది శ్రీదేవి భాగవత మహాపురాణ మందలి ప్రథమ స్కంధమందలి నవమాధ్యాయము.*_*శ్రీ దేవి భాగవతం - 10 వ అధ్యాయము*_

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*వ్యాసుడు పుత్రార్థియై శివుని గూర్చి తపమొనర్చుట*

☘☘☘☘☘☘☘☘☘

ఋషు లిట్లనిరి : సూత మహర్షీ! మహా తేజస్వియగు వ్యాసుడీ దివ్యదేవీ పురాణమును రచియించి శ్రీ శుకునిచే దానిని చదివించెనంటివి. వ్యాసుడు తపమొనరించి శుకునెట్లుద్భవింపజేసెను? నీవా వ్యాసుని వలన విన్నదంతయు మాకు విశదమొనరింపుము. సూతు డిట్లనియెను : సత్యవతీ తనయుడు వ్యాసుని వలన యోగి వరుడగు శుకుని జన్మమెట్లుగల్గెనో యా వృత్తాంతము దెల్పెదను. పూర్వము సత్యవతీ సుతుడగు వ్యాసుడు రమణీయమైన మేరుగిరి శిఖరముపై నియమముతో పుత్రునికై ఘోరతపమాచరించెను. ఆ తపోనిధి పుత్రార్థియై నారదుని వలన నేకాక్షరమంత్ర రాజమగు వాగ్బీజమంత్రము నుపదేశము పొంది జపించుచు మహామాయను ధ్యానించు చుండెను. వ్యాసుడు తనకు నింగి గాలి నిప్పు నీరు నేలయను పంచభూతముల శక్తులతో సంపన్నుడగు పుత్రుడు గలుగవలయునని నిశ్చయించుకొనెను. అందులకై వ్యాసుడు నిరాహారియై దీక్షతో నూఱండ్లు తపమొనరించెను. శివాశివుల నారాధించెను. సకల భూతయోనియగు మహాశక్తియే యెల్లెడల బూజనీయయని తలంచి వ్యాసుడాదేవిని నిరంతరము గొలుచుచుండెను. లోకమందశక్తుడు నింద్యుడగును. శక్తుడు పూజ్యుడగును. ఆ మేరుగిరి శిఖరముపై అద్భుతకర్ణికారవనము శోభిల్లుచుండును. అందు వేల్పులు క్రీడలందు మునిగి తేలుచుందురు. మునులు తపములు సేయుచుందురు. అచట మధుర సంగీతరవములు వీనుల విందులు సేయును. అట్టి సుమనోహరమైనచోట ధర్మాత్ముడు సత్యవతీ సుతుడునగు వ్యాసుడు తపము సేయ మొదలుపెట్టెను.

అతని మహోగ్ర తేజము చరాచరలోకములనే వెలిగించెను. ధీమంతుడగు ఆ పారాశర్యుని జడ లగ్నివర్ణములయ్యెను. అతని తపము వేడిమికి దేవేంద్రుడే గడగడలాడెను. ఇంద్రుని భయవ్యాకులత్వములను రుద్రుడు గాంచెను. అపుడా రుద్రభగవాను డింద్రున కిట్లనియెను: ''ఓ యింద్రా! ఏల భీతుడవైతివి? నీకు గలిగిన శోకమునకు కారణమేమి? తాపసులను గని యెవ్వడు నెప్పుడును కోపము జెందకూడదు. మహర్షులు నన్ను శక్తి సంపన్నునిగ దెలిసికొని తపమొనర్తురు. తాపసు లెప్పుడు నితరులకు కీడు తలపెట్టరు.'' అను వచనములాకర్ణించి ''ఆ వ్యాసుడేల తపమొనర్చు చుండెను. అతని మదిలోని కోర్కి యెట్టిది?'' అని ఇంద్రుడడుగ ''ఆ వ్యాసుడు పుత్రుని కొరకు కఠిన తపమొనర్చుచున్నాడు. వ్యాసునకు తపముతో నూఱండ్లు నిండినవి. కాన నతనికిపుడు శుభకరుతనయుని ప్రసాదింతును'' అని రుద్రుడనెను. మధుర దయాసముద్రుడు ప్రసన్నవదనుడు జగద్గురువునగు రుద్రుడు వ్యాసుని జేరి యిట్లనియెను: ''ఓ సత్యవతీ తనయా! వ్యాస మునీ! లెమ్ము. నీకు సత్పుత్త్రుడుదయించుగాక! ఓ యనఘా! అమిత తేజోనిధియు జ్ఞానియు నీకు పేరు ప్రతిష్ఠలు దెచ్చువాడును లోక ప్రియుడునగు పుత్త్రుడు నీకు జన్మించుగాక! అతడు సత్త్వగుణ సంపన్నుడు సత్యవిక్రముడు పూర్ణాత్ముడు గాగలడు.'' సూతుడిట్లనెను : అను శివుని శివంకరవచనములు విని వ్యాసుడు శివునకు నమస్కరించి తన యాశ్రమమున కరిగెను. అతడు తాను పెక్కేండ్లు పడినపాట్లకు బాధపడుచు  -

అరణిలో గుప్తమైయున్న యగ్నిని మరల బొందుట కరణిని మథించుచుండెను. అపుడతని డెందమున పుత్ర కామమును గలిగెను. దండముతో నరణిని జేర్చి మథించగ మథించగా నగ్ని యుదయించెను. నాకు పుత్ప్రోత్తికి హేతువగు స్త్రీ లేనేలేదు! నాకీ యగ్నితో సమానుడగు పుత్రుడెట్లు కలుగును? కుల్పోత్పన్న రూప సంపన్న తరుణి కాళ్ళకు సంకెళ్ళవంటిది అగు కాంతను నేనెట్లు పరిగ్రహింతును? ఆమె పుత్రోత్పత్తిలో యోగ్యురాలు, పాత్రివ్య్రత జీవన రూపవతి కామిని కావచ్చును. అట్టి స్వేచ్ఛాసుఖ విధాయిని యగు నారి బంధన కారిణి. ప్రణవ స్వరూపుడగు శివు డంతటివాడే ఉమా రాగపాశ బంధములచే బద్ధుడయ్యె గదా! ఇట్లు దుర్ఘటమైన గార్హస్థ్యము నేనెట్లు నెఱపగలను అని వ్యాసుడు విచారించు చుండెను. అంతలో దివ్య కామిని యగు ఘృతాచి వ్యాసునకెట్ట యోదుట నింగిపై దోచెను. చపలములగు క్రీగంటి చూపులతో తన సమీపమున ఉన్న ఆ అప్సరః శ్రేష్టుని చూచి వ్యాసుడు వ్రతపరాయణుడయ్యు కామబాణవ్యాప్తమనస్కుడయ్యెను. ఆ సంకటము విషయమున నేనేమి చేతునని అతడు తలపోసాగెను. ఇపుడు ధర్మము ముందు దుస్తరమైన కామము పెల్లుబికినట్లున్నది. నన్నే మోసగించవచ్చిన యీ రమణిని నే నొకవేళ నంగీకరింతు ననుకొందము. అపుడు బ్రహ్మవాదులు తాపసులును కామ లోలుడనగు నన్ను గేలిసేతురు. 'ఇతడే నూఱండ్లెంతో ఘోరముగ తపించి యొక యచ్చర కొంగుబట్టుకొని తన సర్వస్వమామె ముందుంచెను' అని వారందురు. సాటిలేని సుఖము లభించినచో నిందవచ్చినను సరే! గృహస్థాశ్రమమున పుత్త్రజన్మము గల్గినచో నది సర్వసుఖము గలిగించును. అది జ్ఞానులకు మోక్షానందమును గల్గించును. ఈ దేవకన్యవలన నాకట్టి పుణ్యము గలుగదు. తొల్లి పురూరపు డూర్వశికి వశుడై తుదకామెచేతనే తిరస్కరింపబడెను అను కథను నేను నారదుని వలన వింటిని.

*ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి ప్రథమ స్కంధమందలి దశమాధ్యాయము.**_శ్రీ దేవి భాగవతం - 11 వ అధ్యాయము_*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*బుధుని జన్మ వృత్తాంతము*

☘☘☘☘☘☘☘☘☘

*ఋషులిట్లనిరి :* అపురూరవ మహారాజెవరు? దేవకన్యక యూర్వశి యెవర్తుక? ఆ మహారాజునకు కష్టములెట్లు గలిగెను? ఆ కథ మాకు వినిపింపుము. నీ ముఖకమలమునుండి వెడలు మధురసామృత మెంత గ్రోలినను తనివితీరదు. నీ వాక్కుల నుండి యమృతరసమే కురియును. అమృతములో లేని దివ్యరసము నీ వాక్కులందు గలదు. అమరుల మృతమున దనియరు. అట్లే మేము నీ వాగమృతమున దనియకున్నాము. సూతుడిట్లనియెను : మునులారా ! మున్ను శ్రీ వ్యాసునిచే చెప్పబడిన సుమనోహర దివ్యకథ నా బుద్ధికి దోచినట్లు వివరింతును వినుడు. దేవగురుడు బృహస్పతి. అతని భార్య తార. ఆమె సురూపమును వనమును కలది. అందమగు అవయవములు కలది. మదన పరవశ. ఒకనాడు రూపవనశాలిని యగు ఆ భామిని ఆ కాలమున యజ్ఞము నాచరించున్న చంద్రుని గృహమునకేగి అతని కంటబడెను. ఆ రాజముఖిని గాంచగనే చంద్రుడు కామాతురుడయ్యెను. ఆమెయును చందురుని చూచి మిక్కిలిగా కామపీడిత యయ్యెను. ఇట్లు తారాశశాంకులు పరస్పరా సురాగమున కామార్తులైరి. మదోన్మత్తులగుచు కామబాణ పీడితులైరి. కామమదమత్తులును పరస్పరానురాగాన్వితులునగు వారిరువురును అట్ల క్రీడించుచు ఎన్నియో దినములు గడిపిరి. ఇది తెలిసి గురుడు విచారగ్రస్తుడై తారను ఇంటికిదోడ్కొని రమ్మని తన శిష్యునంపెను. కాని చంద్రునిచే వశీకృతయగు నామె రాలేదు.

అట్లే మాటిమాటికి గురుడు పంపుశిష్యులను చంద్రుడు తిరుగ బంపుచుండెను. కడకు ఆ యుదారమతి యగు బృహస్పతి తానే బయలుదేరి సోమునింటికేగి మదాన్వితుడై నవ్వు చంద్రుని గని పట్టరాని రోషమున నతని కిట్లనియెను: 'చంద్రా ! ధర్మనిందితమైన పనిజేసితివేమి? సుందరియగు నా భర్యను నీవట్టె పెట్టుకొని యంటివేమి? దేవతలలోని వాడవగు చంద్రా! నీకు గురుడను. నీవు యాగముచేయుచున్న వాడవు గదా! ఓరీ మూఢా! నీవు గురుభార్య ననుభవించితివే! మీదుమిక్కిలి ఇపుడును వదలకున్నావు. బ్రహ్మహంత సువర్ణాపహారి సురాపాయి గురుతల్పశాయి వారి సంసర్గము కలవాడు అను వీరు పంచమహాపాతకులు. నీవు మహాపాపివి. దురాచారివి. అతినిందితుడవు. నీవు నా యంగన ననుభవించి నందున దేవలోకార్హుడవు కావు. ఇకనైన నా యసితేక్షణను వదలిపెట్టుము. నా యింటికామెను గొనిపోదును. కానిచో నీవు దుష్టాత్ముడవని గురుభార్యనే కూడినవాడవని లోకమున కెలుగెత్తి చాటుదును' అని పలుకుచున్న క్రుద్ధుడును భార్య యొక్క యెడబాటుచే దుఃఖితుడునైన గురునితో చంద్రుడిట్లనియెను: 'బ్రాహ్మణులు కోపముననే యపూజ్యులగుదురు. దర్మశాస్త్రము లెఱింగిన వారు పూజార్హులు. క్రోధయుక్తులు పూజయందు విడువదగినవారు. అనఘా! నీ భార్య నీ యింటికే రాగలదు. ఆ చిన్నది నా యింటిలోనే యున్నను నీకు గల్గునష్టమేమి? ఆమె తన యభీష్టము ననుసరించి కామ సుఖార్థినిగదా! ఇచట కొన్ని నాళ్లిట్టులే యుండి తన యిష్టముననుసరించి యింటికి వచ్చును. పాతకము చేసినను ఋతుమతియైన పిదప స్త్రీ దుష్టురాలుగాదనియు, పాతకియైనను వేదకర్మలాచరించుటచే విప్రుడెన్నడును నింద్యుడుగాడు అనియు గురు వర్యులగు మీరు దర్మశాస్త్ర సమ్మతమైన పలుకు మున్ను పల్కితిరి, అని చంద్రుడు పలుకగనే గురుడు మరింత దురపిల్లెను. అతడు చేయునదిలేక స్మరాతురుడై చింతావశుడై తన యింటి మొగము పట్టెను. ఇట్లు కొన్ని దినములు గడచిన పిదప గురుడు చింతాపరవశుడై మరల త్వరితగతితో నోషదీపతి యింటికేగెను. ద్వారపాలు రడ్డగించుటచేత గురుడు బయటనే యుండెను. చంద్రెడంతకును బయటికా రాలేదు. గురునకంతకంతకును కోపము మితిమీరు చుండెను. ఇతడు నాకు శిష్యుడు. గురుపత్ని తల్లియేయగును. ఐన నితడు ధర్మముతో నా దానిని బల్మితో తానే యుంచుకొనెను. ఇపుడు నేనితనిని శిక్షింతును.

గురుడు ద్వారము చెంతనే నిలుచుండి యిట్లు కేకలు పెట్టుచుండెను : 'ఓరీ మందా! పాపీ! సురాధమా! ఇంకను లోననే పండుకొని యున్నావా! వేగమే నా ప్రియకామినిని నాకిమ్ము. లేనిచో నిన్ను శపింతును. నా ప్రియను నా కీయనిచో నిన్ను భస్మమొనర్పగలను.' సూతుడిట్లనియెను : ఇట్లు గురుని పరుషవాక్కులు విని వెంటనే చంద్రుడింటిలోనుండి వెలుపలకు వచ్చెను. చంద్రుడు పక పక నవ్వుచు గురున కిట్లనియెను : ''ఏమో యెక్కువగ పలుకుచున్నావే? సర్వశుభలక్షణ లక్షితయగు ఈ అసితా పాంగి నీకు యోగ్యురాలుగాదు. నీకు తగిన కురూపను చేపట్టుము. ఒక్క బిచ్చగాని యింట నిట్టివరవర్ణిని యుండదగదు. మందమతీ! స్త్రీకి తనకు సాటివాడగు ప్రియునివలన రత్యానందము కలుగును. నీ వీ కామశాస్త్ర మర్మము లెఱుగవు. దుర్మతీ! ఇంక నీవు యథేష్టముగ పోవచ్చును. నేను ఆ కామినిని ఈయను. నీ చేతనైనది చేసికొమ్ము. ఈ వరవర్ణిని నీయను కామార్తుడవగు నీవు శపించినను నాకదితగులదు. గురూ! ఈ కాంతను నేనీయను. నీ కిష్టమైనది చేసికొమ్ము.'' సూతుడిట్లనియెను: చంద్రుడట్లు పలుకగా గురుడు చేయనదిలేక కిన్కబూని పెల్లుదురపిల్లి వేగనింద్రుని కడకరిగెను. క్రుంగిన మదితో చింతం బొగులుచుండిన గురుని దర్శించి ఇంద్రుడు అర్ఘ్యపాద్యాదివిధుల బూజించెను.

పరమోదారు డింద్రుడు దీనదశలో నున్న గురునకిట్లనియెను : 'మహాభాగా! మీ మోము విన్నబోయియున్నదే! శోకార్తుడవైతివేమి? మీ చింతవేమి? నీవు నా గురుడవు. నా యేలుబడిలో నిన్నెవ్వడవమానించెను? ఈ లోకపాలురతోడి నా సైన్యమంతయును నీ యధీనము. బ్రహ్మ విష్ణువు శివుడు దేవతలెల్లరు నీకు సాయమొనర్పగలరు. మీ చింతయేమో వేగిరమే వెల్లడించుడు'' గురుడిట్లనియెను : 'సులోచనయగు నా పత్ని తారను తారేశుడు తన చేజిక్కించుకొనెను. ఎన్ని మారులు వేడికొన్నను ఆ దుష్టాత్ముడు తిరిగి యామెను నా కిచ్చుటలేదు. ఇపుడు నేనేమిచేతును? నీవే నాకు శరణము. నేను మిక్కిలి క్లేశపడుచున్నాను. నాకీ విషయమున సాయమొనర్పుము. ఇంద్రుడిట్లనియెను : ''ధరజ్ఞా! సువ్రతా! మహామతీ! నీ వింక దుఃఖించకుము. నేను నీ దాసుడను. నీ కాంతను తప్పక తెప్పించి యిత్తును. నేనిపుడే నా దూతనంపుదును. ఆ మదమత్తుడప్పటికిని నీ భార్యనీయనిచో సురసైన్యముతో నతని మార్కొని యుద్ధము చేయుదును. అని యిటుల నింద్రుడు గురునోదార్చి విచారదర్శియు చతురుడునగు దూతను వార్త నందించుటకై చంద్రునికడ కంపెను. సువిచక్షణుడగు ఆ దూత వెంటనే చంద్రలోకమేగి రోహిణీ పతితో నిట్లు పలికెను : మహాభాగా! మహామతీ! ఇంద్రుడు నీ కొకమాట చెప్పుమని నన్నంపెను. నా ప్రభువనిన పలుకులు పలుకుచున్నాను. నీవు దర్మజ్ఞుడవు నీతివిదుడవు. నీ తండ్రి అత్రియును ధర్మాత్ముడు. కాన నీవు నింద్యమైన కార్యము చేయదగదు. ఎల్లరును తమ తమ భార్యలను యథాశక్తిగా ఎచ్చరికతో గాపాడుకొనవలయును. ఈ విషయమున కలహముకూడ జరుగునకాశము కలదు. అందు సందియము లేదు. నీవు నీ భార్యనెటుల రక్షించుకొనదలతువో గురుడును తన భార్య నటులే రక్షించుకొన దలచును. సుధానిధీ! ఎల్లభూతములను స్వాత్మభావమున జూడుము. నీ కిరువదెనమండ్రుగురు దక్షకన్యకలు గలరు. వారినందఱిని స్వేచ్ఛగ ననుభవింపుము. గురు భార్యను మాత్రము విడిచిపెట్టుము. నీవంటి గొప్పవాడే యహంకరించి నింద్య కార్యము సేయుటకు పూనుకొన్నచో నిక మూర్ఖుడునట్లే ప్రవర్తించును గదా. దాని వలన ధర్మము నశించును. మనోరమ యగు గురు నిల్లాలిని వదలిపెట్టుము. నీ నిమిత్తమున విబుధులలో కలహము చెలరేగకుండుగాక!

ఆ యింద్రుని సందేశమాలించి చంద్రుడించుక కినుకబూని ఇంద్రుని దూతతో వక్రభంగి నిట్లు పలికెను. ''ఓ మహాబాహో! నీవును ధర్మజ్ఞుడవే! దేవేంద్రుడవే! నీ పురోహితుడు నీతో సమానుడే. మీ యిద్దఱి బుద్ధులును సమానములే. చాలమంది పరోపదేశమున పండితులు. ఏ పనియైన తామే చేయవలసి వచ్చినపుడు అట్లే యాచరించువారు దుర్లభులు. ఎల్లరును బృహస్పతి రచించిన ధర్మశాస్త్రమును ప్రమాణముగ నంగీకరింతురు గదా! తన్నువలచిన కామినిని అనుభవించుట దోసముగాదని దాని యందే కలదు. ఇంతకు వీర్యవంతున కందఱును తనవారే. పాపము! బలహీనున కొక్కడును తనవాడునువాడు లేడు. ఈమె స్వీయ - ఆమె పరకీయ యను భేదములు మందమతుల భ్రమలే. ఈ తారకు నా యందనురాగమున్నంతగా బృహస్పతియందు లేదు. అనురాగవతిని వదలిపెట్టుటేమంత ధర్మము గాదు. న్యాయమును గాదు. అనురాగముగల దానియందే సంసారముగాని విరక్తురాలియందు కాదుగదా! ఆ గురుడు తనయన్న భార్య యందనురక్తుడైన నాటనుండియే యీమె కతనియందు విరక్తి గిగినది. దూతా! ఇక నీవు వెళ్లవచ్చును. నే నీ వరారోహన గురున కీయను. నీవు నా మాటగ స్వయముగ నింద్రునకిట్లు దెల్పుము: 'ఓ యింద్రా! నీవు దేవపతివి. నీకు తోచినది చేసికొనుము.' సూతుడిట్లనియెను : అని చంద్రుడు పల్కగా విని దూత యింద్రుని చెంతకేగి చంద్రుని మాటలతనికి వినిపించెను. అదివిని యమరపతి కోపాతిరేకమున తన గురునకు సాయము సేయ సేననాయత్త పరచెను. శుక్రునకు గురునకు సరిపడదు. ఆ ద్వేషముతో శుక్రుడు చంద్రునిజేరి తారను మరల గురునకీయ వద్దని యిట్లు చెప్పెను. ఓ మహామతీ ! ఆర్యా ! ఆ యింద్రునితో నీకు పోరాటము సంఘటిల్లినచో నా మంత్రశక్తిచేత నేను నీకు సాయపడుదును. చంద్రుడు గురుదారను బొందెననియును శుక్రుడు గురునకు శత్రువనియు శివుడెఱింగి బృహస్పతికి తానండగ నిలిచెను.

ఆ సమయమున తారకాసుర సంగ్రామమువలె సురాసురుల నడుమ పెక్కేండ్లు ఘోరమైన పోరు సంఘటిల్లెను. ఆ దేవదానవ సంగ్రామము గూర్చి విని వారిని శాంతింప జేయుటకు బ్రహ్మయును హంసవాహనమెక్కి యక్కడి కేతెంచెను. అపుడు బ్రహ్మ చంద్రునితో నిట్లు పలికెను : 'నీవా గురుపత్నిని వదలుము. కానిచో శ్రీ విష్ణువునకు జెప్పి నిన్ను నశింపజేతును. 'పిమ్మట బ్రహ్మశుక్రుని వారించి యిట్లనియెను : 'ఓ మహామతీ! దైత్యుల సహవాస దోషమున నీ మతియు నన్యాయమే తలపెట్టుచున్నదా? అంత శుక్రుడు చంద్రుని వారించి 'ఆ గురునాలినింక విడనాడుము. నీకిట్లు చెప్పుమని నీ తండ్రియే నన్నంపెను.' అనెను. సూతుడిట్లనియెను : శుక్రుని మాటలు విని చంద్రుడు అప్పటికి గర్భవతి యగు గురుని యిల్లాలిని తిరిగి గురునకు నప్పగించెను. గురుడు తన భార్యను మరల గ్రహించి, సంతసించి తన యింటి కరిగెను. దేనదానవులును దమ తమ నెలవుల కరిగిరి. బ్రహ్మ తన లోకమేగెను. శంకరుడు కైలాసము జేరెను. గురుడు తన మనోరమ దార యగు తారను మరల బడసి సంతసించెను. కొన్ని నాళ్లకొక శుభ దినమున శుభ తార యందు తార యందొక సుపుత్రుడుదయించెను. ఆ శిశువు గుణములలో తారాపతినే పోలియుండెను. గురుడు సంతుష్టుడై యా కుమారునకు జాతకర్మ మున్నగు కార్యములు యథావిధిగ జరిపెను. మహామతి చంద్రుడునపుడు పుత్త్ర జననము విని 'ఈ శిశువు నీ కుమారుడు గాడు. మద్వీర్య సంజాతుడు. జాతకర్మాది విదులను నీ వొనర్చితివేమి ?' అని దూతచే గురునకు వార్త నంపెను.

దూతవాక్కులు విని గురుడు 'నను బోలి యున్నందున ఇతడు నా కొడుకు. ఇందు సందేహము లేదు' అని సమాధానమంపెను. అపుడు దేవదానవులు మరల వాదించుకొనుచు సంఘములుగ కయ్యమునకై గుమికూడిరి. శాంతికాముడగు బ్రహ్మ మరల నచ్చటికి విచ్చేసి దుర్మదులై రణమొనర్ప జూచువారిని వారించెను. మరియు దర్మాత్ముడగు బ్రహ్మ తారతో 'వరారోహా! ఈ తనయుడెవరివాడో నిక్కము పలుకుము. జరిగినదంతయు నీవు చెప్పిననే కాని వీరు శాంతించరు' అని పలికెను. అపుడా వరవర్ణిని తారాధిపతివై పోరగన్నుల నగి తల వంచుకొని యా శిశువు చంద్రుని పుత్రుడేయని మెల్లగ బల్కి లోనికేగెను. అంత చంద్రుడు ముదమంది తన తనయుని నెత్తుకొని యతనికి బుధుడను పేరు పెట్టి తన నెలవున కేగెను. బ్రహ్మ తన లోకమున కేగెను. సురలింద్రుని గూడి నాక లోకము చేరిరి. ఇట్లెల్ల వారును దమ తమ నిలయముల కరిగిరి. ఇట్లు గురుని భార్యయందు చంద్రుని వనల బుధుడు జన్మించెను. ఇదే బుధుని జన్మ వృత్తాంతము. మున్ను సత్యవతీ సుతుడగు వ్యాసుని వలన నిదంతయును వింటిని. ఇపుడదే మీకు వినిపించితిని.

*ఇది శ్రీదేవీ భాగవత మహా పురాణమందలి ప్రథమ స్కంధమందు బుధోత్పత్తి యను ఏకాదశాధ్యాయము._*శ్రీ దేవి భాగవతం - 12 వ అధ్యాయము*_

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*సుద్యుమ్నస్తుతి*

☘☘☘☘☘☘☘☘☘

సూతుడిట్లనియెను : పిమ్మట బుధునకిలయందు పురూరవుడు జన్మించెను. ఆ పురూరవుడు దర్మాత్ముడు. పెక్కు యజ్ఞము లొనరించినవాడు. దానశీలుడు. అట్టి పురూరవుని జన్మవృత్తాంతము వివరింతును, వినుడు. పూర్వము సుద్యుమ్నుడను భూపతి యుండెను. అతడు సత్యవాది, జితేంద్రియుడు, ఒకనాడతడు సింధు దేశోద్భవమగు నశ్వమెక్కి మంత్రులతో గూడి కవచధారియై యందమైన కుండలములు దాల్చి అజగవమను ధనువును బాణములను చేపట్టి వేటకై యడవి కేగెను. ఆ రాజు పెక్కు రురుమృగములు, కుందేళ్ళు, పందులు, గవయములు, ఖడ్గమృగములు, శరభములు, మహిషములు, సృమరములు, వనకుక్కుటములు మున్నగు పవిత్ర వన్యములను యజ్జియములగు పశువులను పక్షులను జెండాడుచు కుమార వనమందు ప్రవేశించెను. ఆ వనమందు మేరుగిరికి దిగువలో మందార తరువులు, పొగడ చెట్లు, అశోక లతలు, సాల, తమాల, చంపక, పనసవృక్షములు మామిడి, కడిమి, ఇప్ప, గురివింద వృక్షములు మాధవీలతామండపములతో శోభిల్లుచుండెను. దానిమ్మ, కొబ్బరి, అరటి చెట్ల సముదాయమును అడవిమొల్ల మాలతి కుంద పూదీవియలును కనుల పండువుగ నుండెను. ఆ వనము హంస కారండవ పక్షులతో వ్యాప్తమై వేదధ్వనులతోను గండుతుమ్మెదల ఝంకారముతోను చెవుల పండువు సేయుచుండెను. అట్టి సుందర వనమందు సుద్యుమ్నుడు స్వేచ్ఛగ విహరించుచు రంగురంగుల పువ్వులను గనుచు మత్తకోకిల మధురగానములు వినుచు సంతసిల్లుచుండెను. ఆ రాజట్లు తన సేవకులతో వనమును దర్శించుచు పోవుచునే ప్రమోదము నిండార వనమందు జేరగనే ప్రమదగ మారెను. ఆతని మగగుఱ్ఱ మాడుగుఱ్ఱమయ్యెను. ఆ వింతగని రాజు చింతాక్రాంతుడయ్యెను. ఈ వింతకు కారణమేమో యని మాటిమాటికి వంతంజెందుచు తన నారీ రూపమునకు తలవంచుకొనుచు ఈ యాడుదనంబుతో నేనింకేమిజేతును? ఇంటి కెట్టులేదగుదును? రాజ్యమేలుట యెట్లో? వంచించిన దెవ్వరో?' యని రాజు లోలోననే తెలుపరాని బాధ పడుచుండెను.

ఋషులిట్లనిరి : ఓ సూతా! ఆ దేవసన్నిభుడగు సుద్యుమ్నుడు పడతిగనెట్లు మారెను? ఇదంతయును వింతగ నున్నది. రాజా సుందరవనమందు గ్రుమ్మరుటచే నట్లు జరుగుటకు కారణమేమి? ఆ తరువాత నతడేమి చేసెనో తెల్లమొనర్పుము. సూతుడిట్లనియెను : పూర్వము సనకాదియోగి పుంగవులు తమలోని దివ్యకాంతిపుంజములు దెసలను వెలిగించు చుండగ శివసందర్శనమున కరిగిరి. అత్తఱి శివుడు పార్వతితో క్రీడించుచుండెను. గిరిజయు వివస్త్రయై శివుని తొడపై క్రీడాసక్తురాలై యుండెను. దిగంబరయై యుండెను. ఆ మానవతి ఋషులను గాంచి తలవంచుకొని వెనువెంటనే శివునంక మందుండి దిగి వస్త్రము ధరించి భరించరాని సిగ్గుతో మేనెల్ల కంపింప నిలుచుండెను. ఆ పార్వతీ పరమేశ్వరులట్లొక్కటై శృంగార క్రీడలో మునింగి ఉండుటగని ఋషులచ్చోటు వదలి గ్రక్కున నరనారాయణాశ్రమ మేగిరి. ఆ పార్వతి లజ్జించుట గాంచి శంకరభగవానుడామెతో నీవేల లజ్జాతురవగుదువు? నీ మదిలోని కుందు బాపుదును. ఈ వనమెవడేని ప్రవేశించినచో నతడు స్త్రీరూపమందును. ఈ వనమీవిధముగ వపింపబడెనని విన్నవాడెవడైనను దోషభూయిష్ఠమైన యీ వనమును ప్రవేశింపరాదు అని పలికెను. ఆ సుద్యుమ్నున కీ శివశాపము తెలియకపోవుటచే తన మంత్రులం గూడి యందు ప్రవేశించి స్త్రీ భావము నందెను. అతడు చేయునది లేక తలవంచుకొని తన భవనమునకేగక వనమందే యటునిటు గ్రుమ్మరుచుండెను. ఆ నారిగ మారిన మహాత్ముడు 'ఇల' యను పేర బరగెను. అంతలో చంద్రుని కుమారుడగు బుధుడు విహరించుచు నచ్చటి కేతెంచి ఆ యిలాకామినిని పెక్కురు చెలికత్తియల నడుమ మనోహరిణిగనున్న దానిని జూచి కామించెను. ఆ యిలయును చంద్రుని కుమారునే తన కాంతునిగ తంచెను. వారిరువుర సంయోగ ఫలితముగ బుధునకా యిలయందు పురూరవుడను కుమారుడు జనించెను.

అటులు ఇల వనమందే తనయుని గని చింతాకులయై తనకులాచార్యుడు మునిసత్తముడగు వసిష్ఠుని నెమ్మదిలో స్మరించినది. ఆ సుద్యుమ్నుని దీనదశ జూడగనే జాలి కలిగి వసిష్ఠుడు లోకశంకరుండగు శంకరుని ప్రార్థించెను. పరమ శివుడు ప్రసాదభావము నొందుట గని రాజునకు మరల పురుషత్వము గలుగవలయునని ముని శివుని వేడుకొనెను. మహేశ్వరుడు తన పలికిన వాక్యము సత్యము జేయుటకై యితడొక నెల పురుషుడుగను నొకనెల స్త్రీగను నుండునని పలికెను. ఇట్లు రాజు వసిష్టుని దయవలన వరము బడసి తన గృహమేగి ధర్మానుసారము రాజ్యమేలుచుండెను. ఆ రాజు స్త్రీగ మారినపుడంతఃపుర మందే యుండును. పురుషుడైనపుడు రాజ కార్యములు చక్కబెట్టుచుండును. దీనికి ప్రజలుద్విగ్నులై సంతోషము జెందకుండిరి. కొంతకాలమునకు తన కుమారుడగు పురూరవుడు యువకుడు కాగా నతనికి ప్రతిష్ఠానపురము రాజధానిగ రాజ్యమొసంగి రాజు వనమున కరిగెను. పలు వృక్షములతో నుల్లము పల్లవింపజేయు రమ్యవనమందా రాజు నారదమునివలన పావనమైన నవాక్షరమంత్రము నుపదేశమంది ఆ శ్రీదేవీ మంత్రమునే భక్తిశ్రద్ధలతో నిరంతరముగ జపించుచుండెను. అంత సర్వగుణోపేతయు తరింపజేయునదియు మంగళరూపిణియు సింహారూఢయు దివ్యరూపిణియు మనోహారిణియు మద్యపానముచే మత్తయు మదముచే నాకులములైన లోచనములు గలదియునగు దేవి యతని యెడ ప్రసన్న యయి సాక్షాత్కరించెను. రాజా దివ్యమంగళమూర్తిని తన యెదుట సందర్శించగనే యతని హృదయము నుండి ప్రేమ భక్తి పెల్లుబికి యా జగదంబికను భక్తితో నీ విధముగ సంస్తుతింప దొడంగెను.

భగవతీ! దివ్యమయి విశ్వ ప్రసిద్ధమై అఖిల జగములకు మేలునకనుకూలించు నీ రూపసందర్శన భాగ్యము నాకు నేటికి లభించినది. సకల దేవగుణములు స్మరించు నీ దివ్యచరణములే నాకు శరణములు. నీ పదకమలములు కామ ప్రదములు ముక్తి ప్రదములు. నీ దివ్యస్వరూపము సురలను మునులను మోహింపజేయును. సామాన్య మానవుడెట్లెరుగ గలడు? నీ మహిమ తెలియరానిది. ఈ దీనునిపై దయ దలచితివి. ఎల్లకలుములు ప్రసాదించితివి. ఇదంతయు నా కచ్చెరువు గొల్పుచున్నది. హరి, హరుడు, బ్రహ్మ, అగ్ని, కుబేరుడు, రవి, వరుణుడు, పవనుడు, సోముడ, వసువులను వారియందెవ్వరును నీ దివ్యసుగుణ ప్రభావమెఱుగజాలరు. ఇంక గుణహీనుడగు నరుడెట్లు తెలిసికొనగలడు? మహాద్యుతియగు విష్ణువు సైతము నిన్ను సత్త్వగుణ ప్రధాన శక్తియు సకలార్థ ప్రదాయినియు కడలిపట్టియునగు లచ్చిగనే యెఱుంగును. బ్రహ్మ నిన్ను రాజస శక్తిగను రుద్రుడు తామసశక్తి యగు నుమగను దలంతురు. కాని వారును నీ నిర్గుణశక్తి స్వరూపమెఱుగ నేరరు. మందమతియై యల్ప ప్రభావముగలనే నెక్కడ? నాపై ప్రవహించు నీ మధుర దయాపూరమెక్కడ? ఓ భవానీ! నీ మహోజ్జ్వల చరిత్రను నీ దయామృత సాగరమని భావింతుము. నిన్నెవరు గొలుతురో యా సేవకులపై నీవు దయ గురిపింతువు. పద్మాలయవైన యో పద్మా! నీవు హరిని వరించితివి. ఆ పురుషోత్తముడు మహాలక్ష్మివగు నీ చేత తన పదము లొత్తించుకొనుటకు దగనని దలచి తన పవిత్ర కరములతో నీ పావన పదపద్మములనొత్తును. పురాణ పురుషుడగు హరియును విశోకుడై ప్రమదమున నీ పాదాహతిని గోరుకొనును. అట్టి సకల దేవ సన్నుతుడే మదనార్తుడై నీ పదములకు మ్రొక్కినను నీవు రోషమున నతనిని పాదాతాడన మొనర్తువు. నీలాల మేఘమాలలో మెఱుంగు తీగె శోభిల్లును. నీవా విష్ణుని యెడందసెజ్జపై కలకాలము కాంతులీనుదవు. నీకా జగత్పతియును వాహనముగ నయ్యెను గదా! ఒకవేళ నీవు కోపమున నా మధుసూదనుని విడనాడినచో నపుడా సర్వనుతుడగు హరియును శక్తిహీనుడే యగును. శాంతి శ్రీని గోల్పోయి గుణహీనుడైన వానిని తమవారే విడనాడుట ప్రత్యక్ష విదితమే. ఓ యనంత శక్తీ! బ్రహ్మాది దేవతలును రేబవళ్లు నీ భవ్య పాదపద్మములు భజింతురు. వారే నీ మణి ద్వీపము జేరి యువతులుగ మారుదురు. నీ దయాదృష్టి చేత మరల వారు పురుషులుగ మారుదురని తలంతును. ఇట్టి నీ మహాశక్తి నేమని వర్ణింపగలను? నీవు కేవలము స్త్రీ పురుషాది చిహ్నములు గలదానవే కావు. సగుణపు నిర్గుణవు నిరంజనపు కనుక నిన్నే భక్తి ప్రపత్తులతో సంస్మరించుచు మ్రొక్కులు చెల్లింతురు. నాకు నీయందు నిశ్చల భక్తి యున్న చాలు. నాకు మరే కోర్కెయు లేదు. *సూతుడిట్లనియె :* ఈ ప్రకారముగ నా రాజు సంస్తుతించగనే శ్రీదేవి సుప్రసన్నయై యతనికి బ్రహ్మ నిర్మాణము ప్రసాదించినది. ఇట్లు సుద్యుమ్నుడు దేవీ ప్రసాదమున మునులకును దుర్లభమైన ధ్రువ పరమపదమును జెందెను.

*ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి ప్రథమ స్కంధమందు సుద్యుమ్నస్తుతి యను ద్వాదశాధ్యాయము.*ఓం నమశ్శివాయ 

_*శ్రీ దేవి భాగవతం - 13 వ అధ్యాయము*_

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*ఊర్వశీ పురూరవుల చరిత్ర*

☘☘☘☘☘☘☘☘☘

ఆ విదముగ సుద్యుమ్నుడు దివికేగెను. ఇటు భువిపై సుగుణవంతుడు ప్రజారంజకుడు సుందరుడునగు పురూరవుడు రాజ్యమేలుచుండెను. ఆ రాజు ప్రతిష్ఠాన పురమందు సర్వసమ్మానితుడై రాజ్యమేలు చుండెను. అతడు ధర్మజ్ఞుడు. ప్రజా పాలన దక్షుడు. అతని మంత్రశక్తి ఇతరుల కెఱుక పడక రహస్యముగ నుండెను. అతని యుత్సాహ ప్రభుశక్తులును శ్రేష్ఠములైనవి. సామదానాదులారాజు వశమందుండెను. అతడు చక్కగ వర్ణాశ్రమ ధర్మములు పాటించుచు ఏలుబడి సాగించు చుండెను. ఆ నరపతి యొక్క నిరూప సుగుణ సందలను విక్రమౌదార్యములను గుఱించి ఊర్వశి విని రాజునందు అనురక్త యయ్యెను. బ్రహ్మశాపమున మనుజ రూపమున భువికి దిగివచ్చి ఆ నరపతి సుగుణాలగని యని యెఱింగిన యూర్వశి అతనితో ఇట్లు పలికెను : ''ఈ మేకల జంట నీయొద్దనుంతును. నీవు దీనిని కాపాడుము. నేను నిన్నుచేరి వర్తింతును. నాకాహారము నేయి మాత్రమే, ఇంకేదియు నారగించను. మైథున సమయమున గాక మరెప్పుడు నిన్ను దిసమొలతో నుండగ చూడను. ఇది నా నియమము. నా యీ నియమమును భంగమొనర్చినప్పుడు నేను నిన్ను వదలి వెళ్ళుదును.'' రాజా కామిని పలుకుల నొప్పుకొనెను. ఆ యూర్వశియు తన శాపము దీఱునందాక నతనిని గూడి విహరించు చుండెను. రాజును తొంటి ధర్మకర్మముకు స్వస్తి చెప్పి ఊర్వశీ మద మోహితుడై పెక్కులేండ్లూర్వశితో నుండెను. ఆ పుడమిఱడట్లు తీరని మోహాతిరేకమున నొక్క నిముసమేని వదలిపెట్టక యావరారోహ మీద మరులు గొని యుండెను.

ఇట్లు పెక్కులేండ్లు గడచెను. ఎంతకునూర్వశి స్వర్గసీమను జేరుటలేదు. అంత దేవరాజింద్రుడు గంధర్వులతో నిట్లు పలికెను : ఓ గంధర్వులారా! మీరు రాజునింట గల మేకల జంటను అపహరించుటద్వారా ఊర్వశిని తీసికొనిరండు. ఊర్వశి లేని యింద్ర సభ ఏమియు శోభించుట లేదు. కావున నెటులేని ఊర్వశినిటకు కొనిరండు. ఇంద్రుని వాక్యములు విని విశ్వావసువు మున్నగు గంధర్వులు కటిక చీకటిలో రాజున్నచోటి కరిగిరి. ఊర్వశి పురూరవునితో కూడి యుండగా గంధర్వులు మేకలనుగొని నింకికెగసిరి. ఆ మేకలు మేమే యని యరచినవి. వాని యర వూర్వశికి తన కొమరుల యేడ్పువలె వినబడెను. అపుడామె కోపమున రాజుతో రాజా! నీతో మున్ను నేను ప్రతిన జేసితిని. ఆ ప్రతిన నేడు భగ్నమైనది. నీయందు నాకు నమ్మకము దొలగినది. ఈ మేకలు నాకు పుత్ర సమములు. వానిని దొంగ లపహరించిరి. ఐనను నీవు స్త్రీవలె నిద్రించుచున్నావు. నీవు శూరమానివి. కునాథుడవు. నీచేత నేను వంచింపబడితిని. నాకు ప్రాణ నమములగు మేకలు పోయినవి అని వాపోవుచు పలుకుచు వెడలి పోవుచుండెను. రాజోపలేని మోహావేశమున దిగంబరముగ నామెను వెనుదగిలెను. అదే సమయమని గంధర్వులా రాజమందిరమున తళుక్కను మెఱుపు మెఱసిరి. అపుడూర్వశి దినమొలతో నరుగుదెంచు రాజును జూచినది. గంధర్వులా మేకలను త్రోవలోనే వదలి వెళ్ళిరి. దిగంబరుడగు ఆ చక్రవర్తి యా మేకలను గొని తన యింటి మొగము పట్టెను. తన పతి నగ్నుడుగ నుండగగాంచి యావరవర్ణిని రాజును వీడ్కొనినది. తన్ను విడనాడి వెళ్ళిన యూర్వశీ మోహమున పరవశుడై రాజు బిట్టు వలవరించెను. రాజు నూర్వశి మీది ప్రకామమోహమున విహ్వలుడై దిగులొందుచు రోదించుచు దేశ దేశములు గుమ్మరు చుండెను.

ఇట్లా భూపతి భూమియందెల్లెడల పరిభ్రమించుచు తుదకు కురుక్షేత్రమునందు మరల నూర్వశిని గాంచెను. అతడు సుప్రసన్నుడై మెత్తని మాటలతో నామెకిట్లనియెను : 'కఠినురాలా ! కాంతా ! నిలునిలుము. నేను పాపమెఱుగని వాడనే! నీ ప్రియకాంతుడనే! ఏనీకు వశ్యుడనే! నిన్నే నమ్ముకొని యున్నాడనే! నన్ను నీవు విడనాడి యెట్లు వెళ్ళితివి? నీవే నన్ను వదలి వెళ్ళినచో నా మేనిచ్చోటనే పడిపోగలదు. కాకులు, తోడేళ్ళు నన్ను కడుపార నారగించును,' ఈ రీతిగ రాజ కామార్తుడై కృపణుడై వివశుడై శ్రాంతుడై దిక్కులేని పక్కిచందమున బావురుమని యేడ్చెను. అపుడూర్వశి రాజుతో నిట్లనెను : ఓ నృపశార్దూలా! నీవు మూఢుడవైతివి. నీ జ్ఞానమేమైనది? స్త్రీలతోడి చెలిమి తోడేళ్ళతోడి చెలిమియే. అది తగదు. రాజెప్పుడును దొంగలను స్త్రీలను నమ్మియుండరాదు. కనుక నీవిక నింటికేగి దిగులుమాని సుఖముండుము, అని యిట్లెంతగ నూర్వశి యూరడించినను రాజు మోహాతిరేకమును వదలకుండెను. ఆ స్వైరిణి యొక్క వలపు తమిన రాజు కట్టుబడెను. కాన నతిశోకార్తుడయ్యెను. ఈ విధముగ మీకూర్వశీ పురూరవుల చరిత్ర సంక్షేపముగ చెప్పితిని. ఇది వేములందు విస్తరించి యభివర్ణింపబడినది.

*ఇది శ్రీ దేవీ భాగవత మహాపురాణ ప్రథమ స్కంధమందలి త్రయోదశాధ్యాయముఓం నమశ్శివాయ 

_*శ్రీ దేవి భాగవతం - 16 వ అధ్యాయము*_

🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*వ్యాసుడు శుకునకు శ్రీదేవీ భాగవత ముపదేశించుట*

☘☘☘☘☘☘☘☘☘

*వ్యాసుడిట్లనియె :*  ఈ ప్రకారముగ క్షీరసాగరశయనుడు వటపత్రశాయి పరమాశ్చర్యమందుచుండ శ్రీదేవి సుధలుచిందు చిరునవ్వు వెన్నెలలతో విష్ణుని గాంచుచు ననియెను : 'నీకిదంతయును వింతగ నున్నదా? నీవు మహాశక్తి ప్రభావమున మున్ను నన్ను విస్మరించితివి. ప్రళయము గడచినప్పుడెల్ల నీవు మరల మరల నుద్భవించుచుందువు. ఆ పరామూలశక్తి నిర్గుణురాలు. నీవును నేనును సగుణులము. నన్ను సాత్వికశక్తిగ నెఱుంగుము. నీ నాభికమలమునందుండి ప్రజాపతియగు బ్రహ్మ యుద్భవించగలడు. అతడు రజోగుణముతో నెల్లలోకములు మరల సృజించును. అతడంతట నుగ్రతవ మొనర్చి యుత్తమ రాజసశక్తిని బడసి రజోరాగప్రభావమున ముల్లోకములను రజోరాగముతో నింపివేయును. బ్రహ్మ త్రిగుణమయములగు పంచభూతముల నుత్పత్తిచేయును. ఆ పిదప నింద్రియములను ఇంద్రియాధిష్ఠాన దేవతలను మనస్సును సృజించును. ఈ విధముగ విధి సృష్టిరచన పూర్వమువలెనే కొనసాగించును. కావుననే బ్రహ్మ సృష్టికర్త యనంబరగును. ఓ మహాశక్తీ! విష్ణూ! ఈ సకల విశ్వమునకు నీవే పరిపాలకుడవు. నీ కన్బొమల మధ్యనుండి కోపకారణముగ రుద్రు డావిర్భవించును. అతడు మహోగ్రతపమొనర్చి తామసశక్తిని వశము చేసికొనును. ఆ రుద్రుడే కల్పాంతమున సర్వమును పొలియజేయును. నీ సన్నిధానమున కరుగుదెంచిన నన్ను సాత్త్వికశక్తిగ నెఱుగుము. మధుసూదనా! నేను పెన్నిధివైన నీ సన్నిధి యందే యుందును. నీ హృదయకమలమందే యిల్లు కట్టుకొని నిముసమైన నినుబాయక నివసింతును.

విష్ణువిట్లనియె : 'నేను మునుపు చమత్కారముగొల్పు శబ్దార్థములుగల శ్లోకార్థము వింటిని. అది పరమమై శివవై రహస్యమై రస్యమై యలరుచున్నది. ఆ వాక్కునెవరు వక్కాణించిరో తెలిపి నా యీ సందియము తొలగింపుము. నిఱుపేద ధనముకొఱకు నిరంతరముగ చింతించుచుండునట్లు నేనా శ్లోకార్థమందలి గమ్యార్థమును మాటిమాటికి సంస్మరించుచున్నాను. వ్యాసుడిట్లనియె: విష్ణుని యాపలుకు లాలకించి చారుహాసినియగు నిత్యకల్యాణి పరమప్రీతితో విరిసిన లేనగవుతో హరికిట్లనియెను: 'శౌరీ! నన్ను చతుర్భుజగ నిర్గుణగ నెఱుంగుము. నేను సగుణ నిర్గుణములుగల దాననని నీకు దెలియదా? ఆ శ్లోకార్థ మా మహాశక్తిది. నీవా మూలశక్తినే నమ్ముము. ఆ యద్భుతశక్తిచేతనే శుభకరము వేదసారమునగు పుణ్యపురాణము వెలసినదని తెలిసికొనుము. ఆ కరుణామయియగు దేవికి నీపై నెక్కడలేని వాత్సల్యము గలదని భావింతును. ఆమెయే నీ యోగక్షేమములు చూచు తల్లి. కావుననే యామె నీకా పరమరహస్యమైన వాక్యము వినిపించినది. దానిని నీ యెడదలో నిల్పుకొని యెన్నడును మరువకుము. ఆ మహావిద్యా స్వరూపిణి నీకు సర్వశాస్త్రరసాయన మెఱుకపఱచినదని యెఱుగుము. ఈ భువనత్రయమందును దానిన మించి గ్రహించవలసినది మరొండులేదు. నీవన్న నామె కెంతయో యిష్టము. కనుకనే యాయె నీకా దివ్యవాక్కు వినిచెను.''

వ్యాసుడిట్లనియె : అట్టి దేవి దివ్యవాణి నాకర్ణించి భగవానుడు దానినే పరమమంత్రరాజముగనెంచి హృదయకమలమందు దరించెను. కొంతకాలము పిదప విష్ణుని నాభికమలమునుండి బ్రహ్మ యుద్భవించెను. అతడు దానవభయభీతుడై శరణు వేడుకొనగా హరి మధుకైటభులతో బోరి వారి నంతమొందించి బ్రహ్మభయము బాపెను. పిదప కూడా హరి దివ్యరసమయమైన యాశ్లోకార్థమునే జపించుచుండెను. అది వినిన కమలజుడగు బ్రహ్మ హరిని ఓ పుండరీకాక్షా! నీవేమి జపించుచున్నావు? నీకంటె నధికుడెవడు గలడు? నీవనుస్మరించుచు ముదమందు నామంత్రమేమి? అని ప్రశ్నించెను. హరి యిట్లు పలికెను : ''మహాభాగా! నీలో నాలో సర్వములోగల కారయిత్రిశక్తిని భగవతిగ జగదంబగ భావింపుము. ఈ మహాజలరాశియు నెల్లలోకములు నే తల్లి యాధారముగ నొప్పుచున్నవో యా తల్లినే సాకారగ ననంతశక్తిగ సనాతనగ నెఱుంగుము. ఆ మహాశక్తియే యెల్లప్రాణుల జీవనాడులు స్పందింపజేయు నిత్యనూతన చైతన్యశక్తి - చరాచర విశ్వకర్త్రి-ఆమె సుప్రసన్నురాలయ్యెనా - కోరిన కోర్కులు గురియు వరదాయిని యగును. ముముక్షులకు ముక్తిప్రదాయిని యగును. ఆ తల్లియే పరావిద్య - మోక్షహేతుభూతురాలు - సంసార బంధన కారణురాలు - సర్వవిశ్వేశ్వరి. ఈ విశ్వవిశ్వమును నీవును నేనును సత్యశివసుందరశక్తివలన సంభవించిన వారమని భావింపుము. ఇది నిజము. నిజము. ఇందు సందేహము లేశమైనను లేదు. ఆమె నాకు వచించిన శ్లోకార్థమే మహాభాగవత పరమ సారము. ఆ యర్థశ్లోకమే రాబోవు ద్వాపరయుగాదిని వ్యాసభగవానునిచే భాగవతముగ వ్రాయబడును.''

వ్యాసుడిట్లనియె : ''ఆ మహామంత్రమును విష్ణువునుండి బ్రహ్మ గ్రహించి తన తనయుడగు నారదునకు సమ్మతితో నుపదేశించెను. నారదునివలన నేను విని దానిని పండ్రెండు స్కంధముల శ్రీమహాభాగవతముగ విస్తరించితిని. ఆ పురాణము బ్రహ్మ సమ్మితము. అది పంచలక్షణ లక్షితము. శ్రీదేవీ మహిమాన్వితమునై యలరారును. అది తత్త్వజ్ఞాన రసామృతము - సర్వోత్తమము - ధన్యము - పుణ్యము - ధర్మశాస్త్రసమము - సాహితీరససంభరితము - వేదార్థప్రతిపాదకము. వృత్రాసుర కథాభరితము - నానాఖ్యానక సంకలితము-బ్రహ్మవిద్యా నిధానము-సంసారార్ణవతారకము. ఓ మహామతీ! ఓ పురుషవర్యా! నీవా పరమపుణ్య పురాణ మెఱుంగుము. దానిని చదువుట కెల్ల విధముల నీవే యోగ్యుడవు. అది పదునెనిమిదివేల శ్లోకములతో కూడి అజ్ఞానపుకఱకు చీకట్లకు దివ్యజ్ఞానభాస్కర శుభోదయమైనది. సుఖశాంతులు వర్ధిల్లచేయును. దన్యము. దివ్యము. శివంకరము. విను-చదువు-వారలకు చిరాయుఃపుత్త్రపౌత్ర సౌభాగ్యముల చేకూర్చును. సూతుడు రోమహర్షణసుతుడు అతడు పరమధార్మికుడు. నా ముఖ్య శిష్యుడు. అతడు నీకు తోడుగా నీపుణ్యపురాణసంహిత పఠించగలడు.

సూతుడిట్లనియె : ఈ విధముగ వ్యాసుడు తన పుత్త్రునకు దెలుప నతనితోబాటు ఈ విశాలపురాణ సంగ్రహతత్త్వ మెఱిగితిని. శుకుడును దీనిని గ్రహించి వ్యాసాశ్రమమందే యుండెను. కాని బ్రహ్మకు పుట్టని యపరనారదునివలె యతడు ఆత్మశాంతిని బడయకుండెను. ఆత డేకాంతప్రియుడయ్యెను. విషయశూన్యునివలె దోచుచుండెను. తన యునికిలోనే తానుండెను. అతనికి భోజనము రుచించకుండెను. ఉపవాసమనిన నిష్టమేలేదు. ఇట్లాత్మ చింతాపరవశుడగు తన సుతునిగని వ్యాసుడిట్లు పలికెను: ''కుమారా! నీవింత వింతగ ఏల యేకాగ్రతతో నదేపనిగ నూరక విచారించుచున్నావు? ఋణగ్రస్తుడైన కటికదరిద్రుడు చింత్రాగ్రస్తుడగును. నీవునట్లే యేదో పరధ్యానమందున్నావు. నీ తండ్రినగు నేను బ్రతికియే యుండగ నీకీలేనిపోని లోని చింతయేల? నీవు కోరినకోర్కులన్నియు తనివార ననుభవింపుము. మదిలోన శోకముడుగుము. శాస్త్రోక్తజ్ఞాన మెఱుగుము. హృదయాంతరజ్యోతివలె విజ్ఞానమయుడవుగమ్ము. నా యీ మాటలవలన నీకైకాంతిక శాంతి చేకూరనిచో మిథిలకేగి జనకుని సన్నిధానము జేరుము. ఆ జనకుడు విదేహుడు - ధర్మమూర్తి; సత్యసంధుడు. జనకనామమున ప్రసిద్ధికెక్కెను. అతడే నీలోని మోహపు మంచుతెరలను పటాపంచలు చేయగలవాడు. నీవా రాజునుజేరి నీలోని సందేహమును బాపుకొనుము. అతనితో యథాయోగ్యమైన వర్ణాశ్రమధర్మములగూర్చి ముచ్చటించుము. అతడు రాజర్షి; జీవన్ముక్తుడు. బ్రహ్మజ్ఞానమూర్తి-శుచి-యథార్థవాది. సత్యవస్తునిష్ఠుడు. సిద్ధయోగరతుడు. బ్రహ్మతేజోబలమున మహోజ్ఞ్వలుడు. నిరంజనుడు.

ఆ మహాతేజస్వియగు వ్యాసుని వచనము లాకర్ణించి అరణిజుడగు శుకుడిట్లు ప్రత్యుత్తరమిచ్చెను : ఓ జనకా ! నాకా జనకుడు దంభాచారిగ దోచుచున్నాడు. ఏలయన, ఆ విదేహుడు జీవన్ముక్తుడుగద! మరి సుఖశాంతులతో నెట్టు రాజ్యమేలుచున్నాడు? నాకతడు వంధ్యాపుత్రుడుగ దోచుచున్నాడు. కానిచో విదేహుడు బ్రహ్మజ్ఞాని రాజ్యమెట్లు ఏలగలడు? ఇది నాకు అద్భుతమును గల్గించుచున్నది. ఈ దురంతమైన మాయా సంసారసాగరమందు నీటియందలి పద్మమువలె నా విదేహరాజెట్లు మనుగడ సాగించుచున్నాడు? విదేహ జనకుని విషయమున నందియము నాకే లొకోకలుగుచున్నది. ఆతని ముక్తిబౌద్ధుల నాస్తికత్వమువంటిదేనా? ముక్తుడు అముక్తుడెట్లగును? కర్త అకర్తయెట్లగును? ఇంద్రియ వ్యాపారముల బెడద నెట్లు వదలించుకొనవచ్చును. తల్లి-కొడుకు-భార్య-సోదరి-వారాంగన-వీరిలో పరస్పరము భేదములు గలవు గదా? ఇన్ని భేదములుండగ నభేదమైన ముక్తియెట్లు సాధ్యము? చేదు కారము వేడిమి తీపి ఉప్పు మొదలగువానిలోని రుచిని నాలుక తెలిసికొని తృప్తిజెందును. శీతోష్ణములు సుఖదుఃఖములు ననుభవించుచున్నంతకాల మాత్మముక్తి యేరీతి గల్గును? ఇదంతయు విడ్డూరమే. నాకెందులకో యిందు అద్భుతమగు సందేహము గల్గుచున్నది. వీడు శత్రువనుకొనినచో వైరము పెరుగును. వీడు మిత్రుడనుకొనినచో ప్రేమ గలుగును. మరి యారాజు ద్వంద్వముల నడుమ నుండుచు నిష్క్రియుడై యెట్లు మనుచున్నాడు? ఆ రాజు చోరుని తాపసుని నొకే రీతిగ నెట్లు చూడగలడు? బుద్ధితో స్థితప్రజ్ఞత సమతలేనిచో ముక్తి యెట్లు గల్గును? జీవన్ముక్తుడైన నరపతిని నేనింతవఱకును చూడలేదు. ఇంటియందే యుండుచు ముక్తుడయ్యెననగ నాకిందేదో సందేహము తోచుచున్నది. ఆ జనకుని గుఱించి నీవింతగ వింతగ జెప్పుటవలన నాకతనిని చూడవేడుకగుచున్నది. నా సందేహము బాపుకొనుటకు మిథిలకేగగలను.

*ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమున ప్రథమస్కంధమందు షోడశోధ్యాయం సమాప్తం*
💐🌺🌹🙏🏼🙏🏼🌹🌺💐_*శ్రీ దేవి భాగవతం - 17 వ అధ్యాయము*_

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీ శుకుడు మిథిలకు జనుట*

☘☘☘☘☘☘☘☘☘

సూతుడిట్లనియె : ఈ ప్రకారముగ మహామనస్వియగు శుకుడు పలికి చేతులు జోడించి తన తండ్రి పదకమలములకు నమస్కరించి మిథిలా ప్రయాణమునకు తరలి తండ్రి కిట్లనియెను : ఓ మహాభాగా! తండ్రీ! నీ మాట నొప్పుకొంటివి. జనకుడేలు విదేహపురిని జూడనేగుటకు నా కనుమతిమ్ము. ఆ రాజు దండములేకయే రాజ్యమెట్లు చేయును? దండనీతిలేనిచో లోకము ధర్మమున వర్తించదు. ధర్మసంస్థాపనకు దండనీతియే మూలమని మన్వాదులు వాక్రుచ్చిరి. అయ్యో! ఆ రాజు దండములేకయే రాజ్యమెట్లు చేయునాయని నా సందేహము. జనకుని ప్రవర్తన నా తల్లి వంధ్యయనినట్లు నాకు భాసించుచున్నది. దాని నిజ మెఱుంగుటకు మీ యనుమతితో అట కేగుచున్నాను. సూతు డిట్లనియెను : ఆ శుకు డహంకారమడగిన యాత్మనిష్ఠుడు నిర్లిప్తుడు జ్యోతిఃసాగరమున దేలియాడువాడు. అట్టి శుకుని తన కౌగిట జేర్చుకొని వాసుడిట్లు పలికెను: శుకా! నీకు కల్యాణమగుత. చిరంజీవివిగమ్ము. తిరిగి వత్తునని మాట యిచ్చి క్షేమముగ పోయి రమ్ము. నీ వచ్చటినుండి మరల ఇచ్చటికే రమ్ము. ఇంకొక చోటికి నీవెన్నడును పోరాదు. నీ ముఖకమలమును గాంచకున్నచో నాకు శాంతిగ మనుగడ సాగదు. నిన్నొక్కక్షణమేని చూడకున్నచో నా మనస్సు వ్యథజెందును. నాకు నీవు ప్రాణములోని ప్రాణము. జనకుని సందర్శించి నీ శంక బాపుకొని తిరిగి వచ్చి యిచ్చటనే వేదాధ్యయన పరుండవై సుఖముండును. సూతుడిట్లనియె : వ్యాసుని పలుకులు విని శుకుడు తన తండ్రికి ప్రదక్షిణ నమస్కారము లొనరించి వింటినుండి వెడలిన యమ్మువలె త్వరితముగ బయలుదేరెను. అతడు మార్గమధ్యమున పాడిపంటలు వెల్లివిరిసిన దేశములను దేశవాసులను ఫలపుష్పముల నలరు వనములను తపించు తాసనులను దీక్షితులగు యాజకులను యోగాభ్యాసపరులగు పరమయోగులను వననివాసులగు వానప్రస్థలును శైవ వైష్ణవ సౌర శాక్త పాశుపత మతస్థులను వేరువేర దర్శించుచు పయనము సాగించుచుండెను. ఆ మహాత్ముడు రెండేండ్లకు మేరుగిరిని నొక్క యేడాదిలో హిమగిరిని దాటి మిథిలవైపు సాగెను. అతడా నగరి ప్రవేశించి సకలకళా సమృద్ధులను సదాచార సంపన్నులను సందర్శించెను.

రాజద్వారము జేరగనే రాజభటు లతనిని నిలువబెట్టి ''నీవెవరవు? ఎటనుండి వచ్చితివి? నీకిందేమి పని?'' యని ప్రశ్నలు గురిపించిరి. ఐనను శుకుడు వారికి మారు పలుకలేదు. ఆ మునిబాలుడు వచ్చుపోవువారికి బాటవదలి తానొక ప్రక్కగ మిన్నువిఱిగిమీదపడినను కదలకమెదలక స్థాణువువలె నుండెను. నడుమనడుమ వింతనవ్వులు నవ్వుచుండెను. ద్వారపాలు డిట్లనియె : బ్రాహ్మణోత్తమా! నీవు మూగవా? ఇచ్చటి కేపనికై వచ్చితివి? ఎవ్వరేని ఏపనియులేకూరకే రారని నాకు తెలియును. రాజునానతిలేనిదే యెవ్వరును నగరము ప్రవేశింపరాదు. క్రొత్తగవచ్చినవాని కులశీలములెఱుగక లోనికి వెళ్ళనీయరు. నీవు వేదవిదుడవు. వైరాగ్యతేజమున వెలుగొందు బ్రాహ్మణుండవు. నీ కులమును వచ్చిన పనిని దెలిపి యథేచ్ఛగ నరుగుము. శుకుడిట్లనియె: ''నా వచ్చినపని నీ మాటలవలననే తీరినది. విదేహనగరమున ప్రవేశము దుర్లభమని తెలియుచున్నది. నా మతిమాంద్యము వలన రాజును జూడవలయుననెడి ఆసక్తితో నేనింతదూరము శ్రమపడి యేతెంచితిని. నేను నా తండ్రి మాటచే మోసపోతిని. ఇపుడెవరిని దూషింతురు? నేజేసికొన్న కర్మము కొలది ఇట్లు పర్యటించుచున్నాను. ధనాశయే పురుషుని ముప్పుత్రిప్పలు పెట్టును. నాకా యాస లేకున్నను విభ్రాంతిచే మోసపోయి యింతదూరము వచ్చితిని. నరుడు మోహపాశమునందు జిక్కుకొనకున్నచో నతనికి నిత్యసుఖము చేకూరును. నేనే కోర్కులులేనివాడనే. ఐనను మోహజలధిలో మునుగుచున్నాను. ఎక్కడి మేరుగిరి! ఎక్కడి మిథిలాపురి!! ఇంత దూరమిట్లు కాలినడకతో వచ్చుటేమి? నా రాకకు ఫలితమేమి? నన్నావిధిలీల వంచించినదని తోచుచున్నది. మేలైనను కీడైనను ప్రారబ్ధ మనుభవించక తీరదు. ఆ ప్రారబ్ధమునకు ప్రయత్నముతోడై యెల్లపనులను చేయించును. ఇంత శ్రమపడివచ్చితినేకాని ఇట నొకవేదముగాని యొకతీర్థముగాని లేదు. ఇంతకును విదేహరాజు పురమున ప్రవేశము దుర్లభము'' అని శుకుడు పలికి మౌనమూనెను. ప్రతీహారి శుకుని జ్ఞాన సంపన్నునిగ బ్రాహ్మణశ్రేష్ణునిగ దెఇసికొనెను. ద్వారపాలుడా మునితో సామవచనములనిట్లు పలికెను: ద్విజసత్తమా! నీకు పనియున్న చోటికిక స్వేచ్ఛగ నరుగుము. నిన్ను నేనడ్డగించిన నా యపరాధము క్షమింపుము. ముక్తపురుషులకు క్షమయే బలము.

శుకుడినట్లనియె : 'ప్రతీహారీ ! ఇందు నీ దోషమావంతయును లేదు. నీవు పరతంత్రుడవు. సేవకుడు తన ప్రభు నానతి నిర్వహించి తీరవలయును. నన్ను నీవు వారించుటవలన రాజును సైతము నిందించుటకు వీలులేదు. వీడు దొంగ వీడు శత్రువని చక్కగ నెఱుంగుట పండితుల లక్షణముగదా! ఇంతకు నిచ్చట నాదే పొరబాటు. పొరుగింటకేగుట లఘుత్వమునకు కారణము.' ప్రతీహారి యిట్లు పలికెను : ద్విజవరా! అందఱి మేలుగోరువానికి సుఖమేది? దుఃఖమేది? ఏది కార్యము? ఎవడు కర్త? ఎవడు శత్రువు? నాకిది తేటపఱచుము. శుకుడిట్లు వచించెను: లోకములన్నిటియందు రెండు మార్గములు గలవు. మనుజులు రెండు తెగలు. ఒకడు రాగి, వేరొకడు విరాగి. విరాగులును ముత్తెఱంగులవారు. తీవ్రవిరాగి-మధ్యమవిరాగి-మందవిరాగి అని. ఇక రాగులు రెండు విధములు. మూర్ఖుడు చతురుడునని. చాతుర్యము రెండు తరగతులు: శాస్త్ర చాతురి-బుద్ధిచాతురియు. బుద్ధియు యుక్తము-అయుక్తము నని రెండువిధములు. ప్రతీహారి యిట్లనియె : బ్రాహ్మణవర్యా! నీవు చెప్పినదంతయు నాకు తికమకగనున్నది. నరిగ వివరించి నిజమేదో తెలుపుము. శుకుడిట్లు వచించెను. ఈ సారములేని సంసారమం దనురాగముగలవాడు రాగి. అట్టివాని కెన్నెన్నియో సుఖదుఃఖములు గల్గుచుండును. నరుడు తనకు ధనము పెండ్లము కొడుకులు ఘనవిజయము అభిమానము గలిగినచో సుఖముగాంచును. అవి తనకు వేరైనవాడు దుఃఖపడును. ఎవరికి దేనివలన సుఖముగలుగునో వారా సుఖోపాయము నాచరించవలయును. దానికి విఘ్నముగల్గించువారిని శత్రులుగ నెన్నవలయును. రాగవంతునకు మిత్రుడు సుఖము గలిగించును. ధీరుడై లోచూపుగలవాడెన్నడును మోహభ్రాంతిలో మునుగడు. మూర్ఖుడే యెల్లకాలము మోహమందును. విషయవిరక్తుడు జ్ఞాని స్వాత్మనక్తుడునగు. అధ్యాత్మజ్ఞాని స్వాత్మసక్తుడునగు అధ్యాత్మజ్ఞాని నిత్యుడై తత్త్వ జ్ఞానార్థచింతనమును చేయుచు నమృతత్వముగోరి యేకాంతసేవలో ప్రత్యగాత్మను సందర్శించవలయును. అదే యతనికి బ్రహ్మానందము చేకూర్చును. ఈ మాయా సంసారమందలి మాటలన్నియును వికారములు. దుఃఖప్రదములు. మేలుగోరు యథార్థవాదికి లోకమే విరుద్ధమగును. కామము క్రోధము మాంద్యము మున్నగునని నరు ననేకరీతుల వెన్నాడు వైరులు. ఈ లోకములన్నిటిలో తన యాత్మసుఖమునకు తానే బంధువు. ఆత్మానందమునకు సాటియగు సుఖము మరేదియును లేదు.

సూతుడిట్లనియె: శుకుని ప్రబోధము విని ప్రతీహారి యతనిని మహాజ్ఞానిగ నెఱిగి చక్కని రాజమార్గమున నతనిని లోనికి ప్రవేవపెట్టెను. అంత శుకుడా నగరమందు పెక్కు విధముల ద్రవ్యరాసులను పోసి యమ్ముకొనువారు రాగద్వేషకామలోభమోహాకులులు కీచులాడుకొనువారునను మూడువిదముల మనుజులను గాంచుచు ముందునకు సాగి రాజమందిరములోనికి ప్రవేశించెను. అతడు ప్రభవలె నడచు రెండవ సూర్యుడో యన పరమవైరాగ్యమున భాసిల్లుచుండెను. లోనగూడ ప్రతీహారులు శుకునడ్డగించగా నతడు ద్వారమందే స్థాణువువలె కదలక మెదలకుండి ఆత్మమోక్షముగూర్చి విచారించు చుండెను. నీడను వేడిమిని సమముగ చూచు నా మహాతపుడు స్థాణువు పగిదినుండి వృత్తులకు మూలమును వెదకుచు నిశ్చల సమాధిలో మునింగెను.

ఒక్క ముహూర్తమాత్రముననే జనకుని మంత్రివచ్చి చేతులు జోడించి శుకుని రాజమందిరములోని రెండవ ద్వారమున ప్రవేశింపజేసెను. మంత్రి శుకునకందు విరిసిన మనోహరములైన తరువులు వనములు జూపి యతిథిమర్యాదలు జరిపెను. రాజసేవా పరాయణులు గేయ గానకళాశ్రీలు కామశాస్త్ర విశారదలునగు వారస్త్రీలను శుకునకు చేయవలసిన సేవలన్నియుచేయ నియోగించి మంత్రి తానందుండి బయటకు వచ్చెను. శుకుడందే యుండెను. ఆ కాంతలు శుకునకు వీడని భక్తితో సేవలుచేసి ఆయాకాలములకు దగిన వివిధములగు వంటకములతో శుకుని తనిపిరి. ఆ శుకుని గాంచి వారు కామమోహితులైరి. ఆ యంతిపురము మించుబోడులా విరాగికి తమ యుద్యానవనమందలి రమ్య విషయములను కలయజూపిరి. ఆ శుకుడు యువకుడు మనోహరుడు; మృదుభాషి; అపరమన్మథుడు; అతనిని గాంచగనే యాలలనల మనస్సులు కామవశమైనవి. కాని ఆ మరునిముసమందే వారతనిని విజితేంద్రియునిగ నెఱింగి పరమభక్తితో పూజలు చేసిరి. పరిశుద్ధాత్ముడగు శుకుడును వారిని తల్లులుగ భావించెను. ఆ శుకుడు ఆత్మారాముడు విజితాత్ముడు; వంతగాని సంతసముగాని చెందకుండెను. ఆ యువతులలోని మదసరాగములు గనియు విరాగభావముతో నాత్మసంస్థితి జెందెను. అపుడా కాంతలతనికి మేలైన వస్త్రములతో చక్కగ నలంకరించిన పానుపమర్చిరి. దానిచెంత మధురరసపదార్థములునిచిరి. శుకుడు పాదములు కడుగుకొని దర్భలుచేతబట్టి శ్రద్ధతో పశ్చిమసంధ్య నుపాసించి నిర్మలనిశ్చలచిత్తమున స్వాత్మసమాధియందు మునింగెను. అతడొక జాము ధ్యానమునుండి నిద్రించెను. రెండు జాములు నిదురించిన పిమ్మట మేల్కొనెను. అతడు మరల నపరరాత్రమున నాత్మధ్యానమగ్నుడయ్యెను. కొంతసేపటికి లేచి స్నానమొనర్చెను. ప్రాతఃక్రియలు నిర్వర్తించెను. స్థితప్రజ్ఞుడై వైరాగ్యజ్యోతితో బ్రహ్మతేజమున వెలుగుచుండెను.

*ఇది శ్రీదేవి భాగవతమందలి ప్రదమస్కంధమందలి సప్తదశాధ్యాయము.*

Comments

Post a Comment